ఆ ఎమ్మెల్యేలది కంఠశోషేనా? ఎవరన్నా జవాబు చెప్పేవాళ్లున్నారా, లేదా?
x

ఆ ఎమ్మెల్యేలది కంఠశోషేనా? ఎవరన్నా జవాబు చెప్పేవాళ్లున్నారా, లేదా?

మంత్రులు, అధికారులపై స్పీకర్ ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర మంత్రులకు, అధికారులకు శాసనసభ వేదికగా చురక వేశారు. ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్ అవర్) ప్రాధాన్యత గుర్తిస్తున్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రస్తావనకు వచ్చే అంశాలను పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలు చెప్పేది కంఠశోషే అవుతుందని మందలించారు.
అసలేమి జరిగిందంటే..
సభ ప్రారంభం కావడంతోనే క్వశ్చన్ అవర్ ను స్పీకర్ చేపట్టారు. ఈ సమయంలో సభ్యులు ప్రస్తావించాలనుకున్న సమస్యలను చెప్పి ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరవచ్చు. ఆ సమయంలో సంబంధిత మంత్రులు లేకపోతే దాన్ని ఎవరైనా నోట్ చేసుకుని తర్వాత వాటిని ఆయా శాఖలకు పంపించడం ఆనవాయితీ. సభ ప్రారంభమవుతూనే పలువురు సభ్యులు వివిధ అంశాలను ప్రస్తావించారు.

విజయా డైరీపై ఎంక్వైరీ వేస్తారా వేయరా అని ఓ సభ్యుడు ప్రశ్నించారు. దీనిపై ఎవరూ సమాధానం చెప్పేవాళ్లు లేకపోయారు. దాంతో పరిస్ధితిని గమనించిన స్పీకర్.. ఏమిటిదీ, జవాబు చెప్పే వాళ్లు లేకపోతే ఈ జీరో అవర్ కి అర్థమేముందీ అని ప్రశ్నించారు. అటు సభ వైపు, ఇటు అధికారులు కూర్చొనే బ్లాక్ వైపు చూస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
"శాసనసభా వ్యవహారాల మంత్రి గారూ, ఇది అసెంబ్లీ.. క్వశ్చన్ అవర్ చాలా ప్రధానమైంది. ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పింది విని జవాబు ఇచ్చే వాళ్లు ఎవరైనా ఉన్నారా? లేరా? ఎవరు స్పందించరేంటీ? ఆ ఎమ్మెల్యేలు చెప్పింది నోట్ చేసుకుంటున్నట్టు లేదు. జవాబు చెప్పే వాళ్లు లేకపోతే ఇది కంఠశోషే అవుతుంది.." అన్నారు.
దీనికి మద్దతుగా టీడీపీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేచి.. 'అవును, అధ్యక్షా.. ఇక్కడ ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు' అన్నారు. కంఠశోషలాగానే ఉంది. జీరో అవర్ లో వచ్చే సమస్యలను, మాట్లాడే వారు ప్రస్తావించే సమస్యలను నోట్ చేసుకుని సంబంధిత శాఖలకు పంపాలని బుచ్చయ్య చౌదరి కోరారు. జీరో అవర్ లో ప్రస్తావనకు వచ్చే అంశాలను నోట్ చేసుకునేందుకు- ప్రతి రోజూ అధికారుల నుంచి ఒకర్ని, మంత్రి వర్గం నుంచి ఒకర్ని కేటాయించాలని సూచించారు. దానికి స్పీకర్ కూడా అంగీకరించారు. ఎవరో ఒకర్ని నియమించాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల సమాధానం ఇస్తూ.. తప్పకుండా చేస్తామన్నారు. క్వశ్చన్, జీరో అవర్ లో ప్రస్తావించే అంశాలను సంబంధిత శాఖలకు పంపించే మెకానిజం ఉందన్నారు.
Read More
Next Story