షర్మిల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు?
ప్రస్తుతం తెలుగునాట వార్తల్లోని వ్యక్తి వైఎస్ షర్మిల. కాంగ్రెస్ హాట్ ఫేవరెట్. రాష్ట్రంలో ఇవాళ ఏమూలకు పోయినా ఆమె ప్రస్తావన ఏదో రూపంలో వస్తూనే ఉంది
ప్రస్తుతం తెలుగునాట వార్తల్లోని వ్యక్తి వైఎస్ షర్మిల. కాంగ్రెస్ హాట్ ఫేవరెట్. వైసీపీ ఎనిమీ. శత్రువు శత్రువు మిత్రలైనట్టు టీడీపీ జనసేన కూటమికి అనుకూల శత్రువు. ఆంధ్రప్రదేశ్ లో ఏమూలకు పోయినా ఆమె ప్రస్తావన, ఏపీలో రాజకీయ రంగ ప్రవేశం, ఆమె చేస్తున్న విమర్శలు వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. కొన్ని అనుకూలంగా.. మరికొన్ని వ్యతిరేకంగా..
“తెలంగాణలో ఫెయిలై ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన షర్మిల తన అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఏమేమో మాట్లాడుతున్నారు. ఆయన్ను ఒక పూచిక పుల్ల అన్నట్టుగా తీసి పారేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఎందుకు పనికిరాడని విమర్శిస్తున్నారు. వైఎస్సార్ , వైఎస్ జగన్ పాలనకు ఆకాశానికి పాతాళానికి వున్నంత తేడా వుందని, జగన్ కేడీ అని ..ఇలా ఏమేమో అంటున్నారు. నిమిషానికి ఒకసారి నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కూతుర్ని నేను పులి బిడ్డను, ఎవరికీ భయపడను అని ఎవరూ ఏమీ అనకముందే స్పందిస్తున్నారు“ అంటున్నారు సీనియర్ జర్నలిస్టు చెమికల రాజశేఖర్.
మరోపక్క, వైసీపీ ప్రత్యర్థులందరూ షర్మిలకు మద్దతు ఇస్తున్నట్టే కనిపిస్తున్నా వాళ్ల మెయిన్ టార్గెట్ మాత్రం జగన్ అని చెప్పకనే చెప్పవచ్చు. దానికి ప్రత్యక్ష తార్కాణం పవన్ కల్యాణ్ ప్రకటనే. ”అర్జునుడు తన ఆడపడుచుల్ని రక్షించాడే కానీ.. ఎప్పుడూ తూలనాడలేదు. జగన్ తనను తాను అర్జునుడిగా పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది. సొంత చెల్లి షర్మిలను అత్యంత నీచంగా మాట్లాడుతుంటే ప్రోత్సహించే వ్యక్తి.. తోబుట్టువుకి గౌరవం ఇవ్వని వ్యక్తి.. సొంత చిన్నాన్నను నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి.. అర్జునుడితో పొల్చుకుంటున్నాడు. ఎవరు కౌరవులు, ఎవరు అర్జునుడని.. నేను మాట్లాడను. ఇది కలియుగం. మనమెవరం అర్జునుడు, కృష్ణుడు, కౌరవులతో పొల్చుకోవద్దు. మీరు జగన్. మీది వైసీపీ. నేను పవన్. నాది జనసేన. ఎవరు మంచివాళ్లు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్లు. ఎవరు దోపిడీదారులనేది ప్రజలకు బాగా తెలుసు. వారే నిర్ణయిస్తారు” అన్నారు పవన్ కల్యాణ్.
షర్మిల మౌనం వ్యూహాత్మకమా...
ఇదే అదునుగా చోటా మోటా కాంగ్రెస్ నాయకులు సైతం జగన్ పై ఒంటికాలి మీద లేస్తున్నారు. ఈ విమర్శలకు పెద్దగా విలువ లేక పోవొచ్చు గాని జనానికి మాత్రం హాస్యాన్ని పంచుతున్నాయి. “వైఎస్ జగన్ ఓ జలగ. బటన్ రెడ్డి, సైకో” అని కాంగ్రెస్ నాయకులు తిడుతుంటే షర్మిల వింటున్నారే తప్ప అటువంటి మాటలు వద్దన్న సంకేతాలు కూడా ఇవ్వడం లేదు. పీసీసీ అధ్యక్షురాలు కదా ఆ మాత్రం విమర్శలు ఉండకపోతే ఎలా అని ఆమె భావిస్తున్నారేమోనని పిస్తుంది.
తండ్రి చాటు బిడ్డగా ఉంటుందా...
వైఎస్ షర్మిల ఏ సభలో మాట్లాడినా తాను వైఎస్సార్ కూతుర్నని, పులి బిడ్డనని, ఎవ్వరికీ తలొంచనని చెబుతోంది. గతంలో ఇవే మాటలు చెప్పి తన అన్న జగన్ అధికారంలోకి వచ్చారని భావించడం వల్లే ఆమె ఇప్పుడు తండ్రి పేరును పదేపదే ఉచ్చరిస్తోందంటున్నారు. వైఎస్సార్ అటు డాక్టర్ గా ఇటు ఎమ్మెల్యేగా ఎంతో అనుభవం గడించిన తర్వాత సీఎం పదవికి పోటీ పడ్డారు. సుదీర్ఘకాలంపాటు పని చేసిన తర్వాత సీఎం అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి. పాదయాత్రతో పార్టీని నిలబెట్టారు. సీఎం కుర్చీలో కూర్చున్నారు.
షర్మిల వస్తూనే సీఎం కుర్చీ ఎక్కాలనుకుంటున్నారా..
ఇక వైఎస్ జగన్ గురించి తీసుకుంటే ఆయన తండ్రి ఆశీస్సులతో 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎంపీ అయ్యారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి 2011 మార్చి 12న వైఎస్సార్ సీపీ పెట్టుకున్నారు. జైలు పాలయ్యారు. పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. జగన్ చెప్పుకోవడానికి చాలా ఉంది. మరి షర్మిలకు ఏముంది.. తండ్రి పేరు చెప్పడం, తన అన్న జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేశానని చెప్పడం తప్ప. తెలంగాణలో పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారనే విమర్శ ఎలాగూ ఉంది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ లో చేరారు. వస్తూనే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం ఆమెతో సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.
ప్రత్యేక హోదాయే ఆమె అస్తం...
ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల అమలు వంటి వాటిని ఆమె అస్త్రంగా స్వీకరించింది. మంచిదే. కానీ ఇప్పుడామె మాట విని బీజేపీ ఇస్తుందా అంటే ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఇప్పటికే ఓటేశారు. పవన్ కల్యాణ్ పాచిపోయిన లడ్డూ అన్నారు. ఇప్పుడు షర్మిల పోరాటం అంటున్నారు. ఇవన్నీ ఎన్నికలకు ముందు మామూలేనని జనం చెవులు కొరుక్కుంటున్నారు.
విపక్షాల మద్దతే సాయం
ఈ క్రమంలో షర్మిలకు కలిసొచ్చే ఏకైక అంశం ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ వ్యతిరేకత. ప్రతిపక్షాల మాటల దాడి. జగన్ వ్యతిరేక శక్తులు వైఎస్ షర్మిలకు మద్దతు ఇచ్చినా ఎవరి ప్రణాళికలు వారికి ఉన్నాయి. ప్రత్యేక హోదా పోరాటం పేరిట ఆమె జాతీయ స్థాయి పార్టీలను కలిసే ప్రయత్నం చేశారు. సీపీఎం తప్ప మరేపార్టీ ఆమెకు మద్దతు ఇచ్చిన సూచనలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు తన జిల్లాల పర్యటనకు విరామం ఇచ్చి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం.
తనకు, తన పార్టీకి ప్రజల్లో గుర్తింపు, పాజిటివ్ ఇమేజ్ రావాలంటే షర్మిల చాలా కష్టపడాల్సి ఉంది. ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజాదరణ పొంది ఆ తర్వాత అస్త్రశస్తాలను సిద్ధం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో విజయం సాధించడమంటే మాటలు కాదు. మూటలు కూడా. ఏమైనా ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీలో టాకింగ్ పాయింట్ గా నిలిచారనడంలో సందేహం లేదు.