కలెక్టర్లే బంపర్ ఆఫర్ల బ్రాండ్ అంబాసిడర్లా?
x

కలెక్టర్లే 'బంపర్ ఆఫర్ల బ్రాండ్ అంబాసిడర్లా'?

ఇది రాజకీయ శైలికి దగ్గరగా ఉండడంతో, అధికారుల నిష్పాక్షికతపై నీలినీడలు


ఏపీలో వినూత్న ప్రచారం మొదలైంది. రాజకీయ నాయకుల శైలిలో అధికారులే ప్రచారం చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం అధికారుల బాధ్యత. కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ‘సూపర్ జీఎస్‌టీ - సూపర్ సేవింగ్స్’ అని, బంపర్ ఆఫర్లంటూ ప్రచారం చేస్తున్నారు. పైగా వీళ్లు వాడుతున్న భాష రాజకీయ నాయకుల్ని మించిపోతోంది. సూపర్ ఎడ్వర్టైజర్ల మార్కెటింగ్ శైలిలో ఈ అధికారుల శైలి ఉంది. “సూపర్ లైఫ్, సూపర్ సేవింగ్స్, కొత్త వెలుగులు” వంటి పదాలు కలెక్టర్లు యథేచ్ఛగా వాడేస్తున్నారు. దీంతో అధికారుల నిష్పాక్షికతపై నీలినీడలు అలుముకున్నాయి.
ఈ తీరును సివిల్ సొసైటీ, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పొలిటికల్ ప్రాపగాండాకు అడ్మినిస్ట్రేషన్ వాయిస్ ఓవర్ గా మారడం విడ్డూరం అని నిలదీస్తున్నాయి. గతంలో ఎప్పుడో 20 అంశాల కార్యక్రమంపై అధికారులు ప్రచారం నిర్వహిస్తే అధికార యంత్రాంగాన్ని ఆనాటి అధికార పార్టీ సొంత ప్రయోజనం కోసం వినియోగించుకుంటోందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని మించి పోయే రీతిలో అధికారులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని సీపీఐ నాయకుడు డాక్టర్ కె.నారాయణ చెప్పారు.
విజయవాడలో జరిగిన *“సూపర్ జీఎస్‌టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ”లో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, జీఎస్‌టీ విజయవాడ జాయింట్ కమిషనర్ ఎస్. ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
“ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల చొరవతో వచ్చిన జీఎస్‌టీ సంస్కరణల వల్ల ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి” అని కలెక్టర్ లక్ష్మీశ్ అన్నారు.
“లైఫ్ ఇన్సూరెన్స్‌పై 18% నుంచి జీరో, హెల్త్ & ఫ్యామిలీ ఇన్సూరెన్స్‌లో ఇదే విధంగా మినహాయింపులు వచ్చాయి. లైఫ్ సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది” అని వివరించారు.

జేసీ ఇలక్కియ మాట్లాడుతూ “ప్రతి రిన్యువల్‌లో 18% ఆదా అవుతుంది. చికిత్సా ఖర్చులు తగ్గుతాయి” అన్నారు.
జాయింట్ కమిషనర్ ప్రశాంత్ కుమార్ “జీఎస్‌టీ రేట్లు మందులపై 12% నుంచి 5%కి తగ్గాయి. టెస్టింగ్ కిట్లపైనా ఇదే రకం తగ్గింపు” అని చెప్పారు.
సివిల్ సొసైటీ ఏమంటోంది?
అయితే ఈ ప్రచారం పట్ల సివిల్ సొసైటీ, ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. “ప్రజలకు అవగాహన కల్పించడం అధికారుల పని కానీ, బంపర్ ఆఫర్ తరహాలో మార్కెటింగ్ చేయడం విడ్డూరం. ఇది నేరుగా రాజకీయ ప్రాచుర్యమే” అని సామాజిక కార్యకర్త డి.నరసింహారెడ్డి విమర్శించారు. “అడ్మినిస్ట్రేషన్ వాయిస్ ఓవర్‌గా మారడం ప్రజాస్వామ్యానికి ముప్పు” అని సామాజిక విశ్లేషకుడు రాజగోపాల్ అన్నారు.
జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో ప్రజలకు కొంత ఉపశమనం వస్తోందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ ప్రచార శైలి మాత్రం రాజకీయ రంగు దాల్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. “అధికారులు పథకాలు వివరించాలి, కానీ ప్రచారకర్తలుగా మారకూడదు” అన్నది సివిల్ సొసైటీ వాదన.
కలెక్టర్లు “ప్రచారకర్తలుగా” మారడం సబబేనా?
ప్రజాస్వామ్యంలో అధికారులు పాలసీలను అమలు చేయాలి గానీ, ప్రచార భాషలో మునిగిపోవాలా? అనే ప్రశ్న వస్తోంది. పన్ను సంస్కరణల లాభాలను వర్క్‌షాప్, ట్రైనింగ్, పాంప్లెట్ల ద్వారా చెప్పడంలో అర్థం ఉంది. కానీ “సూపర్ సేవింగ్స్, సూపర్ లైఫ్” అన్న ర్యాలీల్లో కలెక్టర్లు పాల్గొనడం- అధికారుల తటస్థతను దెబ్బతీస్తోంది అని ప్రజాసంఘాల నాయకుడు డాక్టర్ కె.నాగమల్లేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీ వలన మేలు కలుగుతుందని అంగీకరించినా “మార్కెటింగ్ స్టైల్లో జిల్లా కలెక్టర్ పాల్గొనడం” ప్రజలకు కొత్త అనుభవం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఇదో “విడ్డూర ప్రచారం”గా ఆయన అభివర్ణించారు.
Read More
Next Story