ఏపీలో మళ్ళీ వర్షాలు.. విజయవాడలో ఇప్పటికే మొదలు..
x

ఏపీలో మళ్ళీ వర్షాలు.. విజయవాడలో ఇప్పటికే మొదలు..

ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అందులో ముఖ్యంగా బెజవాడను రండు రోజుల పాటు పడిన వర్షాలు వరదలతో ముంచెత్తాయి. వరదల ఉధృతికి బెజవాడ అంతా బెంబేలెత్తిపోయింది.


ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అందులో ముఖ్యంగా బెజవాడను రండు రోజుల పాటు పడిన వర్షాలు వరదలతో ముంచెత్తాయి. వరదల ఉధృతికి బెజవాడ అంతా బెంబేలెత్తిపోయింది. లక్షలాది మంది ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారికి సహాయక చర్యలు అందించడానికి ప్రభుత్వం, అధికారులు యుద్ధప్రాతిపదికన అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు కావాల్సిన ఆహారం, తాగునీరు, ఔషధాలను అందించే పనులను చేపట్టారు. హెలికాప్టర్లు, బోట్లుతో పాటు హెలికాప్టర్లు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల సహాయంతో ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా వరదలు తగ్గిన ప్రాంతాల్లో బురదను తొలగించడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి ప్రజలు బయటపడుతున్నారు. ఇంతలో కేంద్ర వాతావరణ శాఖ వారికి పిడుగులాంటి వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ హెచ్చరికలు బెజవాడ ప్రజలను ఆందోళనకు గురిచేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడింది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించొచ్చని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం కారణంగా రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారు చెప్తున్నారు. వీటితో పాటుగా ఈరోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురవచ్చని అధికారులు చెప్తున్నారు.

విజయవాడలో మొదలైన వర్షాలు

ఆంధ్రప్రదేశ్ వర్ష సూచన బలంగా ఉన్న క్రమంలో బెజవాడలో ఇప్పటికే మళ్ళీ వర్షాలు పడటం మొదలైపోయింది. ఈ వర్షాలు వరద భాదితులకు అందిస్తున్న సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది. అంతేకాకుండా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో మళ్ళీ వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా రానున్న పరిస్థితులను అంచనా వేస్తూ ముందడుగు వేస్తోంది. సీఎం చంద్రబాబు సహా మంత్రులు సైతం రాష్ట్రంలో వరదల ప్రమాదంపై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

నిలిచిన రాకపోకలు..

కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న వర్షాల కారణంగా మొబ్బ సబ్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో పామర్రు-చల్లపల్లి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు సహా ఇతర వాహనాలు సైతం ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అక్కడ నేలకొరిగిన వృక్షాన్ని తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు.

Read More
Next Story