ఆంధ్రలో అయోమయ వాతావరణం.. ఒకవైపు ఎండ మరోవైపు వర్షం..
x

ఆంధ్రలో అయోమయ వాతావరణం.. ఒకవైపు ఎండ మరోవైపు వర్షం..

భారతదేశ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రలో ఈరోజు దాదాపు 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయొచ్చని రాష్ట్ర విపత్తులు సంస్థ ఎండీ..


భారతదేశ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రలో ఈరోజు దాదాపు 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీయొచ్చని రాష్ట్ర విపత్తులు సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. అదే విధంగా మరో 43 మండలాల్లో వడగాలులు వీయొచ్చని కూడా ఆయన అంచనా వేశారు. ఈ వడగాలుల ప్రభావం చుట్టుపక్కల మండలాలపై కూడా ఉంటుందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి తగిన చర్యలు తీసుకోవాలని, వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని చెప్పారు.

శనివారం విజయనగరం 6, పార్వతీపురంమన్యం 9 మండలంలో తీవ్రవడగాల్పులు, శ్రీకాకుళం 10, విజయనగరం 18, పార్వతీపురంమన్యం 5, విశాఖ1, అనకాపల్లి 7, అనంతపురం 2 వడగాలులు వీచే అవకాశం ఉందని వీచే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదివారం కూడా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులే ఉండొచ్చని అంచనా వేశారు.ఆదివారం విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

శుక్రవారం భానువు వీర ప్రతాపం చూపాడని అందుకు రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలే నిదర్శనమని చెప్పారు. పల్నాడు జిల్లా వినుకొండలో 45.9°C, ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో 45.4°C, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3°C, గుంటూరు జిల్లా తుళ్ళూరు, ఫిరంగిపురంలో 45°C, బాపట్ల జిల్లా పర్చూరులో 44.8°C, నెల్లూరు జిల్లా జలదంకిలో 44.4°C, కృష్ణా జిల్లా కోడూరులో 44.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. రెండు మండలాల్లో తీవ్ర, 69 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

Read More
Next Story