బీఆర్ఎస్ ఓటమి అదే అసలు కారణం.. చెప్పిన ఏపీ మంత్రి
x

బీఆర్ఎస్ ఓటమి అదే అసలు కారణం.. చెప్పిన ఏపీ మంత్రి

కేటీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఓడిపోవడానికి ఒకటే కారణమన్నారు.


‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి బలమైన కారణం ఉంది. అది వారు తాము చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవడమో.. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లు చెప్పడమో కాదు. బీఆర్‌ఎస్ నెత్తికెక్కిన అహంకారమే అసలు కారణం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించిన సందర్భంగా సత్యకుమార్ రివర్స్ కౌంటర్ వేశారు. ముందు మీ ఇల్లు చక్కబెట్టుకుని.. ఆ తర్వాత పక్కింటి పరిస్థితిపై మాట్లాడాలంటూ ఘాటుగానే బదులిచ్చారు. తెలంగాణ ప్రజలు.. అసెంబ్లీ సహా పార్లమెంటు ఎన్నికల్లో కూడా చావు దెబ్బ కొట్టినా బుద్ది రాలేదా అంటూ వ్యాఖ్యానించారు సత్యకుమార్ యాదవ్.

అసలు కేటీఆర్ ఏమన్నారంటే..

ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్‌లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తనకు చాలా ఆశ్చర్యం కలిగించాయని అన్నారు కేటీఆర్. ‘‘ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పేద ప్రజలకు భారీగా పథకాలు ఇచ్చిన జగన్ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. అంతేకాకుండా సూర్యుడు ఉదయించడంతోనే ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుంటు వాటిని తీరుస్తూ తిరిగే కేతిరెడ్డి ఓడిపోవడం మరింత విడ్డూరంగా ఉంది. ఇంత ఓడిపోయినా వైసీపీ 40శాతం ఓట్లను పొందడం మామూలు విజయం కాదు. ఈ ఎన్నికల్లో జగన్‌ను ఓడించే ఆయుధంగా షర్మిల పనిచేశారు. అంతకుమించి ఆమె చేసిందేమీ లేదు. జగన్‌ను ఓడించడం తప్ప ఆంధ్ర రాజకీయాల్లో ఆమె ప్రభావం శూన్యం’’ అంటూ కీలకంగా మాట్లాడారు కేటీఆర్. ఆయన వ్యాఖ్యాలపై ధర్మవరం ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆంధ్ర క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్న సత్యకుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు.

‘కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు’

‘‘ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు ఎలాగైతే భూమాఫియా చేశారో అదే మాదిరిగా ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ అంటూ ఉదయాన్నే మీ భూబకాసుర మిత్రుడు భూములను ఆక్రమించాడు. ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులనే కాదు చివరికి చెరువులు, కొండలను కూడా భుజించేశాడు మీ భూబకాసుర మిత్రుడు. ఇప్పటికి కూడా ధర్మవరం ప్రజలకు గుడ్ మార్నింగ్ అంటే కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమీషన్లే గుర్తుకొస్తున్నాయి. అధికారం ఊడినదగ్గర నుంచి ఫామ్ హౌస్‌కే పరిమితమైన మీరు ఎక్స్‌లో అడిగినా ధర్మవరం ప్రజలకు సమాధానం చెప్తారు’’ అని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు.

మిమ్మల్ని ఓడించింది అదే

‘‘నాలుగేళ్ల కిందట మీ అవినీతిని ప్రశ్నిస్తూ విమర్శించినందుకు ఎక్స్‌లో నన్ను బ్లాక్ చేశారు. ఆ అవినీతి, అసమర్థత, నెత్తికెక్కిన అహంకారమే మిమ్మల్ని, మీ స్నేహితులు జగన్, కేతిరెడ్డిని చిత్తుచిత్తు చేశాయి. ఒకే జాతి పక్షులైన మీరు ఒకరికొరు సర్టిఫికెట్‌లు ఇచ్చుకుంటూ.. ఓదార్చుకోండి’’ అంటూ సెటైర్లు వేశారు. మీరు ఇప్పుడు ఎంత ప్రయత్నించినా మీ నిజస్వరూపాలు, మీ అవినీతి అక్రమాలు ప్రజలకు తెలిసిపోయాయని, వారు మిమ్మల్ని మళ్ళీ నమ్మరని జోస్యం చెప్పారు.

‘ఎవర్ని అడిగాని చెప్తారు’

‘‘కేతిరెడ్డి గురించి ధర్మవరం ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ప్రజల్లోకి వెళ్లింది వారిని పీడించడానికే తప్ప వారి సమస్యలు పరిష్కరించడానికి కాదని. కేతిరెడ్డి అక్రమాల గురించి ధర్మవరంలో ఇప్పటికి కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వ్యక్తుల మిత్రుల్ని బట్టి వారి వారి మనస్తత్వం తెలుస్తుంది. ఇప్పుడు అది తెలంగాణ, ఏపీ ప్రజలకు బాగా తెలసిపోయిందంటూ చురకలంటించారు. అనంతరం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర జీడీపీ పెరగలేదు. కేసీఆర్ కుటుంబ జీడీపీ పెరిగింది అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టినందుకే తనను బ్లాక్ చేశారని అసలు విషయాన్ని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ప్రభుత్వం వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టబోతోందంటూ చెప్పుకొచ్చారు సత్యకుమార్ యాదవ్.

Read More
Next Story