ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతి రోజూ ఆయన రాజకీయ సంచలనాలకు కారకులవుతున్నారు.


పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడికి వెళ్లినా అక్కడ ఆయన మాట్లాడే మాటలు, చేసే పనులు రాజకీయ సంచలనాలకు కారణమవుతున్నాయి. మనసులో ఏముందో బయటకు చెప్పకుండా సూటిగా చేసి చూపిస్తున్నారు. ఉమ్మడి కుటుంబం లాంటి ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు మొత్తం కూటమి ప్రభుత్వాన్నే ఇరుకులో పెట్టాయి.

మంత్రి వర్గం అంటే అందరూ ఒకమాటపై ఉండాలని చెబుతారు నాటి పాలకులు. కానీ నేటి పాలకుల్లో ఆ కలుపుగోలు తనం లోపించింది. రాజ్యాంగం చెప్పిన ప్రకారం మంత్రివర్గానికి రెస్పాన్స్‌ బులిటీ ఉంటుంది. అది లేదంటే మంత్రి మండలి మునిగి పోతుంది. (Council of Ministers fail or Sink to gether) అనేది రాజ్యాంగ సూత్రం. దీనిని పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు పట్టించుకోలేదు. కావాలనే అలా వ్యాఖ్యానించారనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న వ్యవహారం. హోం మంత్రి అనిత తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారని విమర్శలు గుప్పించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడటం లేదు. చంద్రబాబును సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే భావన ఆయనలో ఉండి ఉంటుందనేది పలువురి మాట. పైగా నేను హోం శాఖను తీసుకున్నానంటే నేనేంటో చూపిస్తానని అనటం కూడా ఇక్కడ పెద్ద చర్చకు దారి తీసింది. ఇదంతా రాజకీయ సంచలనాలతో పాటు తాను ఎక్కడున్నా నాకు నేనే సాటి అని చెప్పుకునేందుకు పనికొస్తుందని కూడా భావించి ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది.
ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే, మంత్రి పదవి ఉన్నా ఒకటే... లేకున్నా ఒకటే... నంటూ వ్యాఖ్యానించడం కూడా రాజకీయ చర్చకు వేదికైంది. అనిత ఎస్సీ కాబట్టి ఆమెను తూలనాడుతూ, అవమానిస్తూ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారని మంద కృష్ణ మాగిగ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంద కృష్ణ కలిసి మాట్లాడిన అనంతరం బయటకు వచ్చిన తరువాత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను నేరుగా పర్యవేక్షిస్తారని, అటువంటిది ఇలా మాట్లాడారంటే తాము చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు. అంటే మంద కృష్ణ నేతృత్వంలో పవన్‌ కళ్యాణ్‌పై రాజకీయ పోరాటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక పక్క హోంశాఖ, హోం మంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు కాకరేపుతుండగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి చెందిన సరస్వతీ పవర్‌ ప్రాజెక్టుకు కేటాయించిన భూముల వ్యవహారాన్ని పరిశీలించేందుకు సత్తెనపల్లి వద్దకు వెళ్లారు. భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. భూములను తక్కువ ధరలకు అన్యాయంగా లాక్కుని అక్కడి ఎస్సీలకు జగన్‌ అన్యాయం చేశారంటూ జనం దృష్టి అటువైపు మళ్లే విధంగా వ్యాఖ్యాలు చేశారు. జగన్‌ దోచేసిన భూములు స్వాధీనం చేసుకునే వరకు నిద్రపోయేది లేదని చెప్పడటం విశేషం. పైగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి అటవీ శాఖలో కానీ, గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ చోటు చేసుకున్న పరిణామాలపై అన్ని రకాల రికార్డులు పరిశీలించారు. ఉపాధిహామీ పథకం కింద పనులు పూర్తిస్థాయిలో చేపట్టే విధంగా చర్యలు చేపట్టారు. ఉపాధి పనులు గుర్తించేందుకు ముందుగా ప్రతి పంచాయతీలోనూ ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. ఈ సంచలనానికి ఒక అంతర్జాతీయ సంస్థ ఆయనను రికార్డుల కెక్కించింది. అడవుల్లో కలప కూడా ఎవరికి ఏది అవసరమో ఆ కలపను ఎక్కువగా పెంచాలనే ఆలోచన చేశారు. కొండపల్లి, ఏటికొప్పాక గ్రామాల్లో అద్భుతంగా తయారు చేసే చెక్క బొమ్మలకు కావాల్సిన కలపను ప్రత్యేకంగా పెంచాలని ఆదేశాలు ఇవ్వడం సంచలనంగానే చెప్పుకోవచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చండి అంటూ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యాఖ్యానించారని, అటువంటి వ్యక్తిని నేనైతే ఏమి చేసే వాడినో అంటూ హోం శాఖ మంత్రిని వేలెత్తి చూపించడం కూడా చర్చకు దారితీసింది. సనాతన ధర్మంలోనే తాను బతుకుతానని, చావైనా రేవైనా అదే నా శిద్దాంత మంటూ చేసిన వ్యాఖ్యలు, ప్రాయశ్చిత్త దీక్షలు, దుర్గమ్మ గుడి మెట్లు కడిగి బొట్టు పెట్టుకోవడాలు వంటి అంశాలు కూడా రాజకీయాలకు వేదికలయ్యాయి. ప్రతి అంశంలోనూ తన వైపు జనం చూసేలా ఈ ఐదు నెలల కాలంలో చాలా కార్యక్రమాలు పవన్‌ కళ్యాణ్‌ చేపట్టారు. ఆయన అన్నా, వదిన, అమ్మ వద్దకు వెళ్లినప్పుడు వాళ్ల కాళ్లపై పడి దండాలు పెట్టటం గతంలో ఎప్పుడూ మీడియాకు కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మీడియాలో ఇటువంటి అంశాలు కూడా వస్తుండటంతో ప్రజల్లో ఒకవైపు సానుభూతి పొందుతూ రెండో వైపు రాజకీయ సంచలనాలకు కారకులవుతున్నారు.
ఇలా ప్రతి అంశం రాజకీయాలకు ముడి పెట్టి చేస్తుండటంతో పవన్‌ కళ్యాణ్‌ వైపు ప్రజలు చూస్తున్నారు. ప్రస్తుతం వార్తల్లో నాయకునిగా పవన్‌ కళ్యాణ్‌ మారారు. ముఖ్యమంత్రి ఈ ఐదు నెలల కాలంలో ఎక్కువగా ప్రభుత్వం తరపున సమీక్ష సమావేశాలకు పరిమితం అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం సమీక్షలు నిర్వహిస్తూనే వెళ్లిన ప్రతి చోటా బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ టాప్‌లేని జీపుపై ఎక్కి మాట్లాడటం పరిపాటిగా మారింది.
బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్‌ కళ్యాణ్‌ ఇలా మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. రానున్న ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలకు ధీటైన పార్టీగా జనసేన ఎదగాలంటే తమ కార్యకర్తలు ప్రతి గ్రామంలోనూ బలంగా తయారు కావాలని, అందుకోసం బీజేపీ చెప్పినట్లు చేస్తే భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ అండదండలు జనసేనకు ఉంటాయనే ఆలోచనలో ఉన్నారనేది రాజకీయ పరిశీలకుల మాట.
Next Story