తాను కేసు పెట్టక పోయినా కేసు పెట్టినట్లు పోలీసులు రికార్డులు సృష్టించారని ముదునూరు సత్యవర్థన్ అనే వ్యక్తి జడ్జి ఎదుట వాగ్మూల మిచ్చారు.
పోలీసులు సాక్షిగా పిలిచినప్పుడు కోర్టుకు వస్తే సరిపోతుందన్నారు. సరేనన్నాను. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారు ఎవరనేది నాకు తెలియదు. సాక్షిగా కోర్టుకు వస్తే సరిపోతుందని పిలిచి నాతో పోలీసులు సంతకం పెట్టించుకున్నారు. అందులో తాను ఫిర్యాదు దారుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నేను ఫిర్యాదు చేస్తేనే అట్రాసిటీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి కోర్టులో విచారణ జరుగుతున్నట్లు నాకు తెలియదు. అంటూ సోమవారం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సత్యవర్థన్ అనే వ్యక్తి జడ్జికి చెప్పటంతో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు మరో మలుపు తిరిగింది.
సత్యవర్థన్ ఎవరు?
గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసేవాడు. అప్పట్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గా బచ్చుల అర్జునుడు ఉన్నారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన సత్యవర్థన్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ వారు జీతం ఇచ్చే వారు. ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. నిత్యం కంప్యూటర్ వర్క్ ఉంటోంది. బచ్చుల అర్జునుడు గుండె పోటుతో బాధపడుతూ విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అర్జునుడు అనారోగ్యంతో ఉండటంతో సత్యవర్థన్ ఆయన కోసం కావాల్సినవి చూస్తున్నాడు.
పార్టీ ఆఫీసుపై దాడికి ముందు రోజు ఏమి జరిగింది?
గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడికి ముందు రోజు గన్నవరం గ్రామానికి చెందిన దొంతి చిన్న అనే వ్యక్తి అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై విమర్శలు చేశారు. ఆ విమర్శలు సహించలేని వంశీ అనుచరులు చిన్ని ఇంటికి వెళ్లి బెదిరించారు. ఎమ్మెల్యేపైనే విమర్శలు చేసే స్థాయికి ఎదిగావా? అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కొమ్మారెడ్డి పట్టాభి ఎంటర్..
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరం వచ్చారు. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడైన దొంతి చిన్ని ని వంశీ అనుచరులు బెదిరించారని, వారిపై పోలీస్ కేసు పెట్టారు. అక్కడి నుంచి పట్టాభి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు బయలు దేరారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పట్టాభి ఉన్నాడని, ఆయన ఇక్కడికి వచ్చి లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని వంశీ అనుచరులు పట్టాభిని కలిసేందుకు బయలు దేరారు. వంశీ అనుచరులు అందరూ పూర్వపు తెలుగుదేశం పార్టీ వారే కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వంశీ వైఎస్సార్సీపీకి మద్దతు పలకడంతో వైఎస్సార్ సీపీ వారుగా వంశీ అనుచరులు మారిపోయారు. పట్టాభితో కూడా వీరికి పరిచయం ఉండటంతో టీడీపీ ఆఫీసుకు చేరుకున్నారు. అప్పటికి పట్టాభి ఇంకా పార్టీ ఆఫీసుకు రాలేదు. దీంతో వంశీ అనుచరులు పార్టీ ఆఫీసులోపలికి వెళ్లి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి నడుచుకుంటూ పార్టీ ఆఫీస్ కు వస్తున్న పట్టాభిని పోలీసులు తీసుకెళ్లి విజయవాడ పంపించారు.
మొదట 44 మందిపై కేసు
దాడి జరిగిన వెంటనే పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర సోర్స్ ఉపయోగించి 44 మందిపై కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న కొందరిని విచారించి సాక్షులుగా పెట్టారు. రెండో సారి కూటమి ప్రభుత్వ హయాంలో 37 మందిని నిందితులుగా చేర్చారు. అందులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు కూడా ఉంది. రెండో సారి టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ వద్ద పోలీసులు సంతకం పెట్టించుకొని కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ పోలీసులు ఈ కేసులో చేర్చారు. మూడు నెలల క్రితం ఈ కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ విచారించి మరో 23 మందిని నిందితులుగా చేర్చింది. 45 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపగా వీరు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. మరో 33 మంది ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు స్థానికంగానే విచారిస్తారని, సుప్రీం కోర్టు పిటీషన్ ను త్రోసిపుచ్చింది. 14 రోజుల్లో వీరి బెయిల్ పిటీషన్ పై తీర్పు ఇవ్వాలని కింది కోర్టును సుప్రీ కోర్టు ఆదేశించింది. ఈనెల 14తో ఈ గడువు ముగుస్తుంది.
సోమవారం ఏమి జరిగింది?
గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్థన్ నేరుగా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానానికి వచ్చి ఈ కేసుతో తనకు సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేశారు. దాడి జరిగిన రోజు తాను పార్టీ కార్యాలయానికి రాలేదని, పోలీసులు సాక్షిగా మాత్రమే తీసుకుంటామని తనతో సంతకం పెట్టించుకుని తాను అట్రాసిటీ కేసు పెట్టినట్లు ఎఫ్ఐఆర్ వేశారన్నారు. పోలీసులు చేసిందే తప్ప తనకు ఏమీ తెలియదని చెప్పారు. సత్యవర్థన్ చెప్పిన అంశాలన్నీ జడ్జి కోర్టులో రికార్డు చేయించారు.
అయితే సత్యవర్థన్ అఫిడవిట్ వెనుక వంశీ హస్తం ఉందనే విమర్శలు కూడా బయట వినిపిస్తున్నాయి. వంశీ దాడిలో పాల్గొనక పోయినా పాల్గొన్నట్లు పోలీసులు కేసులో చేర్చడాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు వంశీ రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టులో ఉంది.
ఈ కేసు ఎందుకింత ఆసక్తిగా మారింది?
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు ఎందుకు ఇంత ఆసక్తిగా మారింది. ఇందులో వల్లభనేని వంశీ పేరును చేర్చడంతో రాష్ట్ర వ్యప్తంగా చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తల్లి భువనేశ్వరిని అవమానించిన వారిలో వల్లభనేని వంశీ ప్రథముడని లోకేష్ పలు మార్లు చెప్పారు. మా అమ్మను అవమానించిన వారికి బుద్ధి చెబుతానని హెచ్చరించారు. ఈ హెచ్చరిక నేపథ్యంలో వంశీపై కేసు నమోదు కావడం చర్చకు దారి తీసింది. పోలీసులు వంశీని అరెస్ట్ చేసేందుకు పలు దఫాలుగా ప్రయత్నించడం కూడా మీడియాలో చర్చనియాంశమైంది. అయితే ఇప్పటికీ పోలీసులు వంశీ ని అరెస్ట్ చేయలేక పోయారు.