టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో మేధా టవర్స్ వద్ద సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం మండలంలోని కేసరపల్లి మేధా టవర్స్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న పొట్లూరి సాంబశివరావుకు చెందిన స్థలంలో ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రౌండ్‌ బాగు చేసే పనులు శుక్రవారం రాత్రి ప్రారంబించారు. సెక్యూరిటీ ఏర్పాట్ల విషయమై కృష్ణా జిల్లా ఎస్‌పీ, కలెక్టర్‌లు వచ్చి పరిశీలించారు.

ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదట 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయించినప్పటికీ ఎన్‌డీఏ కూటమి తరపున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, అధికార పక్ష నేతగా ఎన్నిక సమావేశం వల్ల చంద్రబాబు ఢిల్లీలో ఉండాల్సి రావడంతో 12న ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అదే రోజు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే మంత్రి వర్గ కూర్పులో లోకేష్‌ ఉన్నారనేది సమాచారం. తనదేమీ లేదని, అంతా చంద్రబాబునాయుడు గారు చెప్పినట్లే జరుగుతుందని చెబుతున్నప్పటికీ లోకేష్‌ పాత్ర ప్రభుత్వంలో ఎక్కువగానే ఉంటుందని రాజకీయ మేధావులు భావిస్తున్నారు. గతంలో మంత్రిగా చేసిన అనుభం ఉండటం, పాదయాత్ర ద్వారా జనంతో ఎలా మమేకమై ముందుకు వెళ్లాలో తెలుసుకున్నందున పాలన వ్యవహారాల్లో చురుగ్గానే ఉండే అవకాశం ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలోని ముఖ్య నాయకులు కూడా లోకేష్‌ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రధానమైన నాయకునిగానే గుర్తిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య మంత్రులు, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందుగా అనుకున్నట్లు ఎయిమ్స్‌ హాస్పిటల్‌ వద్ద కాకుండా గన్నవరం విమానాశ్రయం వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. విమానాశ్రంలో దిగిన వెంటనే ఎవరైనా విఐపీలు వేదిక వద్దకు చేరుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా అనువుగా ఉంటుందని పార్టీ నాయకులు భావించారు.
Next Story