నాన్‌లోకల్ అయిన జోగి రమేష్‌ను సమన్వయ కర్తగా నియమించడం..స్థానికులకు సీటు కేటాయించక పోవడం..వెరసి స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో ఆగ్రహ జ్వాలలు రగుతూనే ఉన్నాయి.
జి. విజయ కుమార్
కృష్ణా జిల్లా పెనుమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని వైఎస్‌ఆర్‌సీపీ వర్గాల్లో పెనుమంటలు రేగుతూనే ఉన్నాయ. మంత్రి జోగి రమేష్‌ను పెడన నుంచి పెనుమూరు అసెంబ్లీ నియోజక వర్గానికి సమన్వయ కర్తగా మారుస్తూ సిఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. నాటి నుంచి ఆయనకు అక్కడ గడ్డు కాలం నడుస్తూనే ఉంది.
పెడన నుంచి గెలిచిన జోగి రమేష్
2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెడన నుంచి జోగి రమేష్ గెలుపొందారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి చేసిన అనంతరం సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మంత్రి వర్గం మార్పుల్లో ఆయనకు చోటు దక్కింది. గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. వాస్తవంగా జోగి రమేష్‌ది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. ఇది మైలవరం నియోజక వర్గంలో ఉంది. 2014లో ఆయనకు మైలవరం టికెట్ ఇచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమో చేతిలో ఓటమి చవి చూశారు. తర్వాత ఆయనను కృష్ణా జిల్లా పెడనకు మార్చారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెడన నుంచే పోటీ చేసి గెలుపొందారు.
మంత్రి అయిన తర్వాత మైలవరంపైనే కన్ను
జోగి రమేష్ మంత్రి అయిన తర్వాత మైలవరంపై దృష్టి సారించారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అక్కడ రాజకీయాల్లో వేలు పెడుతూ స్థానిక నేతలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారు. 2024లో మైలవం నుంచి పోటీ చేయాలనే కాంక్షతో గ్రూపు రాజకీయాలకు తెరసారు. ఈ వ్యవహారం అక్కడ స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మింగుడు పడని అంశంగా మారింది. దీనిని వ్యతిరేకించిన వసంత బహిరంగంగానే ఈ విషయాలను వెల్లడించారు. అంతటితో ఆగకుండా దీనిపై వైఎస్‌ఆర్‌సీపీ పెద్దల దృష్టికి వసంత తీసుకెళ్లారు. అయితే జోగి రమేష్‌పై చర్యలు తీసుకోకుండా ఆయనకే వంత పాటడంతో ఆలోచనలో పడ్డారు.
సుమారు మూడు నెలలు గడుస్తున్నా నేటీకీ...
మంత్రి జోగి రమేష్‌ను పెనుమలూరు సమన్వయ కర్తగా మార్చి సుమారు 3 మాసాలు గడుస్తున్నా నేటికీ ఆయన ఆ పార్టీ వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. నియోజక వర్గంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలకు స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కేడర్ సహకరించడం లేదు. జోగి రమేష్ నాన్‌లోకల్ కావడం, స్థానికులకు ఇన్‌చార్జీ బాధ్యతలు ఇవ్వక పోవడంతో పాటు జోగి రమేష్ వ్యవహార శైలి నచ్చక పోవడం వల్ల కూడా ఆగ్రహంగానే ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
ఫ్లెక్సీల గోల
జోగి రమేష్ అన్నా.. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న పెత్తందారులపై పోరాటం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగనన్న. మన పార్టీలో ఉన్న పెత్తందారుల కుట్రలో భాగంగా నీ సీటు మార్చారు. గెలిచే నిన్ను ఓడించి వచ్చే మంత్రి వర్గంలో నీగు భాగస్వామ్యం లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ పెత్తందారులు పావులు కదిపారు. జాగ్రత్త జోగి రమేష్ అన్న.. ఏమైనా కానీ నీకు మా పుట్టిన రోజు శుభాకాంక్షలు జోగి రమేష్ అన్న.
నువ్వు పుట్టిన మైలవరం కాదన్నారు. నువు రెండు సార్లు గెలిచిన పెడన కాదన్నారు. నీకు సరిపోని పెనుమలూరు ఇచ్చారు. ఇదంతా పెత్తందారుల కుట్రలో భాగమే జోగి రమేష్ అన్న. ఇట్లు మీ అభిమాని శేఖర్ గౌడ్ అనే పేరుతో వెలసిన ఫ్లెక్సీలు తీవ్ర వివాదానికి తెర తీసాయి.
వైఎస్‌ఆర్‌సీపీ పెద్దల దృష్టికి
లోకల్ నాన్‌లోకల్ అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత ఇప్పటికే వచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పడమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ బహిరంగంగానే అసమ్మతి గళం వినిపించారు. దీంతో పాటుగా పెనుమలూ వైఎస్‌సీపీ ఇన్‌చార్చిగా జోగి రమేష్‌ను ప్రకటించిన అనంతరం దళిత అధికారులను జోగి రమేష్ వేధిస్తున్నారని అదే పార్టీకి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ రాజీనామా కూడా చేయడం ఆ పార్టీ నేతల్లో నెలకొన్న వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. జోగి రమేష్‌కు పెనుమలూరు ఇన్‌చార్జీ బాధ్యతలను వ్యతిరేకించిన పడమట సురేష్ బాబు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఆ విషయాన్ని ఆ పార్టీ పెద్దలకు తెలియజేశారు. తమలో ఎవరో ఒకరికి పెనుమలూరు స్థానం కేటాయించాని కూడా వైఎస్‌ఆర్‌సీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
పునాదిలో ఒకరిది.. ప్రారంభంలో మరొకరిది
గతంలో కంకిపాడులో దాదాపు రూ. 14లక్షల అంచనా వ్యయంతో కొత్త అంగన్‌వాడీ సెంటర్‌ను నిర్మించేందుకు అడుగులు పడ్డాయి. ఆ మేరకు పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారధి పునాదిపాడులో రైతు భరోసా కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్‌తో పాటు మరి కొన్ని షాపుల నిర్మాణాలను శంకుస్థాపనలు జరిగాయి. ఇటీవల పూర్తి అయ్యాయి. అయితే అంగన్‌వాడీ కేంద్రాల శంకుస్థాపన సందర్భంగా స్థానిక శాసన సభ్యులు కొలుసు పార్థసారధి పేరుతో శిలా ఫలకం ఏర్పాటు చేశారు. దీనిని ఇటీవల తీసేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి సీటు దక్కక పోవడంతో ఆయన టీడీపీలో చేరారు. ఆయనను నూజివీడు టీడీపీ అభ్యర్థిగా చంద్రాబాబు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పార్థసారధి తన పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్దనుకున్నారో ఏమో కానీ ఆ శిలా ఫలకాన్ని తొలగించి మంత్రి జోగి రమేష్‌పేరుతో కొత్త శిలా ఫలకాన్ని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాలు, అధికారుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
Next Story