ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయాల కూల్చివేతల పర్వం మొదలైంది. ముందుగా నిర్మాణంలో ఉన్న రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చి వేశారు.


ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండేళ్లుగా ఆపనిలోనే ఉంది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి కాగా మరికొన్ని చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి. తాడేపల్లిలోని సీతానగరంలో నిర్మాణంలో ఉన్న రాష్ట్ర కార్యాలయం కూల్చివేతతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయ నిర్మాణాల వ్యవహారం బయటకు వచ్చింది. మొత్తంగా 26 జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాల నిర్మాణాలకు నాటి జగన్‌ ప్రభుత్వం భూములను కేటాయించింది. 42.24 ఎకరాలు పార్టీ కార్యాలయాలకు కేటాయించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఈ భూముల విలువ రూ. 677.50 కోట్లుగా అంచనా వేశారు. ప్రకాశం జిల్లాలో జలవనరుల శాఖకు చెందిన భూమిని జాతీయ రహదారి పక్కన వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి కేటాయించారు. దీనికి ఒక్క దానికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 1.64 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.

చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భూ వివాదం కోర్టులో ఉంది. తిరుపతి, కర్నూలు, పల్నాడు, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి వంటి జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి అయింది. శ్రీసత్యసాయి, అనంతపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి రెడీ అవుతున్నాయి. తక్కిన జిల్లాల్లో కొన్ని పునాదుల్లో, కొన్ని పూర్తి అయ్యే దశల్లోను ఉన్నాయి. గుంటూరు వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయ నిర్మాణం నిబంధనలకు విరుద్దంగా ఉందని, ఈ భూమి బోట్‌ యార్డుకు సంబంధించిన భూమి(కేంద్రప్రభుత్వం)అని తొలగించారు. చాలా చోట్ల కాపు భవనాలకు కేటాయించిన భూమి, రెవిన్యూ ఉద్యోగులకు కేటాయించిన భూమి, క్రీడా ప్రాదిసాకర సంస్థకు, టిడ్కో ఇళ్లకు, ఏపీ ఆగ్రోస్‌కు కేటాయించిన భూములను పార్టీ కార్యాలయాలకు కేటాయించారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్దంగానే జరిగాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
తాము నిబంధనల ప్రకారమే భూములు తీసుకొని పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టామని, ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదని వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చెబుతూ తెలుగుదేశం పార్టీ నిర్మించిన పార్టీ కార్యాలయాల లిస్ట్‌ను ఆయన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జీవోల ప్రకారమే వైఎస్‌ఆర్‌సీ కాంగ్రెస్‌ పార్టీ కూడా భూ కేటాయింపులు జరిపిందని, తప్పు ఎవరిదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
2015–19 మధ్య వైఎస్‌ఆర్‌ కడప, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 33 సంవత్సరాలు, 99 సంవత్సరాలు లీజు ప్రాతిపదికన భూములు సేకరించి పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసింది. తాము నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలు నిబంధనలకు విరుద్దమైతే తెలుగుదేశం పార్టీ నిర్మించిన పార్టీ కార్యాలయాలు కూడా నిబంధనలకు విరుద్దమేనని కూల్చాలనుకుంటే ముందు టీడీపీ కార్యాలయాలకు కూల్చి తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాల గురించి ఆలోచించాలన్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులకు జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై నోటీసులు ప్రభుత్వం జారీ చేసింది. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరగుతున్నాయని, వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వక పోతే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొనడం విశేషం. అందువల్లే వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాల కూల్చివేతకు కార్యాచరణ మొదలైందనే అనుమానాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాల నిర్మాణాలపై లోకేష్‌ ఏమన్నారంటే..
జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మీ తాత రాజారెడ్డి జాగీరా? వైఎస్‌ఆర్‌సీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా రూ. 1000 నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న రూ. 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావు. నీ ఒక్కడి భూ దాహానికి కబ్జా అయిన రూ. 600 కోట్లకుపైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు చొప్పున స్థలాలివ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణాలకు అయ్యే రూ. 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కటించి ఇవ్వొచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధన దాహానికి అంతు లేదా?
Next Story