ఆంధ్ర ప్రదేశ్ అంగన్ వాడీ కార్యకర్తల మీద ఎస్మా ప్రయోగం
x
ఎస్మా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని తగులబెడుతున్న అంగన్ వాడీ కార్యకర్తలు

ఆంధ్ర ప్రదేశ్ అంగన్ వాడీ కార్యకర్తల మీద ఎస్మా ప్రయోగం

జగనన్న ఇచ్చిన హామీనే అమలు చేయాలని వారంతా సమ్మె చేస్తున్నారు. వారి మీద ఇపుడు ఎస్మా ప్రయోగించారు.


జువ్వాల బాబ్జీ

అంగన్‌వాడీ కార్యకర్తల మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా( Essential Services Maintenance Act: ESMA)చట్టం ప్రయోగించింది.

అంగన్‌వాడీ కార్యకర్తలంతా మహిళలు. చాలా తక్కువ జీతాలతో వూరువాడలకు అనేక విలువయినసేవలందించే కార్యకర్తలు వాళ్లు. ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు 55,607 సెంటర్స్ లో 1.06 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటే బాలింతలకు, తల్లులకు, శిశువులకు ఆరోగ్యసంబంధమయిన సేవలు అందిస్తున్నారు.

గత ఎన్నికల ముందు వాళ్ల జీతాలు పెంచుతానని ప్రతిపక్ష నేత గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన పదవీ కాలం అయిపోతూ ఉంది. ఆ హామీ మాత్రం ఇంకా అమలుకాలేదు. ఇదేమిటి అని వారు పశ్నిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 12 తేదీ నుంచి హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెచేస్తున్నారు. ఒక వైపు వాళ్లు సమ్మెవిరమించేందుకు చర్చలు జరగుతూనే ఉన్నాయి. అయినా మరొక వైపు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "ఎస్మా"ప్రయోగించింది. అయితే, దీనిని లెక్క చేయకుండా కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఎస్మా అంటే ఏమిటి?

ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయిన్ ట్నెన్స్ యాక్ట్.

1981 సం. లో రూపొందించారు. అత్యవసర సేవలు నిర్వహణ ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఈ సేవలకు సంబంధించిన రంగాలలో సమ్మెలను ఆందోళనను నిషేధించడం ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టాన్ని ఎందుకు తేవాల్సి వచ్చిందోతెలుసా? 1981 సం. లో దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దాని తీవ్రత ను గుర్తించిన ప్రభుత్వం సమ్మెను నిషేధిస్తూ మొదట ఎస్మా ఆర్డినెన్సు తీసుకు వచ్చి, తర్వాత చట్టం చేసింది.

అసలు అత్యవసర సేవలు అంటే ఏమిటి?

ప్రజల దైనందిన జీవితానికి సంబంధించిన అన్ని రకాల సేవలు అంటే నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుధ్యం, రవాణా, తంతి తపాలా, పెట్రోలు, విద్యుత్, బ్యాంకింగ్, ఆహార ధాన్యాలు మరియు ఆహార పదార్థాల పంపిణీ మొదలగునవి.




"ఎస్మా "ను ఉల్లంఘిస్తే ఏమవుతుంది?

ఈ చట్ట ప్రకారం ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఇక ఆయా రంగాల లో సేవలు అందించే వారు సమ్మె చేయడమనేది "చట్ట విరుద్ధ" కార్య కాలపం అవుతుంది. అలా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తో సంబందం లేకుండానే, పోలీస్ లు అరెస్టు వారెంట్ లేకుండా కూడా అరెస్టు చేయ వచ్చు. గతంలో ఇటువంటి ప్రయోగాలు దేశ వ్యాప్తంగా జరిగాయి.

2003 సంవత్సరం లో జయలలిత ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఉపాద్యాయులు చేసిన నిరవధిక సమ్మె పై ఎస్మా ప్రయోగించి 1,70,000 మందిని విధుల నుండి తొలగించింది. ఆ వార్త దేశ వ్యాప్తంగా సంచలన మైంది.

అంగన్ వాడీ సేవలు అత్యవసర సేవలవుతాయా?

అంగన్ వాడీ కార్యకర్తల నుంచి 6 సం. ల లోపు పిల్లలు 7.5 లక్షల మంది, అలాగే 45 వేల మంది గర్భిణీ స్త్రీలు, బాలింత లు సేవలు పొందున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రతీ రోజు తల్లి ప్రేమతో ఇంటింటికీ వెళ్లి, అభం శుభం తెలియని చిన్నారుల ను లాలించి, మురిపించి, సెంటర్ కు తీసుకు వెళ్ళి అక్కడ ఆడించి, పాడించి, అన్నం పెట్టిన తర్వాత నిద్ర పుచ్చుతారు. ఉదయం 9 గం నుండి సాయంత్రం 4 గం వరకు కాపలా కాస్తూ, కులీ నాలీ చేసుకొని వచ్చే పేద తల్లుల కు, ఒంటరి మహిళ లకు, మేమున్నాం అనే భరోసా ఇస్తారు. పిల్లలు చేసే అల్లరి ఓర్పుతో భరిస్తారు. అటువంటి తల్లులు చాలి చాలని జీతాలు తో కుటుంబాలు గడుపుకోవాల్సి వస్తుంది. ఆ జీతాలు కూడా సమయానికి రాక, పిల్లల ఫీజులు కట్టలేక, ఇంటి అద్దె కట్టు కోలేని స్థితి లో బ్రతుకు బండి లాగుతున్నారు. చివరికి సెంటర్ లు అద్దె ఇల్లలో కొనసాగుతూ ఉంటాయి. నెలల తరబడి సెంటర్లకు అద్దె కట్టక పోతే, యజమాని ఖాళీ చేయమని బలవంతం చేస్తే అవమానాలు పడాల్సి వస్తుంది.





అంగన్ వాడీ కార్యకర్తల సమ్మె ఎందుకు?

ఇదంతా ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వానికి తెలియనిది కాదు. అయినా సరే, పోలీసుల లాఠీలతో కొట్టిస్తున్నారు. మహిళ లని చూడకుండా, జుట్టుపట్టి, ఈడ్చుకెల్లి పోలీస్ వ్యాన్ లో పడవేస్తున్నారు. అయినా,అంగన్వాడీ కార్యకర్తలు మొండిగా ముందుకు సాగుతున్నారు.ప్రభుత్వం చట్ట ఉల్లంఘన కు పాల్పడుతూ నిర్భంద చర్యలకు ఉపక్రమించింది. ఇప్పుడు "ఎస్మా"ప్రయోగించి వారిని లొంగ తీసుకోవాలని చూస్తుంది.

అంగన్ వాడీ కార్యకర్తలు ఏమడగుతున్నారు?


ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టు కో అంటున్నారు. చట్ట ప్రకారం పెరిగిన కనీస వేతనాలు పెంచాలని అడుగుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ ఉన్నారు. ఇవేమీ చట్ట విరుద్ధం కాదుకదా!

గత ఏడాది కూడా ప్రభుత్వం ఇచ్చిన పి. ఆర్సీ జీ ఓ లకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మె ను విరమింప చేయటానికి ఇదే విధంగా ఎస్మా ప్రయోగించటం జరిగింది. ఇప్పట్లో మాదిరే అప్పుడు కూడా ఒక వైపు ఉద్యోగ సంఘాల తో చర్చలు జరుపుతూనే హఠాత్తుగా ఎస్మా ప్రకటించారు. గత 25 రోజులు గా అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల లో చేస్తున్న సమ్మె పై కార్మిక సంఘాల నాయకులు తో చర్చలు జరుపుతూనే మొన్న ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం జీ ఓ విడుదల చేసింది.

అయితే, కార్మిక సంఘాల నాయకులు మాత్రం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పని అత్యవసర సేవలు పరిధిలోకి రాదని కాబట్టి ఎస్మా ను లెక్క చేయకుండా సమ్మె కొనసాగిస్తామని గట్టిగా చెబుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన జీ ఓ కాపీలను బహిరంగంగా తగుల బెట్టారు.

వారి వాదన ఒక్కటే .తమకు ఇచ్చేది గౌరవ వేతనం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులు పొందే బెనిఫిట్స్ తాము పొందటం లేదనీ, ప్రసూతి సెలవు దినాలు, రిటైర్మెంట్ ఫించన్, టి. ఏ, డి. ఏ లు, కారుణ్య నియామకాలు, జీతాలు పెంపుదల, పండుగ సెలవులు ఇవేమీ మాకు లేనప్పుడు "ఎస్మా"మాకు ఎలా వర్తిస్తుందని వాదిస్తున్నారు.నిజమే కదా!ప్రభుత్వం ఆ దిశగా ఆలోసించాలి.





ప్రతిపక్షాలకు దగ్గరకాకుండా ఉండేందుకేనా

అసలే ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ను ప్రకటిస్తూ, పనిలో పనిగా భావించి అంగన్వాడీ కార్యకర్తలు దీక్ష చేస్తున్న శిబిరాల ను సందర్శిస్తూ మద్దత్తు ప్రకటిస్తున్నారు. దీనితో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె రాజకీయ రంగు పులుము కుంది.

గత ఏడాది డిసెంబర్ 12 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్ వాడీ సెంటర్ లు మూసివేసి నిరవధిక సమ్మె కు దిగారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల లో అనగా, ప్రభుత్వ కార్యాలయాలు ముందు రిలే నిరాహారదీక్షలు, రాస్తా రోకో లు, వంటా వార్పూ చెయ్యటం, కలెక్టరేట్ల ముట్టడి, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేశారు. ప్రభుత్వం కొన్నిటి పై నిర్ణయాలు తీసుకుని పెండింగ్ బిల్లులు విడుదల చేసింది.

కానీ ముఖ్య మైన డిమాండ్స్ ను పట్టించు కోలేదు.

అసలు ఏమిటా డిమాండ్స్!

1. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.

2. రాష్ట్రం లో అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చెయ్యాలి.

3. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి.

4. మినీ సెంటర్స్ ను మెయిన్ సెంటర్ లు గా మార్చాలి. సీనియర్స్ తో సమానంగా వేతనం ఇవ్వాలి.

5. హెల్పర్ల ప్రమోషన్ లకు వయోపరిమితి 50 సం. కు పెంచాలి.

6. ఎఫ్. ఆర్. యస్. యాప్ ను రద్దు చేయాలి. అన్నిటినీ కలిపి ఒకే యాప్ గా మార్చాలి.

7. సర్వీస్ లో చనిపోయిన కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. భీమా అమలు చెయ్యాలి.

8. పెండింగ్ లో ఉన్న సెంటర్స్ అద్దెలు, ఇంకా 2017 నుండి ఇవ్వని టి. ఎ. బిల్లులు, ఇతర బకాయిలు ఇవ్వాలి.

9. వేతనం తో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. రిటైర్మెంట్ వయస్సు 62 సం. కు పెంచాలి.

10. లబ్దిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి.

ఇందులో కొన్నిటికి ప్రభుత్వం అంగీకరించిది. కొన్నింటిపై మొండిగా వ్యవహరిస్తోంది. ఆ క్రమం లోనే ఎస్మా ప్రయోగించటం జరిగింది.

అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న వాదనలో నిజం ఎంత ఉంది. గత 4 నెలలు గా జీతాలు లేవు. అసలే చాలి చాలని జీతాలు. మెయిన్ సెంటర్ అంగన్వాడీ లకు రూ.11500లు. మినీ సెంటర్స్ అంగన్వాడీ లకు రూ.7000. ఇద్దరూ చేయాల్సింది ఓకే విధమైన పని, కానీ జీతాలలో వ్యత్యాసాలు. ఇది రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 కు విరుద్ధం.

1. చట్టం ముందు అందరూ సమానం.2. అందరికీ సమాన రక్షణ.

2017 సం. నుండి సెక్టార్ మరియు ప్రాజెక్ట్ మీటింగ్ లకు వెళ్లిన వారికి టి. ఏ. లు ఇవ్వక పోవడం విచారకరం .

ఒక్కో నెలకు రూ.650 లు ఇవ్వాలి.( ప్రతీ ఒక్కరికీ ఏడు సంవత్సరాలు బకాయిలు రావాలి)పని గంటలు కూడా 8. ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగులు మాదిరిగానే ఉంటుంది. ఉదయం 9 గం నుండి సాయంత్రం 4 గం వరకు.అయినా తక్కువ వేతనాలు. కనీస వేతనాలు ఎంత ఉండాలి? 7వ పే కమీషన్ రిపోర్టు ప్రకారం

ప్రతీ ఒక్కరికీ రూ.18000 లు. 8వ పే కమీషన్ రిపోర్టు ప్రకారం రూ.26000 లు ఉండాలి. అలా చూసినప్పుడు అంగన్వాడి కార్యకర్తలు వేతనాలు పెంచాలని చేస్తున్న డిమాండ్ న్యాయ మైనదే కదా. ఈ సంధర్భంగా తక్కువ వేతనాలు చెల్లింపుల గురించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు గురించి ప్రస్తావించటం మంచిది. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా ప్రాముఖ్యమైన

అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 23 పరిధిని విస్తృతం చేస్తూ

"ఎవరైనా ఒక వ్యక్తిని అతని లేదా ఆమె పేదరికాన్ని, అవసరాన్ని, ఆకలిని ఆసరాగా తీసుకుని,నిర్దేశించిన కనీస వేతనం కంటే తక్కువ వేతనానికి పని చేయమని బలవంతం చేస్తే అది "వెట్టి చాకిరీ"క్రిందకు వస్తుందని అభిప్రాయ పడ్డారు. అది గౌరవ వేతనం పొందే వారి నీ కూడా ఆర్టికల్ 23 పరిధి క్రిందకు వస్తారని పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో ఇచ్చే వేతనాల కంటే మినీ సెంటర్స్ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు ఉండడం బాధాకరం.

వారికి భీమా సౌకర్యం లేదు. ఆయాల జీ తమే ఇస్తారు కేవలం రూ.7000. నాలుగు రకాల పనులు చేయాలి. వంట పనిచేయాలి. రికార్డు వ్రాయాలి. యాప్ పని ప్రీ స్కూల్ చదువు చెప్పాలి. ఈ పనే మెయిన్ సెంటర్ అంగన్వాడీ కార్యకర్తలు చేసేది. మరి జీతాల లో వ్యత్యాసం ఉండవచ్చా? విధులు నిర్వర్తించే క్రమం లో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు.

ముఖ్యంగా యాప్ లింక్ లు అంతా గజి బిజి. ఒక పంచాయితీ లో పని చేసే వారు మరో పంచాయితీ లో వేలి ముద్రలు వేయాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సమస్య ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా ఉంది. రవాణా సౌకర్యాలు ఉండవు. మారుమూల ప్రాంతాల్లో నెట్ వర్క్ ఉండదు.

పై అధికార్ల నుండి ఛార్జ్ మెమో లు ఇలా ఎన్నో సమస్య లు ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించే వారి డిమాండ్ ల పై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహ రించాలి కానీ ఇలా ఎస్మా ప్రయోగించటం మంచిది కాదు.


(జువ్వాది బాబ్జీ, అడ్వకేట్, అమరావతి)


Read More
Next Story