ఏపీ రాజధాని అమరావతికి జలకళ రానుంది. వచ్చే వర్షాకాలం నాటికి ఆరు రిజర్వాయర్లు అమరావతిలో ఏర్పాటు కానున్నాయి. రిజర్వాయర్లు ఎప్పుడూ నీటితో నిండి ఉంటాయి.


ఆంధ్రప్రదేశ్ కు అమరావతి మణిహారం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం తీరు వల్ల ఒక్క నిర్మాణం కూడా అమరావతిలో ముందుకు సాగలేదు. లేకుంటే ఈ పాటికే రాజధాని అమరావతి పూర్తయ్యేది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండో సారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ మూడేళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని మునిసిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఇటీవల చెప్పారు.

ప్రధానంగా అమరావతికి జల కళ తీసుకొచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందించారు. అమరావతిని ముంపు నుంచి రక్షించడంతో పాటు ఆరు ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణ ప్రణాళికలో భాగంగానే ఈ రిజర్వాయర్లను నిర్మించనున్నారు. రిజర్వాయర్లలో నీటిని అవసరాల కోసం ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఆలోచన కూడా చేస్తోంది. నీరు కొండవద్ద 0.4 టీఎంసీలు, క్రిష్ణాయపాలెం వద్ద 0.1 టిఎంసీ, శాఖమూరు వద్ద 0.1 టీఎంసీ, లాం వద్ద 0.3 టీఎంసీ, పెద్దపరిమి వద్ద 0.2 టీఎంసీ, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.

కాలువలు, వాగుల ద్వారా భారీగా వరద నీరు వస్తే రిజర్వాయర్లు నిండిన తరువాత వరద నీటిని ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్స్, బకింగ్ హాం కాలువ వద్ద 4,000 క్యూసెక్స్, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్స్ ద్వారా నీటిని ఎత్తిపోతల ద్వారా క్రిష్ణానదిలోకి పంపింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. డిజైన్ లో భాగంగా ఈ విధమైన స్ట్రక్చర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండు నెలల్లో టెండర్లు పిలిచి కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణాన్ని వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

రిజర్వాయర్ల నిర్మాణాలతో అమరావతిలో నీటి కొరత ఉండదు. ప్రస్తుతం వంద అడుగుల లోతులో బోర్లకు నీరు వస్తున్నాయి. అదే రిజర్వాయర్లు నిర్మిస్తే 30 నుంచి 50 అడుగుల లోతులోనే నీరు ఉంటుంది. క్రిష్ణానది సచివాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. రిజర్వాయర్లు మధ్యమధ్యలో ఉంటాయి. ఇందువల్ల భూగర్భ జలం బాగా పెరుగుతుంది. ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకుంటే తాగు నీటిగా కూడా ఈ నీరు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

కృష్ణానదికి కనీవినీ ఎరుగని వరదనీరు వచ్చినా 2,017 చదరపు కిలో మీటర్ల పరిధిలోని అమరావతి క్యాపిటల్‌ సిటీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక రూపొందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని, రాజధానిగా ప్రాంతంగా పనికిరాదని ప్రచారం చేసింది. వైఎస్సార్సీపీలో కొందరు నాయకులు ప్రపంచ బ్యాంకుకు నెగిటివ్‌గా రిపోర్టు ఇచ్చారని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇవన్నీ అబద్ధపు ప్రచారాలేనని ప్రస్తుత వరదలు తెలియజేసినట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి క్యాపిటల్‌ సిటీ నిర్మించే విషయంలో రాజధాని లోపల మూడు భారీ కాలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి వరద ప్రమాదం లేకుండా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌ను ఆధునీకరించేలా డిజైన్‌ చేశారు. నెదర్లాండ్‌ దేశానికి చెందిన సంస్థను కన్సల్‌టెంట్‌గా తీసుకుని డిజైన్స్‌ చేయిస్తున్నారు. ఎంత నీరు వచ్చినా రిజర్వాయర్లలో స్టోర్‌ అవుతుంది. ఎలాంటి పంపింగ్‌ కూడా అవసరం లేకుండానే అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

Next Story