దొరా‌! కాటన్ దొరకి ముసుగెందుకు?
x
Source: Twitter

'దొరా‌'! కాటన్ దొరకి ముసుగెందుకు?

సర్ ఆర్థర్ కాటన్ దొరను అధికారులు రాజకీయ నాయకుడిగా మార్చేశారు. ఏకంగా ఆయన విగ్రహాలకు ముసుగులేసి ఘనత చాటుకున్నారు.



(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్,)

తిరుపతి: ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ దొర. దేశంలో నీటిపారుదల, నావిగేషన్ కాలువల నిర్మాణానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా పాలకులు, అధికారులు రాజకీయ నాయకునిగా మార్చేశారు. అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. విదేశీయుడైనా నీటిపారుదల రంగం ద్వారా సర్ ఆర్థర్ కాటన్ దొర చేసిన సేవలను ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు. అపర భగీరథుడిగా ఇప్పటికీ ఆయనను దైవంగానే భావించి నీరాజనాలు అందిస్తుంటారు. ఈ కోవలో ఈనెల 15వ తేదీ కాటన్‌ దొర 219వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

కాటన్ దొర... రైతు బాంధవుడు

రాయలసీమ జిల్లాలను.. తుంగభద్ర నీటి జలాలతో సస్యశ్యామలం చేయడానికి సర్ ఆర్థర్ కాటన్ తీవ్రంగా శ్రమించారు. కడప, కర్నూలు కాలువ (కేసీ కెనాల్) నిర్మించడం ద్వారా కరువు ప్రాంతానికి నీరు పారించారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం ద్వారా నాగార్జునసాగర్.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు సముద్రంలో వృధాగా కలవకుండా దూరదృష్టితో వ్యవహరించారు. అంతేకాదు రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఆరాధ్య దైవంగా ఇప్పటికీ నీరాజనాలు అందుకుంటున్నారు సర్ ఆర్థర్ కాటన్ దొర.

రాయలసీమలోని కర్నూలు, కోనసీమ ప్రాంతంలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, రాజమండ్రిలోని అనేక ప్రాంతాల్లో సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహాలను మనం చూడొచ్చు. అంటే ఆ ప్రాంత ప్రజలు కాటన్ దొరను తమ గుండెల్లో చిరస్థాయిగా పదిలం చేసుకున్నారనేది అర్థమవుతోంది. అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణతోపాటు అన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి ఏటా ఆయన జయంతి, వర్ధంతిని నిర్వహించడం ద్వారా కృతజ్ఞత చాటుకుంటున్నారు. రాజమండ్రి బ్యారేజ్ నిర్మించే సమయంలో.. 1847 నుంచి 1852 వరకు కాటన్ దొర ఉపయోగించిన సుమారు వంద చిత్రాలు, 15 యంత్ర పరికరాలు మ్యూజియంలో చూడవచ్చు. ఇప్పుడేమైంది...



కాటన్ దొర రాజకీయ నాయకుడా?!

కోనసీమ ప్రాంతంలో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు విడ్డూరంగా ఉంది. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన సంఘటన. అధికారులు క్షమాపణ చెప్పక తప్పని పరిస్థితి. కాటన్ దొరను రాజకీయ నాయకుడిగా మార్చేసి, ఆయన విగ్రహాలకు ముసుగులు వేశారంటే.. ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా మార్చాలని పరితపించిన గొప్ప వ్యక్తిని అవమానించడమేనని అంతా భావిస్తున్నారు.

ఎన్నికల కోడ్‌తో..

దేశంలో... ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తహసీల్దారు కార్యాలయ ఆవరణలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహానికి కూడా ముసుగు వేశారు. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉభయగోదావరి జిల్లాలకు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఇచ్చిన కాటన్‌ మహాశయుడు ఏ పార్టీకి చెందినవారై ఉంటారు? పార్టీలతో సంబంధం లేని కాటన్ దొర విగ్రహానికి ముసుగు వేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

"నీటిపారుదల రంగానికి అపార సేవ అందించి అపర భగీరథుడిగా నిలిచిన కాటన్‌ దొర విగ్రహానికి ముసుగేయడం ఏంటని? కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం ప్రశ్నించారు. అల్లవరం మండలం బెండమూర్లంకలోని కాటన్‌ దొర విగ్రహానికి ముసుగు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమాజ సేవకులు ఎవరు.. రాజకీయ నాయకులు ఎవరో తెలియని పరిస్థితిలో అధికారులు మిగిలిపోయారని ఆవేదన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది.

Read More
Next Story