‘డ్యూటీ చేస్తే చాలు’.. పోలిస్ వ్యవస్థపై హోంమంత్రి ఫోకస్..
x

‘డ్యూటీ చేస్తే చాలు’.. పోలిస్ వ్యవస్థపై హోంమంత్రి ఫోకస్..

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత.. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై దృష్టి సారించారు. పోలీసు వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని, దానిని తిరిగి గాడిలో పెట్టాలని అన్నారు.


ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై దృష్టి సారించారు. పోలీసు వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని, దానిని తిరిగి గాడిలో పెట్టాలని అన్నారు. గత ఐదేళ్లలో పోలీసు శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, వారికి కావాల్సిన వసతులు, వారి సమస్యలు, అవసరాలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు అనిత. పోలీసులకు కేవలం తమ ప్రొటెక్షన్ షీల్డ్‌గా చూశారే తప్ప వారి రక్షణ కోసం ఏం కావాలి, ఏం చేయాలని అన్న విషయాలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, గత ప్రభుత్వ ధోరణి వల్ల ప్రజల్లో పోలీసులు అంటే గౌరవం పోయిందని వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వ హయాంలో అంతా మారనుందని, పోలీసులకు పోయిన గౌరవం తిరిగి లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

రిక్రూట్‌మెంట్ చాలా అవసరం

విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డులో, చెట్టు కింద ఉందని, అది కరెక్ట్ కాదని, అక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ పరిస్థితి చూస్తే రిక్రూట్‌మెంట్ ఆవశ్యకత ఎంతైనా ఉందని అర్థమవుతోందని అన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటూ అనేక మందిని రాతపరీక్షతో పోలీసులను చేసేశారని, కానీ పోలీసులకు ప్రత్యేక ఎంపిక విధానం ఉంటుందని ఆమె గుర్తు చేశారు. చేస్తే చేశారు.. రాష్ట్రంలో మహిళలకు అద్భుతమైన రక్షణ ఉందా అదీ లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజురోజుకు అధికం అవుతున్నాయని, రోడ్డుపైకి రావాలంటే మహిళ భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని, వాటన్నింటిని అనతి కాలంలో మార్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారామే.

పోలీసును చూస్తే భయపడకూడదు

నిన్నమొన్నటి వరకు రాష్ట్ర సీఐడీ ఎలా పనిచేసిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదని, ఆ విషయం ప్రతిఒక్కరికీ బాగా తెలుసని అన్నారు. ‘‘కానీ ఇకపై రాష్ట్రంలో అన్నీ మారతాయి. పీపుల్ పార్టనర్‌షిప్‌తో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మార్పు తేచ్చే దిశగా డీజీపీ అధ్యక్షతన సమావేశం నిర్వహించి చర్చించాం. పోలీసు అంటే ప్రజలు భయపడకూడదు. ఏ కష్టం వచ్చినా పోలీసులకు చెప్పాలన్న ధీమా ప్రజలకు కలగాలి. పోలీసులు, ప్రజల మధ్య సరైన సంబంధాలు ఉండాలి. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చర్చించాం. పోలీసును చూస్తే రక్షక భటుడు గుర్తుకు రావాలి కానీ భక్షకుడు కాదు’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రక్షాళన మొదలైంది

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ప్రక్షాళన మొదలైందని ఆమె వివరించారు. దిశ పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పోలీస్టేషన్ల చేస్తున్న పనేమీ లేదు. అవి ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్లుగానే ఉంది. కానీ మా ప్రభుత్వంలో అలా ఉండదు. దిశ పోలీస్ స్టేషన్లలో కూడా తగిన మార్పులు తీసుకొస్తాం. పేరు కూడా మార్చి, వాటిని ఎలా వినియోగించాలి అన్న దానిపై ఉన్నతాధికారులతో చర్చిస్తాం. పోలీసు శాఖకు మళ్ళీ పూర్వవైభవం వచ్చేలా చేస్తాం. పోలీసులను చూస్తే ప్రజలు ధైర్యంగా, భద్రతగా ఫీల్ అయ్యేలా చేస్తాం. రాష్ట్రంలో నమోదవుతున్న అక్రమ కేసులపై కూడా దృష్టి సారిస్తాం’’ అని ఆమె చెప్పారు.

త్వరలో టోల్ ఫ్రీ నెంబర్

మహిళా రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె వెల్లడించారు. ‘‘మహిళా రక్షణ, గంజాయి వినియోగం వంటి అంశాల్లో ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. గంజాయి వినియోగానికి సంబంధించి సమాచారం అందించిన వారి వివరాలను గుప్తుగా ఉంచడమే కాకుండా వారికి తగిన బహుమతిని అందిస్తాం. ఇప్పటికే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌పై కసరత్తులు చేస్తున్నాం. దీనిని అందరికీ అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. తప్పు దారిలో నడుస్తున్న యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకుంటాం. పోలీసుల సేవలను ప్రజలు సవ్యంగా వినియోగించుకునేలా, ప్రజలకు అన్ని విధాలా పోలీసులు రక్షణ కల్పించేలా చేస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

డ్యూటీ చేయండి చాలు!

అనంతరం రెడ్ బుక్‌పై కూడా ఆమె మాట్లాడారు. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య ఏమాత్రం కాదని, అది ఒకవేళ అది కేవలం కక్ష సాధింపు చర్యే అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం ఏముంటుందని, కోర్టులు సాక్ష్యాలను నమ్ముతుంది కానీ పుస్తకాలను కాదని ఆమె రెడ్‌బుక్‌పై వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. విశాఖ సీపీ కార్యాలయం తాకట్టులో ఉందని తెలిసింది. రాష్ట్రం మొత్తం చెక్ చేస్తే ఇంకా ఎన్ని కార్యాలయాలు, ఎంతమంది కార్యాలయాలు తాకట్టులో ఉన్నాయో తెలుస్తుంది. అయినా పోలీసులకు రాజకీయాలు, రాజకీయ పార్టీల గొడవలు వద్దు చక్కగా వారు డ్యూటీ చేసుకోండి, శాంతిభద్రతలను కాపాడండి అని ఆమె సూచించారు.

Read More
Next Story