ఏపీ రాజకీయ తెరపై కొత్త ఫ్రంట్‌ ఏర్పడింది. ఇందులో రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నారు. తిరుపతి వేదికగా ఫ్రంట్‌కు రూపకల్పన జరిగింది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దళిత బహుజన వాదంతో మరో కొత్త ఫ్రంట్‌ రాజకీయ తెరపైకి వచ్చింది. ఇందులో రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. ఐదు పార్టీల ముఖ్యులతో మార్చి 11న తిరుపతి కేంద్రంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో ఒక కమిటీ ఏర్పడింది. దీనిని ఏపి యునైటెడ్‌ ఫ్రంట్‌గా ప్రకటించారు. భారత దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని భారత ప్రజలు దశాబ్దాలుగా చీకటి కాలం నుంచి విముక్తి కావడం లేదని ఈ ఫ్రంట్‌ భావించింది.

యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆవిర్భావం
ఈ ఫ్రంట్‌కు ప్రధానంగా జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లో లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆయన రాష్ట్ర అధ్యక్షులు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ(రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి), తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షులు, ప్లామెంట్‌ సభ్యులు తోల్‌ తిరుమావలవన్, ఆల్‌ తెలుగు ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శివభాగ్యారావు, ప్రబుధా భారత్‌ రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ దాసరి చెన్నకేశవులు కలిసి ఫ్రంట్‌గా ఏర్పాటయ్యారు.
ప్రధానంగా మహిళలకు రక్షణ, శాంతి భద్రతలు, విద్యా రంగం, వ్యవసాయ రంగం, ఆర్థిక విధానాలు, ఉద్యోగాల కల్పన, కార్మిక సంక్షేమం, ప్రభుత్వ రంగం బలోపేతం, రిజర్వేషన్లు, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, చట్టబద్ద పాలన, రాష్ట్రాల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రధాన అంశాలపై కలిసి పని చేసేందుకు వీరు నిర్ణయించారు.
తిరుపతి నుంచి విజయకుమార్‌ పోటీ
ఏపి యునైటెట్‌ ఫ్రంట్‌ తరుఫున ఉమ్మడి అభ్యర్థిగా లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ తిరుపతి ఎంపి అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల బలోపేతమే ధ్యేయంగా పార్టీ ముందుకు వెళ్తుందని విజయకుమార్‌ చెప్పారు. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడటంలో ప్రస్తుత ప్రభుత్వాలు విఫలం కావడం, దేశంలో మత తత్వ పార్టీ రాజ్యం ఏలడం వల్ల ఈ ఫ్రంట్‌ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి వచ్చిందని విజయకుమార్‌ చెప్పడం విశేషం. దళిత బహుజన వర్గాల ఓట్లు తిరుపతి పార్లమెంట్‌ స్థానంలో ఎక్కువుగా ఉన్నందున ఏపి యునైటెట్‌ ఫ్రంట్‌ అభ్యర్థి విజయం సాధిస్తారనే ధీమాలో వారు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు పరిపాలించిన పార్టీల వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నాయకులంతా ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ప్రచారంలో దూసుకొని పోనున్నారు. ప్రధాన పార్టీలతో ధీటుగా ఆర్థికంగా అడుగులు ముందకు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తిరుపతి నుంచే ఎందుకు?
తిరుపతి పార్లమెంట్‌ స్థానం ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గం కావడం వల్ల ఇక్కడ నుంచే పోటీ చేస్తే బాగుంటుందని విజయకుమార్‌ను అభ్యర్థిగా నిర్ణయించారు. ఇటీవల ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేసి చర్రిత సృష్టించారు. ప్రధాన పార్టీల్లో వీరికి సీట్లు రానందు వల్లే విజయకుమార్, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కొత్త పార్టీలను స్థాపించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
Next Story