అరకు కాఫీని పీఎం నరేంద్ర మోదీ కీర్తించారు. అరకు కాఫీని కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకోవడం ఏమిటని కాంగ్రెస్‌ వారు ఎద్దేవా చేశారు. ఇంతకూ ఏమి జరిగింది?


అరెరే.. ఇదేమి లొల్లి అనుకుంటున్నారా..! అవును అరకు ఆర్గానిక్‌ కాఫీ గురించి జరిగిన లొల్లి. అరకు కాఫీపై తలో మాట మాట్లాడారు. ఎవరికి వారు తమ గొప్పను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం అరకు కాఫీ ఎంతో గొప్పదన్నారు. ఆయన ఆదివారం దేశ వ్యాప్తంగా ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్‌ గుర్తుకు వచ్చిందో... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు ప్రస్తావించాలనుకున్నారో తెలియదు కానీ.. అరకు కాఫీ గొప్పతనం గురించి తన అనుభవాలు ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. పైగా 2016లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా ఆయనతో విశాఖపట్నంలో అరకు కాఫీ తాగుతూ మాట్లాడుతున్న ఫొటోలు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రపంచంలోని ఎవరైనా కాఫీ ప్రియులైతే తప్పకుండా అరకు కాఫీని ఒక్కసారి తాగాల్సిందేనని మరో ట్వీట్‌ చేస్తూ అందులో అరకు కాఫీ తోటలు, గింజలు కోసే విధానం, గిరిజనుల పనితీరు, కాఫీ గింజల ప్రాసెసింగ్‌ విధానం చూపించే వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. ఎంతో ప్రేమ, అభిమానం, ఉచ్చుకత, అరకు గిరిజనుల గొప్పతనం కనిపించేలా ట్విటర్‌లో పోస్టు చేసే సమయంలో స్వయంగా ప్రధాన మంత్రి శ్రద్ధ తీసుకున్నారంటే అరకు కాఫీ గురించి ఆయన ఏమి చెప్పదలుచుకున్నారో అర్థమవుతోంది.

ఆర్గానిక్‌ కాఫీగా గుర్తిస్తూ ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకించి అరకు కాఫి పంటపై సర్టిఫికెట్‌ను కూడా అందుకుంది. ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ట్రైబల్‌ కార్పొరేషన్‌ నుంచి అప్పటి డిప్యూటీ డైరెక్టర్‌ మణికుమార్‌ ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ప్రధాన మంత్రి చేసిన ఈ ట్వీట్‌ ఏడు గంటల వ్యవధిలోనే కొన్ని వేల మందిని ఆకట్టుకుంది. లైక్‌ చేసిన వారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. రీపోస్టు చేసిన వారు కూడా వేలమందిలోనే ఉండటం విశేషం. అంటే కేవలం ఏడు గంటలలోపు ట్విట్టర్‌ వేదికగా వచ్చిన రెస్పాన్స్‌ ఎంతో గొప్పగా ఉందని చెప్పొచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అరకు కాఫీపై చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేష్‌ స్పందించారు. ఆయన ట్విటర్‌ వేదికగా మోదీని ప్రస్తావిస్తూ మరో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కూడా చర్చనియాంశమైంది. ‘నాన్‌–బయోలాజికల్‌ పీఎం ఈరోజు తన మన్‌కీ బాత్‌లో అరకు వ్యాలీ ఆర్గానిక్‌ కాఫీ బ్రాండ్‌ను కనిపెట్టినట్లు ముద్ర వేశారు. ఎప్పటిలాగే అతను అతిశయోక్తి చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని సుందరమైన అరకు లోయలో గిరిజన సంఘాలు కాఫీ సాగుకు చొరవ చూపడానికి నాంది ఫౌండేషన్‌ బాధ్యత తీసుకుంది. రాష్ట్ర వాణిజ్య మంత్రిగా డిసెంబరు 21,2007న అరకు లోయలో బ్రాండ్‌ను ప్రారంభించడం నాకు విశేషం. ఐదేళ్ల తరువాత నేను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తిరిగి అక్కడికి చేరుకున్నాను. అంటూ జైరామ్‌ రమేష్‌ ట్వీట్‌ చేయడం విశేషం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరకు కాఫీపై చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జైరామ్‌ రమేష్‌ చేసిన ట్వీట్‌ను ఆక్షేపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ స్పందించారు. ‘సముచిత గౌరవంతో, అనేక సంవత్సరాలుగా ఏపీ సంస్కృతిలో అంతర్భాగమైన అరకు కాఫీని కనిపెట్టడం గురించి ఎటువంటి అభిప్రాయం వెల్లడించలేదని పీఎం నరేంద్రమోదీ అన్నట్లు నేను విన్నాను. దశాబ్ధాలుగా క్రియాశీలంగా ఉన్న గిరిజన సహకార సంఘం గురించి కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు’. అని ట్విటర్‌ వేదికగా స్పందించారు.
మన్‌కీబాత్‌ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన అరకు కాఫీపై చేసిన ట్వీట్‌ తుఫాన్‌ సృష్టించింది. ప్రధాన మంత్రి గతాన్ని గుర్తు చేసుకోగా కాంగ్రెస్‌ వారు తాము ఎప్పుడో ప్రారంభించి అందరికీ చెప్పిన తరువాత కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అటువంటిదేమీ అనకపోయినా అన్నారనుకోవడం ఏమిటని లోకేష్‌ జైరామ్‌ను ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. మొత్తం మీద ఆదివారం అరకు కాఫీ దేశంలో కాఫీ తుఫాన్‌ తెచ్చింది.
Next Story