వైఎస్‌ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. కుమారుని ఎంగేజ్‌మెంట్‌ పూర్తి కాగానే బాధ్యతలు చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.


ఈనెల 18న వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది. ఈ నిశ్చితార్థం పూర్తి కాగానే 19న ఏపీసీసీ బాధ్యతలు చేపట్టే అంశంపై వైఎస్‌ షర్మిల చర్చించనున్నారు. ముఖ్యులందరితో కూర్చుని మాట్లాడిన తరువాత ఏరోజు బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందనే అంశాన్ని నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కుమారుని వివాహం వచ్చే నెల 17న జరుగుతుంది. ఎంజేజ్‌మెంట్‌ కార్యక్రమం 18న ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరగనున్న ఈ నిశ్చితార్ధానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా కుటుంబసభ్యులంతా హాజరుకానున్నారు.

చాలాకాలంగా సోదరుడు జగన్‌తో దూరంగా ఉన్న వైఎస్‌ షర్మిల తన కుమారుడి పెళ్లి నిశ్చితార్ధం, పెళ్లికి స్వయంగా తాడేపల్లి వచ్చి ఆహ్వానించారు. ఆ తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా అందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు హాజరౌతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ హాజరయ్యే పక్షంలో వైఎస్‌ జగన్‌తో కలిసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
నిశ్చితార్ధ ఆహ్వానాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని వైఎస్‌ షర్మిల ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అందుకే సీఎం జగన్‌తో పాటు ఇంకా ఎవరెవరు హాజరౌతారనేది ఆసక్తి రేపుతోంది. పిబ్రవరి 17న పెళ్లి జోధ్‌పూర్‌లోనూ, ఫిబ్రవరి 24న రిసెప్షన్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌ ఫోర్ట్‌ గ్రౌండ్‌లో ఉంటుంది. వైఎస్‌ మరణానంతరం ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story