పంచెకట్టుతో పార్లమెంటులోకి అడుగుపెట్టిన తెలుగు మంత్రులు.. ప్రమాణ స్వీకారం కూడా..
x

పంచెకట్టుతో పార్లమెంటులోకి అడుగుపెట్టిన తెలుగు మంత్రులు.. ప్రమాణ స్వీకారం కూడా..

పార్లమెంటులో ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార వేడుకల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రత్యేకంగా నిలిచారు. వారి వేషధారణే కాకుండా ప్రమాణ స్వీకారం చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.


సార్వత్రిక ఎన్నికలు 2024లో ఎంపీలుగా విజయం సాధించిన నేతలు ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతలు కొందరు పంచకట్టుతో హాజరయ్యారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా పదవులు తీసుకున్న నలుగురు నేతలు తమ మాతృభాష తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి ఐదుగురు కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రిమండలి సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారాలు పూర్తి చేసుకున్న అనంతరం మిగిలిన ఎంపీల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు మహతాబ్. వీరిలో తొలుత ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్ర ఎంపీల్లో కొందరు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్(చిన్ని), లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు.

పార్లమెంటుకు సైకిల్‌పై

పార్లమెంటులో ఈరోజు ఎంపీల ప్రమాణ స్వీకార వేడుకలు జరగనున్నాయి. వీటిలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా పార్లమెంటుకు చేరుకున్నారు. విజయనగరం నుంచి ఎంపీగా గెలిపిచన ఆయన తమ పార్టీ గుర్తు అయిన సైకిల్‌పైనే పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయనను పార్లమెంటు ఆవరణలోని ఇతర పార్టీల ఎంపీలు సాదరంగా ఆహ్వానించారు. అంతేకాకుండా ఆయన పార్లమెంటుకు పంచెకట్టులో వెళ్లి తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

Read More
Next Story