వీసీ నియామకాలకు వేళాయే.. ఆఖరు తేదీ అప్పుడే..
x

వీసీ నియామకాలకు వేళాయే.. ఆఖరు తేదీ అప్పుడే..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి ప్రభుత్వ చర్యలు ప్రారంభించింది.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి ప్రభుత్వ చర్యలు ప్రారంభించింది. వెంటనే అన్ని విశ్వవిద్యాలయాల్లో వీసీ పోస్ట్‌లను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 17 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకాన్ని చేపడుతున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వీసీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. వీసీ నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. యూనివర్సిటీల ప్రక్షాళనలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం కూడా తెలిపింది. వీసీల నియామకాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ అధికారిక పోస్ట్ కూడా పెట్టారు. అందులోనే విద్యాలయాలు, యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మారకుండా చేయాలనే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ప్రక్షాళనకే ఈ నిర్ణయం: లోకేష్

‘‘రాష్ట్రంలో గత 5ఏళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను విసి లుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలోని వర్శిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము’’ అని వివరించారు లోకేష్. వీసీ పదవి కోసం అర్హులు సెప్టెంబర్ 28,2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు ప్రక్రియ ఇదే..

వీసీల నియామకం కోసం అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక విధానం చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. వీరి నియామకాన్ని పబ్లిక్ నోటిఫికేషన్, టాలెంట్ సెర్చ్ ద్వారా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల పదవీకాల ప్రాతిపదికన వీసీలుగా నియమితులైన వారు బాధ్యతలు చేపడతారు. యూజీసీ నియమనిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారిని వీసీలుగా నియమించడం జరుగుతంది. నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుంచి 20 రోజులలోపు అన్ని అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో అర్హులు దరకాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ https://apsche.ap.gov.in/ ను పరిశీలించాలి.

దరఖాస్తుకు అర్హతలు ఇవే

వీసీ పదవికి అప్లై చేసుకునే వారు..అత్యున్నత స్థాయి అర్హలతో పాటు యూనివర్శిటీ వ్యవస్థలో ప్రొఫెసర్‌గా పదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా సమానమైన హోదాలో అనుభవం, ప్రత్యేక విద్య రికార్డు కలిగి ఉండాలి. పరోధన రంగం అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్‌లో ప్రతిభ ప్రదర్శించినట్లు రుజువు చేయాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి పలు యూనివర్శిటీల వీసీ పదవికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్య ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవని ఉన్నత విద్యామండలి తన ప్రకటనలో పేర్కొంది.

వీసీ నియామకం ఈ యూనివర్సిటీల్లోనే

1. ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం

2. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి

3. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, గుంటూరు

4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ, అనంతపురం

5. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి

6. యోగి వేమన యూనివర్శిటీ, కడప

7. కృష్ణా యూనివర్శిటీ, మచిలీపట్నం

8. రాయలసీమ యూనివర్శిటీ, కర్నూలు

9. విక్రమ సింహపురి యూనివర్శిటీ, నెల్లూరు

10. JNTU కాకినాడ

11. JNTU అనంతపురం

12. JNTU విజయనగరం

13. పద్మావతి మహిళా యూనివర్శిటీ, తిరుపతి

14. ద్రవిడ యూనివర్శిటీ, కుప్పం

15. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం. కర్నూలు

16. డాక్టర్ వైఎస్సార్ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ, కడప

17. ఆంధ్రకేసరి యూనివర్శిటీ, కడప

Read More
Next Story