గత ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలకు పని లేకుండా పోయింది. అధికారులు గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు. తిరిగి ఇప్పుడు జీవం పోసుకుంటున్నాయి. ఎందుకిలా జరిగింది...
పాలనకు కేంద్ర బిందువులు ప్రభుత్వ శాఖలు. పాలనలో ప్రతి ఒక్కరిని సమానమైన వారిగా చూడాలి అనుకున్నప్పుడు వ్యక్తి జీవిత విధానాన్ని మార్చి, ఆ వ్యక్తి జీవన గమనానికి ఒక ఆశా జోత్యిని చూపించేందే ప్రభుత్వ శాఖ. ప్రభుత్వంలో ఎన్నో విభాగాలు ఉంటాయి. వీటిన్నింటినీ శాఖోప శాఖలుగా విభజించడాన్ని ప్రభుత్వ శాఖలు అంటున్నాము. ప్రతి శాఖ వ్యక్తి నిత్య జీవితంలో ఎలా మసులు కోవాలో.. ఏ విధంగా జీవించాలో తెలియజేస్తుంది. ఆ విధానంలోనే గొప్ప చదువులు చదివి, విజ్ఞాన వంతులైన వారు జ్ఞాన నేత్రంతో రూపొందించినవే ప్రభుత్వ శాఖలు. పట్టణంలో నివసించే వారి జీవన విధానం ఎలా ఉంటుందో, పల్లెల్లో నివసించే వారి జీవన విధానం ఎలా ఉంటుందో, ప్రత్యేకమైన అధ్యాయనాలు చేయడం ద్వారా వ్యత్యాసాలను గమనించి ఎంతో మంది మేధావులు పట్టణాభివృద్ధికి కొన్ని విభాగాలు, గ్రామాభివృద్ధికి మరి కొన్ని విభాగాలు, ఏర్పాటు చేశారు.
పట్టణ జీవన శైలిని మెరుగు పరచేందుకు, గ్రామీణ జీవితంలో అక్కడి ప్రజల జీవన శైలిని మెరుగు పరిచేందుకు ఎన్నో ఆలోచనలు చేసి, మరెన్నో అధ్యయనాలు చేసి వచ్చిన ఇన్‌పుట్స్‌ను ఉపయోగించి ప్రభుత్వ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా అందరి జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకు వచ్చేందుకు అధ్యయనకారులు పరితపించారు. ఆ విధానాలు ఇప్పడు అమలవుతున్నాయి. ఆర్థిక విధానాల్లో ధనిక, పేద వ్యత్యాసాలు వస్తున్నాయే తప్ప మిగిలిన విధానల్లో ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనలు చేసిందో అందుకు చేరువ కాగలిగింది. అందుకే అప్పుడప్పుడు విధాన పరమైన నిర్ణయాలు తీసుకొనే ముందు సమగ్రమైన అధ్యయనాలు నిర్వహించి మార్పులు.. చేర్పులు చేయడం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఐదేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతూనే వచ్చింది.
గత ఐదేళ్లల్లో ఏమైంది?
విభజిత అంధ్రప్రదేశ్‌లో 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాలనలో ప్రయారిటీలను కంప్లీట్‌గా మార్చి వేసింది. ప్రభుత్వ శాఖలను పక్కన పెట్టింది. మనుషులు, ప్రకృతిల మధ్య వ్యత్యాసాలను, సంబంధాలను మరిచి పోయింది. పాలన అంటే పేద వారికి డబ్బులు పంచి పెడితే సరిపోతుందని భావించింది. ఇక్కడే అన్ని విభాగాల్లోను విధ్వంసానికి నాంది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్షి బతకాలంటే రైతు పంట పండించాలి. అప్పుడప్పుడు ఆ విత్తనాలు ఆ పంటపైకి వచ్చే రకరకాల పురుగులు, పంట ఆకులు.. ఒకటేమిటి జీవన వైవిధ్యంలో ఎన్ని రకాలుంటాయో అన్నీ పక్షి నుంచి మనిషి వరకు అవసరమవుతాయి. ఆ అవసరాలను జీవన వైవిద్యంలో ఉండే స్థితిగతులను, ఒక దాని నుంచి మరో దానికి ముడిపడిన బాంధవ్యాలను, సంబంధాలను ప్రభుత్వం వదిలేసింది. అందుకే వైరుద్యం ఏర్పడింది. ప్రజలకు పనిలేకుండా పోయింది. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతున్నారు. తర్వాత అవసరాలు ఎవరు తీరుస్తారా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఇదీ గత ఐదేళ్ల కాలంలో జరిగిన పరిణామాలకు అద్దం పట్టే అంశం.
ఇన్నేళ్ల పాలనలో ప్రభుత్వ శాఖలు ఎప్పుడూ విధ్వంసం కాలేదు...
77ఏళ్ల స్వతంత్ర భారతంలో భారత దేశం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. విభజన నాటికి ప్రపంచ దేశాల్లో బాగా వెనుకబడిన దేశంగా ఉండేది. నేడు అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలోకి వచ్చింది. చాలా రాష్ట్రాలు కూడా వేగంగా అభివృద్ధిలో ముందుకు దూసుకు పోతున్నాయి. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాయని చెప్పొచ్చు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొలి సారిగా తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. వారి పరిపాలన కాలంలో ఆర్థిక లోటు తప్ప ఇతర విధ్వంసాలకు తావు లేకుండానే సాగింది. అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి చేరుకుని కావాల్సిన కార్యాలయాలు అద్దెలకు తీసుకుని పనులు మొదలు పెట్టారు. పాలన కూడా ఒడిదుడుకులతో మొదలై స్టెబిలైజేషన్‌కు వచ్చింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ సంస్కరణలు ప్రభుత్వ శాఖలను పూర్తిగా దెబ్బతీశాయి. ఎందుకూ పనికిరాని వారుగా ఉన్నతాధికారులు సైతం మారిపోయారు.
ప్రభుత్వంలో పలు విభాగాలు ఎందుకు?
ప్రభుత్వంలో పలు శాఖలు, ఆ శాఖలకు మంత్రులు, వాటిని ఆధారం చేసుకుని పరిపాలన సాగటం వంటి అంశాలు కాకతాళీయంగా వచ్చాయనుకుందామా? కానే కాదని ఎవరిని అడిగినా చెబుతారు. ఎన్నో అధ్యయనాల తరువాత వచ్చినవి. కానీ ఆ అధ్యయనాలను, ప్రభుత్వ శాఖల పనితీరును గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. కులాల ప్రాతి పదికన ఏర్పడిన కార్పొరేషన్‌ల ద్వారా డబ్బులు పంచితే సరిపోతుందని భావించింది. దేనినైనా అధ్యయనం చేయకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా అడుగు ముందుకు వేస్తే వచ్చే అనర్థాలు కూడా దారుణంగా ఉంటాయని ఎన్నికల తరువాత గత ప్రభుత్వానికి బోధ పడింది. అయినా నేటికీ తాను చేసిన ఎన్నో మంచి పనులు ఆయా కుటుంబాల్లో ఉన్నాయి. తాను చేసిన సాయం కూడా ఆ కుటుంబాల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ అడుగులు ముందుకు వేద్దామని మాజీ సీఎం జగన్ అంటున్నారంటే ఆయన్ను ఏమనాలో అర్థం కాని పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ది.
పనిలేని ఉద్యోగులు... ఏమి చేయాలో అర్థం కాని ప్రజలు
ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిలేదు. కేవలం డీబీటీ పద్ధతి ద్వారా ప్రభుత్వం ఇస్తున్న డబ్బును లబ్ధిదారులకు పంపిణీ చేయడం. వారి బ్యాంకు అకౌంట్లకు చేరాయా? లేదా? తెలుసుకోవడం వరకే ప్రభుత్వ అధికారులు పరిమిత మయ్యారు. చేరాయని తెలియగానే ఊపిరి గట్టిగా పీల్చుకుని మా పనైపోయిందని ఆరామంగా కుర్చీల్లో కూర్చుంటున్నారు. గతంలో లబ్ధిదారులను వాంటీర్ల ద్వారా గ్రామ సచివాలయ సిబ్బంది ఎంపిక చేశారు. ఇప్పుడు గ్రామ వాంటీర్లను తొలగించే కార్యక్రమాన్ని నూతన ప్రభుత్వం చేపట్టింది. గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బంది అన్నీ పరిశీలించుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. గతంలో సచివాలయం తరువాత ఎంపీడీవో, కలెక్టర్, కమిషనర్ సంతకాలకు మాత్రమే పరిమితమయ్యారు. వారు సొంత ఆలోచనలతో ప్రభుత్వ పథకాలు తయారు చేయడానికి స్వస్తి చెప్పారు.
ఐఏఎస్‌లకూ పని లేని పరిస్థితి
గత ప్రభుత్వంలో ఐఏఎస్‌లు సైతం పనిలేకుండా కాలం గడిపారు. ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అవడంతో వాటి గురించి ఆలోచించడం వేస్టని భావించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ప్రభుత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం నిధులు దాదాపు 60శాతం ఇస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులతో కమిషనర్లు, కార్యదర్శులు ఆలోచించి మంచి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీల బాగోగుల చూసేవారు. అధికారులు, ఉద్యోగుల్లో అవినీతిని అరికడితే పాలన ముందుకు సాగుతుందని అనుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో పాలన ముందుకు సాగక పోవడంతో పాటు ఆయా వర్గాలకు మంచి చేకూరుతుంది. కానీ అవేమీ గత ప్రభుత్వంలో జరగలేదు.
Next Story