ప్రభుత్వం ఏర్పడక ముందే వ్యతిరేక స్వరమా..?
x

ప్రభుత్వం ఏర్పడక ముందే వ్యతిరేక స్వరమా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. మొత్తం 25అసెంబ్లీ సీట్లలో


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటింది. మొత్తం 25 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి. కేంద్రస్థాయిలో ఎన్‌డీఏ, ఇండి కూటమి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. ఈ పోరులో ఎన్‌డీఏ కూటమికి 289 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర స్థాయిలో టీడీపీ, జనసేన జట్టు కింగ్ మేకర్‌గా మారింది. ఒకవేళ ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వడానికి టీడీపీ, జనసేన నిరాకరిస్తే.. ఎన్‌డీఏ కూటమి చేతిలో ఉండేవి కేవలం 271 సీట్లు మాత్రమే. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన సీట్లు 272. దీంతో ఎన్‌డీఏ కూటమిలో టీడీపీ, జనసేన పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు, పవన్.. ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి టీడీపీకి అద్భుతమైన అవకాశం లభించిందని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారు. కొందరు ఇతర పార్టీల నేతలు కూడా ఇదే చెప్తున్నారు.

కానీ ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా కాదు కదా విభజన చట్టం హామీల ఊసు కూడా ఎత్తలేదని ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏకే తమ మద్దతు ఇవ్వాలంటే తమకు కొన్ని డిమాండ్స్‌ ఉన్నాయని చెప్పడమైతే చెప్పారు. కానీ అవి విభజన చట్టానికి సంబంధించినవి కాదు. ఎన్‌డీఏతోనే తాము కొనసాగాలంటే తమకు మూడు కేంద్రమంత్రి పదవులు, సహాయక మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే చంద్రబాబుపై కొన్ని వర్గాల్లో వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ఇంతటి అవకాశం దక్కినా వినియోగించుకోలేక పోతే చంద్రబాబు అంత చేతకాని నేత ఎవరూ ఉండరంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా వైరల్ అవుతున్నాయి.

ప్రజలు కోరుతున్నవి ఇవి..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.

అమరావతి నిర్మాణం. పోలవరం పూర్తి.

వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ.

విశాఖ, విజయవాడలో మెట్రో సౌకర్యం.

జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్

విశాఖ రైల్వే జోన్

ఏపీ అసెంబ్లీలో స్థానాల పెంపు

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం.

చంద్రబాబు ఇలాంటి డిమాండ్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కొందరు మేధావులు కూడా కోరుతున్నారు. కానీ చంద్రబాబు అలా చేయలేదని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే మైనారిటీ రిజర్వేషన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత కీలకంగా మారుతున్నాయి. మైనారిటీలకు రిజర్వేషన్లు ఉంటాయని, వాటిని కొనసాగించే బాధ్యత తనదని చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో పలుసార్లు చెప్పారు. అదే విధంగా వైసీపీ అమలు చేసిన (కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంతా బోగస్ అని, అది ప్రజల ఆస్తులను దోచుకునే చట్టమని చంద్రబాబు ఘంటాపథంగా చెప్పారు. ఈ రెండు అంశాల్లో బీజేపీ, టీడీపీ మధ్య వ్యతిరేక దృక్పథాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడు ఆంధ్రలో మైనారిటీ రిజర్వేషన్ల కొనసాగింపుకు అంగీకరించకపోతే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యథాతథంగా కొనసాగించాలంటే చంద్రబాబు నిర్ణయం ఏంటి. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేస్తారా? లేదంటే అలానే కొనసాగుతారా? అన్న ప్రశ్నలు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలుగా ఉన్నాయి. మరి వీటిపై అతి త్వరలో స్పష్టత వస్తుందేమో చూడాలి.

Read More
Next Story