మరోసారి హాట్ టాపిక్‌గా పింఛన్ల పంపిణీ.. ఎందుకింత హంగామా!
x

మరోసారి హాట్ టాపిక్‌గా పింఛన్ల పంపిణీ.. ఎందుకింత హంగామా!

ఆంధ్రప్రదేశ్‌లో ఒకటో తేదీ వస్తుందంటూ పింఛన్ల హడావుడీ మొదలవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛన్ల పంపిణీ విషయంలో కూటమి సర్కార్ హంగామా చేస్తోంది. ఎందుకు..


రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ సకాలంలో ఆగస్టు నెల పింఛన్ అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు నెల 1వ తేదీ ఉదయం ఆరు గంటలకే పింఛన్ పంఫిణీ ప్రక్రియను ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల ముందు నుంచే రాష్ట్రంలో పింఛన్ పంపిణీ ప్రక్రియ ఎలా జరగాలి? ఒక్కో సిబ్బందికి ఎంతమంది లబ్దిదారులను కేటాయించాలి? పింఛన్ అందుకోలేకపోయిన లబ్దిదారులకు ఏం చేయాలి? వంటి అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తులు చేసిన పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఒకటో తేదీ మిస్ అయిన ప్రతి లబ్దిదారునికి రెండో తేదీ ఉదయాన్నే పింఛన్ అందేలా సూచనలు చేసింది. ఈ క్రమంలో పింఛన్ పంపిణీలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా ఇతర ప్రాంతాల్లో ఉండే పింఛన్ లబ్దిదారులంతా కూడా ఆగస్టు ఒకటో తేదీనాటికి స్వగ్రామంలో అందుబాటులో ఉండాలని కూడా అధికారులు సూచించారు.

ఇందులో భాగంగానే సెర్ప్ సీఈఓ జీ వీరపాండియన్ కీలక సూచనలు జారీ చేశారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేయాలని తెలిపారు. మొదటి రోజే 99 శాతం పంపిణీ పూర్తి కావాలని టార్గెట్ పెట్టారు. సాంకేతిక లోపం ఏదైనా వచ్చి పింఛన్ పంపిణీ ఆలస్యమైతే.. దానిని రెండో రోజు కొనసాగించాలని, అంతకు మంచి పింఛన్ పంపిణీ సమయాన్ని పొడించకూడదని సూచించారు. అదే విధంగా పింఛన్ పంపిణీ విషయంపై అన్ని గ్రామాల్లో కూడా వాట్సాప్, సోషల్ మీడియా, దండోరా సహా అన్ని మార్గాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని వెల్లడించారు.

సెర్ప్ సీఈఓ సూచనలు:

1. పింఛన్ల పంపిణీని 1న ఆగస్టు 2024న పింఛను పంపిణీ కోసం నియమించబడిన అందరు సిబ్బంది ఉదయం 6.00 గంటలకు పంపిణీ ప్రారంభిస్తారు.

2. మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలి. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పంపిణీ సమయం పొడిగింపు ఇవ్వబడదు.

3. మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ & సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఈ సమాచారం ప్రతి పించనుదారునికి చేరాలి.

4. 90 కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బంది కి మ్యాప్ చేయబడిన చోట, అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి (91 నుండి 100 పింఛనుదారులు: 86 మంది సిబ్బంది & 100 కంటే ఎక్కువ మంది పెన్షనర్లు: 12 మంది సిబ్బంది). ఈ రీ- మ్యాపింగ్ ప్రక్రియ 27.07.2024 నాటికి పూర్తి కావాలి.

5. సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్ని MPDOలు & కమీషనర్లకు పంపబడ్డాయి. ఈ మొత్తాలు 31.07.2024న సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి. అన్ని PS/WASలకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయండి. 31.07.2024న మొత్తాన్ని విత్ డ్రా చేయండి.

6. 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు SERPకి తిరిగి చెల్లించాలి.

7. చెల్లించని పింఛన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి.

8. MPDOలు & కమీషనర్లు మీ సెక్రటేరియట్లలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణీ పర్యవేక్షించాలి మరియు మొదటి రోజు పంపిణీ పూర్తి చేసేలా చూసుకోవాలి.

ఎందుకింత హడావుడీ..

పింఛన్ పంపిణీ విధానం అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందేమీ కాదు. కానీ ఇంత హడావుడీ గతంలో ఎన్నడూ జరగలేదు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటికే పింఛన్ పంపిణీ చేసిన సమయంలో కూడా వైసీపీ ఇంతటి హంగామా చేయలేదు. మరి అదే పింఛన్ పథకాన్ని, గత ఐదేళ్ల తరహాలోనే ఇంటి వద్దే అందిస్తూ కూడా ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడలేని హడావుడీ చేసేస్తోంది. ఇదంతా కూడా పింఛన్లను ఇంటి దగ్గరే అందించడానికి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అన్న తమ ఎన్నికల ముందు వాదనను జస్టిఫై చేసుకోవడానికే అన్నట్లు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరికొందరు.. వాలంటీర్లను తన ప్రైవేట్ ఆర్మీగా, ప్రజాధనాన్ని దోచుకోవడానికి పావులుగా జగన్ వినియోగించుకున్నారు తప్ప వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఎటువంటి నష్టం ఉండదు అని ప్రజలకు తమ చేతల ద్వారా చెప్పాలని మాత్రమే కూటమి యోచిస్తోందని, ప్రజల సంక్షేమం, వృద్ధుల శ్రేయస్సే ముఖ్యమైతే 2014-2019 మధ్యలో ఇలాంటి ఆలోచన ఎందుకు చేయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు.. అప్పుడు వృద్ధుల కష్టాలు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు.

ఇంకొందరు.. ఎవరు ఏం చేసినా.. పింఛన్ల పంపిణీ విషయంలో కొత్త నిబంధనల ద్వారా ప్రతి లబ్దిదారు లాభపడతారని, పింఛన్ పక్కాగా అందుతుందని అంటున్నారు. ఐడియా ఎవరిదైనా తర్వాత వచ్చే నాయకుడు ఆ ఐడియాను మరింత మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని, పింఛన్ల విషయంలో చంద్రబాబు అదే చేస్తున్నారని, ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచారం చేస్తుండటంతో కొందరు దాన్ని జీర్ణించుకోలేక అనవసర హంగామాగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Read More
Next Story