ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు. వారి పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. అన్నింటా మీరేనా? కార్యకర్తలు బలపడాలి. అప్పుడే పార్టీ బలపడుతుంది.
తెలుగుదేశం పార్టీలో ఎవరికి వారు తమ కార్యకర్తలను కాపాడుకునే పనిలో పడ్డారు. ముందు నాయకులు ఆర్థికంగా బలంగా ఉంటే కార్యకర్తలు వారంతట వారే బలం పుంజుకుంటారని నాయకులు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం అలా భావించడం లేదు. అన్నింటా మీరే ఉంటున్నారు. కార్యకర్తల పరిస్థితి ఏమిటని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. అందరినీ నేను అనడం లేదు. కొందరి గురించి మాట్లాడుతున్నానన్నారు. ముఖ్యమంత్రి మాటలను తెలుగుదేశంలోని ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతవరకు అర్థం చేసుకున్నారనేది తేలాల్సి ఉంది.
ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉంది. ప్రభుత్వ శాఖల్లో నిధులు ఉండటం లేదు. శాఖల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాగే వదిలేస్తే ఎన్నికల్లో పెట్టిన కోట్ల ఖర్చులో పైసా కూడా వచ్చేట్లు లేదని పలువురు ఎమ్మెల్యేలు సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు 60 లక్షల టన్నుల ఇసుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విక్రయించింది. గత ప్రభుత్వం డంపింగ్ యార్డుల్లో ఉంచిన ఇసుకను ప్రస్తుత ఎమ్మెల్యేల కనుసన్నల్లో అమ్మారు. ప్రస్తుతం ఇసుక దొరకటం లేదు. ఉన్నప్పుడు ఇష్టాను సారం అమ్మి, ఇప్పుడు ఇసుక లేదంటే ఎలాగని పలువురు తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీనికి వారి నుంచి సరైన సమాధానం లేదు.
ఇసుకపై బిల్డర్లు, బేల్దార్లలో అసంతృప్తి పెరుగుతోంది. దీనిని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చాలా మంది బేల్దార్ కూలీలు పనులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయం మీరు తెలుసుకుని ఇసుకను వీలైనంత త్వరగా క్వారీల నుంచి డంపింగ్ యార్డులకు చేర్చేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మనం ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు సమాచారం.
శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మంత్రుల సమావేశంలో మరోసారి ఇవే అంశాలు లేవనెత్తారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉదయం అందరితో మాట్లాడిన సీఎం సాయంత్రం కొందరితో మాట్లాడి పార్టీ గురించి బయట ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలు కూడా వారికి వివరించారు. ప్రతిపక్ష పార్టీ తీరు గురించి కూడా స్వల్ప చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై కూడా చర్చ జరిగింది. కేసులు, అరెస్ట్ ల పై కూడా చర్చించారు. ఇసుక, మద్యం ప్రధానంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని, వీటి విషయంలో మనం మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే వాటి గురించి తన దృష్టికి తీసుకు రావాలని చెప్పినట్లు సమాచారం. మద్యం షాపుల వారు దరఖాస్తులు చేయక ముందు, షాపులు పొందిన తరువాత సిండికేట్ లు గా మారటం కూడా ఇబ్బందులు తెచ్చి పెట్టే అంశంగానే భావించాల్సి ఉంటుందని సీఎం మంత్రులతో అన్నారని సమాచారం.
సీఎం చెప్పిన మాటలు ఎమ్మెల్యేలు పట్టించుకుంటారా? లేదా? అనే అంశాలపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజలకు చాలా హామీలు ఇచ్చాం. వాటి గురించి ఆలోచించండి. సూపర్ సిక్స్ పథకాల గురించి ఆలోచించాలి. నిధుల సమీకరణ ఎలాగనే విషయం ఆలోచించాల్సి ఉందని సీఎం ఎమ్మెల్యేలతో అన్నారు. ఇప్పటికే అప్పులు భారీ స్థాయిలో చేశాము. ఇకపై అప్పులు వచ్చే పరిస్థితులు కూడా లేవనే విషయం గమనించాలని సీఎం మంత్రులకు చెప్పారు. అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కావాలి. అప్పుడే మనపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని సీఎం మంత్రులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం.
కొత్త ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. మంత్రులు 18 మంది ఉన్నారు. మంత్రులు, ఎంపీలు కలిసి కొత్తగా 80 మంది ఉన్నారు. కుటుంబంలో బేధాభిప్రాయాలు ఉంటాయి. పార్టీ కూడా అంతే పార్టీ పెద్దగా సీఎం స్థానంలో ఉన్న నేను వాటిని సరిదిద్దాల్సి ఉంది. అధికారంలోకి రాగానే 7 స్వేత పత్రాలు విడుదల చేశాం. ఆ స్వేతపత్రాల గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఏమి చేశామో చెప్పాల్సి ఉంటుందని సీఎం నాయకులకు ఉద్భద చేశారు. ఎన్నికల్లో చాలా మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. వారికి న్యాయం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దని హెచ్చరించారు.