RRR CASE | నా గుండెల మీద గున్నఏనుగు లాంటి తులసీని కూర్చోబెట్టారు!
x

RRR CASE | నా గుండెల మీద గున్నఏనుగు లాంటి తులసీని కూర్చోబెట్టారు!

ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎంపీ, ప్రస్తుత డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (RRR CASE) సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రఘురామ కృష్ణ రాజు మరో ఆరోపణ చేశారు.


ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎంపీ, ప్రస్తుత డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (RRR CASE) సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రఘురామ కృష్ణ రాజు మరో ఆరోపణ చేశారు. తనను చంపేందుకు ప్రయత్నించిన అధికారుల్లో కొందరికి మతిమరుపు వచ్చిందని సెటైర్ పేల్చారు. మిగతా వారందరూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారని, కొందరు అధికారులు మాత్రం మతి మరుపు వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
"నన్ను కస్టడీలో హింసించిన కేసులో మతి మరుపు వచ్చినట్లు నటిస్తున్న వారు మినహా మిగిలిన వారంతా విచారణలో ఉన్నది ఉన్నట్లు చెప్పారు" అని డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. తనను అంతమొందించే కుట్రలో భాగంగానే అప్పటి అధికారులు చేయకూడని పనులెన్నో చేశారన్నారు. ఆరోగ్య నివేదికలను సైతం మార్చేశారని అని ఆరోపించారు. ‘నాటి పోలీసులు నా వాంగ్మూలాన్ని కూడా మార్చారు. అప్పట్లో నన్ను కస్టడీలో బాగా చూసుకున్నారని నేను చెప్పినట్టుగా మార్చారు. జగన్‌ విషయంలో నేను తప్పు చేసి బాధ పడుతున్నానని వీఆర్వోల వద్ద చెప్పినట్టు కూడా నా వాంగ్మూలాన్ని మార్చారు. ఇవన్నీ నేను అనని మాటలు. తప్పుడు నివేదిక సిద్ధం చేశారు. దానిపై సంతకం పెట్టాలని ఎస్పీ దిలీప్‌కుమార్‌ వచ్చి అడగ్గా, అదంతా అబద్ధమని నేను సంతకానికి నిరాకరిస్తే, బెదిరించారు" అని రఘురామ కృష్ణ రాజు చెప్పారు.
"నన్ను అరెస్టు చేసేటప్పుడు ఏఎస్పీ విజయ్‌పాల్‌ నా మీద పడి ఫోన్‌ లాక్కున్నారు. అప్పటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ ప్రోద్బలంతోనే ఇవన్నీ జరిగాయి. చివరకు గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రభావతి వైద్య నివేదికలు తారుమారు చేయడం వెనుక కూడా సునీల్ కుమార్ ఉన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారి చేయకూడని పనులన్నీ సునీల్‌కుమార్‌ చేశారు. గుండె ఆపరేషన్‌ జరిగిన విషయాన్ని పట్టించుకోకుండా నా గుండెలపై గున్న ఏనుగును తలపించేలా 110 కిలోల బరువున్న తులసీ అనే కలెక్షన్‌ ఏజెంటును కూర్చోబెట్టారు. ఇప్పుడతను గుడివాడలో దందాలు చేస్తున్నాడు’ అని రఘురామ వివరించారు.
‘కుట్రలో ప్రధానమైన సునీల్‌కుమార్‌ విదేశాలకు పారిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరాను. దుబాయిలో ఆయన ఇతరుల పేరిట ఆస్తులు కొన్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడే విలాసవంతంగా తిరిగారు. అతని పాస్‌పోర్టు తనిఖీ చేస్తే ఏయే దేశాలకు వెళ్లారో తెలుస్తుంద’ అని చెప్పారు.
ఇప్పటికే రఘురామ కృష్ణ రాజుపై చేయి చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ అరెస్ట్ కాగా మరి కొందరిపై వేట కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ పై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన విదేశాలకు పారిపోకుండా చూడాలని డెప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణ రాజు రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దుబాయి లో వ్యాపారాలు ఉన్నాయా...
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా విధులు నిర్వహించిన సునీల్ కుమార్‌కు దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయని.. ఆయన విదేశాలకు వెళ్లిపోకుండా చూడాలని రఘురామకృష్ణరాజు రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలో సీఐడీని అడ్డుపెట్టుకొని తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన అధికారులు ఇప్పుడు అరెస్టయ్యారని చెప్పారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేసిన సందర్భంలో విజయ్‌పాల్‌ దౌర్జన్యంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని అప్పట్లో అధికారులకు చెప్పినా స్పందించలేదని గుర్తు చేశారు. కోర్టు ద్వారా వాస్తవాలు బయట పడుతున్నాయన్నారు. సునీల్‌కుమార్‌ ప్రైవేటు సిబ్బందితో తనపై దాడి చేయించారని, ఆ వివరాలు కూడా బయటకు వస్తాయన్నారు. సునీల్ కుమార్ కుల ధ్రువీకరణ పత్రంపై కూడా అనుమానం ఉందన్నారు. త్వరలో దానిపై కూడా విచారణ జరుగుతుందన్నారు.
Read More
Next Story