గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందరం కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. కర్మఫలం ఎవరినీ వదలదని, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయని వారు స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పాపాలే వారిని జైలు పాలు చేస్తున్నాయన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రేషన్‌ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టు ప్రక్రియ కాస్తా ఆలస్యం అయిందని, ఇక అలాంటి జాప్యం ఉండదని, పేర్ని నాని కూడా త్వరలో అరెస్టు అవుతారని వారు చెప్పారు. నాడు చంద్రబాబు, లోకేష్, టీడీపీ పైన నోరు పారేసుకున్న మరో మాజీ మంత్రి కొడాలి నాని అయితే పత్తా లేకుండా పోయారని కొల్లు రవీంద్ర, సుభాష్‌లు ఎద్దేవా చేశారు. నాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేసిన అరాచకాలకు, ఆకృత్యాలకు మూల్యం చెల్లించేందుకు కొడాలి నాని సిద్ధంగా ఉండాలని, కొడాలి నాని అరెస్టు కూడా తప్పదని హెచ్చరించారు. 2019–2024 వరకు జగన్‌ హయాంలో అరాచకాలకు పాల్పడిన ప్రతీ ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని హెచ్చరించారు.
దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ ఫలం ఏ ఒక్కరిని వదలదన్నారు. టీడీపీ గుర్తు మీద, టీడీపీ టికెట్‌ మీద గెలిచి చంద్రబాబునే తిట్టిన వ్యక్తి వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. పిలిచి టికెటి ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే.. చంద్రబాబునే తిడుతావా? అంటూ నిప్పులు చెరిగారు. వల్లభనేని వంశీ అరెస్టు పై వారు మాట్లాడుతూ వంశీ జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని వంశీ తిట్టాలని, చంద్రబాబును కాదని అన్నారు. వంశీ మీద ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్‌ చేసి, భయపెట్టి, బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ రోజు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నాడు. తప్పు చేసింది కాకుండా వంశీ బూతులు తిడుతున్నాడని, చంద్రబాబును తిడుతున్నాడని, వెళ్లి జగన్‌ను తిట్టుకోరా బాబు అంటూ వంశీని హెచ్చరించారు. బందరులో బియ్యం దొంగ పేర్ని నాని ఉన్నాడని, రేషన్‌ బియ్యం రైస్‌ కేసులో త్వరలోనే అరెస్టు ఉంటుందని స్పష్టం చేశారు.
Next Story