బాయిలర్‌ కోళ్లు (ఫైల్‌ ఫొటో)

బర్డ్‌ఫ్లూపై అధికారులు రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. బర్డ్‌ఫ్లూ వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ల ద్వారా ఆయా జిల్లాల్లో కమిటీలు వేశారు. కమిటీల్లో హెల్త్, ఫారెస్ట్, పశు సంవర్థక శాఖ, పబ్లిక్‌ హెల్త్, పంచాయతీరాజ్, రవాణాశాఖ అధికారులు ఉన్నారు. జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు తగు చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు.

పౌల్ట్రీ యజమానులకు అవగాహన
పౌల్ట్రీ యజమానులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీములు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తేటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామాల్లో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఎడి) భోపాల్‌కు వారు బర్డ్‌ఫ్లూను నిర్థారించడంతో ప్రతి ఒక్కరూ కదిలారు. ఈ విషయాన్ని ముందుగా ‘ది ఫెడరల్‌’ వెలుగులోకి తెచ్చింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ ఇప్పటికే ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సంబంధిత శాఖల అధికారులు బర్డ్‌ఫ్లూ వచ్చిన ప్రాంతాలను సందర్శించి పది కిలోమీటర్ల దూరంలో కోళ్ల ఫారాలు పరిశీలించారు. చికెన్‌ విక్రయాలు ఆపివేశారు. దుకాణాలు ఎక్కడికక్కడ మూయించారు. శానిటేషన్‌ చర్యలు చేపట్టారు.
జిల్లాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు
ముందుగా బార్డర్‌ జిల్లాలైన ప్రకాశం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలను అలర్ట్‌ చే శారు. ఒక చదరపు కిలో మీటరు పరిధిలో వెయ్యి కోళ్లు ఉంటే ఆ జిల్లాలను ‘ఎ’ కేటగిరీ జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు.
విదేశీ పక్షులు వచ్చే సరస్సుల వద్ద అలర్ట్‌
విదేశీ పక్షులు వచ్చే సరస్సులు ఉన్న జిల్లాలను అలర్ట్‌ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో విదేశీ పక్షులు వస్తుంటాయి. అక్కడ ఆ పక్షుల నుంచి శాంపుల్స్‌ కలెక్ట్‌ చేసి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
పక్షుల నుంచి మనుషులకు..
బర్డ్‌ఫ్లూ భయంకరమైన అంటువ్యాధి. పక్షుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. గాలిద్వారా వ్యాధి వస్తుందని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ రా్రçష్టంల్లో ఈ వ్యాధి సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దేశంలో 2019లో వచ్చిన కరోనా వ్యాధికి దీనికి పెద్ద తేడా ఉండదని, పశువుల్లో వచ్చే కరోనా వ్యాధిగా భావించాలని పశువైద్యులు చెబుతున్నారు. 2021లో ఈ వ్యాధిపట్ల అందరూ అలర్ట్‌గా ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి కరోనాలో పక్షులు కూడా చాలా వరకు చనిపోయాయని, అయితే ఆ విషయాన్ని పెద్దగా అధికారులు కానీ, సాధారణ ప్రజలు కానీ పట్టించుకోలేదని పశువైద్యాధికారులు చెబుతున్నారు.
సరిహద్దు జిల్లాల్లో ఆగిన కోళ్ల రవాణా
సరిహద్దు జిల్లాల నుంచి కోళ్లను నెల్లూరు జిల్లాకు కానీ, నెల్లూరు జిల్లా నుంచి సరిహద్దు జిల్లాలకు కానీ రవాణా జరగకుండా ఆపివేసే చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ వచ్చిన ఫారాలకు పది కిలోమీటర్ల పరిధిలో సర్వైలెన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాధి వచ్చిన కోళ్ల ఫారాలకు పిది కిలోమీటరు దూరంలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు. గాలి ద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ కోళ్ల తరలింపుపై బ్యాన్‌ పెట్టారు. చికెన్, ఎగ్స్‌ మార్కెట్లు మూసివేయించారు.
Next Story