అసమ్మతివాదులపై షర్మిల సమరభేరి: పీసీసీలో ముదిరిన లొల్లి
ఏపీసీసీ చీఫ్ షర్మిల, పార్టీ నేతల మధ్య సఖ్యత ఏమాత్రం కుదరడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ల గదులకు కూడా షర్మిల తాళాలు వేయించారు. ఆంధ్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నెలకొంది. ఏపీసీసీ చీఫ్ షర్మిల, పార్టీ నేతల మధ్య సఖ్యత ఏమాత్రం కుదరడం లేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి షర్మిల రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. షర్మిల ఒంటెద్దు పోకడల వల్లే రాష్ట్రంలో పార్టీ పరాజయం పాలయిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ ఆఫీసులోని పార్టీ అనుబంధ విభాగాల కార్యాలయాలకు షర్మిల తాళాలు వేసుకోవడం మరో సంచలన పరిణామంగా మారింది. పార్టీ ఆఫీసులోని గదులకు తాళాలు వేసే అధికారం షర్మిలకు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాళాలు అందుకేనా!
ఈ నేపథ్యంలో తనపై పార్టీ అధిష్టానానికి కొందరు నేతలు ఫిర్యాదు చేయడంతో షర్మిల తీవ్ర ఆగ్రహానికి గురైందని, ఆ కోపంతోనే పార్టీ ఆఫీసులోని కొన్ని విభాగాల గదులకు తాళాలు వేశారని కొందరు చెప్తున్నారు. విజయవాడలోని పార్టీ ఆఫీసులో వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేష్ గదులకు కూడా తాళాలు వేయడం మరింత దుమారం రేపుతోంది. ఆమెపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన వారిలో వీరే ప్రథమం కావడంతోనే వారికి గదులకు తాళాలు వేయించారని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా తనపై ఫిర్యాదులు చేసిన వారికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే షర్మిల ఇలా చేస్తున్నారని, పరిస్థితులను అర్థం చేసుకోకుండా మరోసారి ఒంటెద్దు పోకడనే కనబరుస్తున్నారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇలా చరిత్రలో లేదు: పద్మశ్రీ
పార్టీ ఆఫీసులోని గదులకు తాళాలు వేయడం తానెన్నడూ చూడలేదని పద్మశ్రీ చెప్పుకొచ్చారు. ‘‘ఏఐసీసీ చరిత్రలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల గదులకు తాళాలు వేసే, అన్న కమిటీలను తక్షణం రద్దు చేసిన ప్రెసిడెంట్‌ను పార్టీ నాయకత్వం కానీ, పార్టీ కానీ చూసిన దాఖలాలు లేవు. ఇటువంటి ఘటన చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి నిజానిజాలు తేల్చే కమిటీ కోసం పిలుపునివ్వడంతో దానికి స్పందనగా అధ్యక్ష పదవిలో ఉన్న నేత ఇలా స్పందించడం ఇదే తొలిసారి. ఈ ప్రవర్తన సంస్థాగత నిర్మాణం పట్ల షర్మిలకు ఉన్న అసహ్యాన్నే కాకుండా పార్టీ కోసం క్యాడర్ చేసిన సేవ, శ్రమను కూడా విస్మరిస్తున్నట్లు స్పష్టం చేస్తుంది’’ అని పద్మశ్రీ చెప్పుకొచ్చారు.
అసలేంటీ ఈ తాళాల గోల!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఘోర పరాజయం తర్వాత పార్టీకి చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ రద్దు తక్షణం అమలవుతుందని వెల్లడించారు. అతి త్వరలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే పాత కమిటీ సభ్యులు ఉన్న గదులకు తాళాలు వేసి ఎవరూ లోపలికి వెళ్లకూడదని, కొత్త కమిటీల ఏర్పాటు తర్వాత వాళ్ళు వచ్చి హ్యాండోవర్ చేసుకుంటారని షర్మిల చెప్పారని సమాచారం. దీంతో కొత్త కమిటీలు ఏర్పడే వరకు తాము(పాత కమిటీ సభ్యులు) ఆ గదుల్లో కుర్చుంటే తప్పేంటి అని రద్దయిన కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అవును.. కుర్చుంటే తప్పేంటి!
ఈ విషయంపై స్పందిస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం అవును కొత్త కమిటీల ఏర్పాటు వరకు పాత కమిటీ సభ్యులు ఆ గదుల్లో కుర్చుంటే తప్పేంటి? షర్మిల ఎందుకు తాళాలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ గదుల్లో పాత సభ్యులను కూర్చోవడానికి అనుమతినిస్తే వారు కొత్త కమిటీల ఏర్పాటుకు పట్టే సమయంలో తమ అవకతవకలను మాయం చేసే అవకాశం ఉందని షర్మిల భావించి ఉంటారని, అందుకనే వెంటనే ఆ కమిటీల కార్యాలయ గదులకు తాళాలు వేయించేశారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. కాగా రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాకుండా హైకమాండ్ చెప్పే షర్మిల ఈ చర్యలు తీసుకున్నారా? అన్న వాదనలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.