ఇప్పటికే పలు దేశాలకు అరకు కాఫీని ఎగుమతి చేస్తున్నారు. ఒక దేశంలో అయితే ఔట్‌లెట్‌ ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకతే వేరు. సేంద్రీయ విధానంలో పండే అరకు కాఫీకి ఇప్పటికే అంతర్జాయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీంతో ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీనికి డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో దీని ఔట్‌లెట్స్‌ ఏర్పాటు చేశారు. ప్రముఖ యూరోపిన్‌ దేశమైన ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఔట్‌లెట్స్‌ ఏర్పాటు చేసి ఫ్రాన్స్‌తో పాటు యూరోపియన్‌ దేశాలకు అరకు కాఫీ చేరువ చేస్తున్నారు. ఇక పలు దేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారు. ఫ్రాన్స్‌తో పాటు సౌత్‌ కొరియా, స్విట్జ్‌ర్లాండ్, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్, జపాన్, బల్గేరియా, ఉక్రెయిన్‌ వంటి దేశాలకు అరకు కాఫీని ఎక్స్‌పోర్టు చేస్తున్నారు. ఇండియాలో బెంగుళూరు, ముంబాయి వంటి ప్రాంతాల్లో అరకు కాపీ ఔట్‌లెట్స్‌ ఉన్నాయి.

అంతగా అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన అరకు కాఫీని తాజాగా భారత పార్లమెంట్‌లో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా కేంద్ర పౌరయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం తెలుగుదేశం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, మరో ఎంపీ సీఎం రమేష్‌ల బృందం భారత పార్లమెంట్‌ స్పీకర్‌ ఓం బిర్లాకు కలిసిని ఓ వినతి పత్రం సమర్పించారు. అరకు కాఫీ ప్రత్యేక టేస్ట్‌ను పార్లమెంట్‌ సభ్యులకు చూపడానికి, ఎంపీలందరికీ అందుబాటులోకి తేవడానికి భారత పార్లమెంట్‌లో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తూ అనుమతులు ఇవ్వాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. దీని ప్రాముఖ్యతను గుర్తించి, గమనించిన స్పీకర్‌ ఓం బిర్లా అరకు కాఫీని పార్లమెంట్‌లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు అంగీకరించారు.
అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్‌ గిరిజనుల గొప్ప వారసత్వం. సేంద్రీయ వ్యవసాయానికి చిహ్నం అరకు కాఫీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానకీ బాత్‌తో పాటు పలు సందర్భాలలో అరకు కాఫీ విశిష్టతను, గొప్పతనాన్ని పొగిడారు. అలాంటి అరుదైన గుర్తింపు కలిగిన అరకు కాఫీ ప్రచారం కోసం పార్లమెంట్‌లో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు, అరకు కాఫీ కోసం పార్లమెంట్‌లో ఒక శాశ్వత స్టాల్‌ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. తోటి పార్లమెంట్‌ సభ్యులు, ఇతర ప్రముఖులు ఈ అరకు కాఫీ ప్రత్యేక రుచులను చేరువ చేయాలనేదే తమ ప్రయత్నమని పౌరయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేష్‌లు పార్లమెంట్‌ స్పీకర్‌ ఓం బిర్లాకు వివరించారు.
అరకు కాఫీ ప్రత్యేకతలన్నీ విన్న స్పీకర్‌ ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలలోనే అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ ఓం బిర్లా హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తాము గిరిజనుల అభివృద్ధికి, అరకు కాఫీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డెవలప్‌ చేయడాన్ని ఓ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
Next Story