ఓటమి వేళ.. చంద్రబాబుకు జ్ఞానోదయం ఎలా అయిందంటే!
x
ఫోటో కర్టసీ- రిపబ్లిక్ టీవీ

ఓటమి వేళ.. చంద్రబాబుకు జ్ఞానోదయం ఎలా అయిందంటే!

రాజకీయ పాఠాలను తన మామ ఎన్టీ రామారావు నుంచి నేర్చుకున్నానని చెప్పిన చంద్రబాబు ఎన్నికల్లో ఎలా ఓడిపోకూడదో PM నరేంద్ర మోదీ నుంచి నేర్చుకున్నానని అంటున్నారు.


రాజకీయ పాఠాలను తన మామ, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నుంచి నేర్చుకున్నానని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఎలా ఓడిపోకూడదో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి నేర్చుకున్నా అని చెప్పారు. తాను ఓడిన ప్రతిసారీ- ప్రతిపక్షాల చేతిలో కాదని,చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే అని కూడా అన్నారు.

మార్చి 6 గురువారం ఢిల్లీలో ఓ జాతీయ వార్తాఛానల్‌ రిపబ్లిక్‌ టీవీ నిర్వహించిన ప్లీనరీలో ‘లిమిట్‌లెస్‌ ఇండియా’ అంశంపై చర్చలో ఆయన తన గురించి చాలా విషయాలు చెప్పుకున్నారు. తానున్న కాలానికి చాలా ముందుకు వెళ్లి ఆలోచిస్తానని, తనకు పదవీ కాంక్ష లేదని, ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యం అని వివరించారు. తాను చాలాసార్లు అవమానాలకు, ఎద్దేవాలకు గురైనా ఆ తర్వాతి తరం వాటి ఫలితాలను అనుభవించినపుడు బోలెడంత సంతోషంగా ఉంటుందన్నారు.
ఇన్ని మంచి పనులు చేసిన మీరు 2004, 2019లో అదీ తండ్రీ కొడుకులైన వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఎందుకు ఓడిపోయారని అడిగినపుడు చంద్రబాబు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.
‘‘మనం మంచి పనులు చేయడంతోపాటు ప్రజలు మనవైపు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మనం అభివృద్ధి ఆకాంక్షల్లో మునిగిపోయి, చేసే పని గురించి ప్రజలకు సరిగా చెప్పలేకపోతే వాళ్లు మనకు ఓట్లు వేయకపోవచ్చు. 2004, 2019లో నేను అభివృద్ధి పనుల్లో మునిగిపోవడం వల్ల ఓడిపోయాను తప్ప.. ప్రతిపక్షాలు ఓడించలేదు. ఈ విషయంలో నేను ప్రధానమంత్రి మోదీని అభినందిస్తున్నా. ఆయన తాను అనుకున్న పనులు చేయడమే కాకుండా స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నారు. విధానాలు, దేశాభివృద్ధి సుస్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ఎన్నికల్లో ఓడిపోకూడదన్న పాఠాన్ని నేను ప్రధానమంత్రి నుంచి నేర్చుకున్నా’’ అని చెప్పారు.
రాజకీయ జీవితంలో జైలుకెళ్లడంతో పాటు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా అంతే బలంగా కోలుకొని ప్రత్యర్థులను చావుదెబ్బ తీయడానికి ప్రేరణనిచ్చిన అంశాలేంటని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇలా ఉంది...
‘‘దేశంలో హద్దుల్లేని అవకాశాలు రాబోతున్నాయి. మారుమూల కూర్చున్నా ప్రపంచస్థాయి వ్యవస్థను నడిపే వెసులుబాటు మనకుంది. అందువల్ల దేన్నీ అసాధ్యంగా భావించొద్దు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. భవిష్యత్తులో ప్రతీదీ సాంకేతికత ఆధారంగా నడుస్తుంది కాబట్టి అందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి’’ అని పేర్కొన్నారు.
2047 నాటికి ఎటుచూసినా మోదీ హవానే...
‘‘భారత్‌కు భవిష్యత్తులో హద్దులు ఉండవని నేను భావిస్తున్నాను. నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ 2047 నాటికి ఒకటి, లేదంటే రెండో స్థానానికి చేరుకుంటుంది. దేశం ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నంబర్‌వన్‌ స్థానంలో ఉంటారు. కావాలంటే ఈ రోజు నేను చెప్పిన మాటలను రాసిపెట్టుకోండి. ప్రస్తుతం మనమంతా యూదుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా వారు అత్యంత ప్రభావం చూపే స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోని ఏ సంపన్న నివాస ప్రాంతాలకు వెళ్లి చూసినా అది భారతీయులదే అవుతోందని గర్వంగా చెప్పగలను. అమెరికాలోని భారతీయుల సగటు ఆదాయం అక్కడున్న మిగతా దేశాల వారి కంటే రెట్టింపు. ప్రస్తుతం దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ ఉన్నారు.
నేను కాలానికి ముందు ఆలోచిస్తుంటా..
‘‘నేను కాలానికి ముందు ఆలోచిస్తుంటా. 1995లో ఎవ్వరూ ఐటీ గురించి మాట్లాడనప్పుడే నేను మాట్లాడా. అప్పుడు కొందరు ఎగతాళి చేశారు. కానీ నేను చేస్తున్నది మంచేనని నిబద్ధతతో నమ్మడంతో కొనసాగించాను. ఈ దేశంలో ఒకప్పుడు టెలికాం రంగం బీఎస్‌ఎన్‌ఎల్‌ గుత్తాధిపత్యంలో ఉండేది.ముగ్గురు ప్రధానమంత్రులతో పోరాడిన తర్వాత అంతిమంగా వాజ్‌పేయీ టెలికాం రంగంపై నియంత్రణ ఎత్తేశారు. ఆ రంగంలో వచ్చిన అతిపెద్ద విప్లవం అదే. 2004లో నేను ఎన్నికల్లో గెలిస్తే ఇప్పటికి హైదరాబాద్‌ పరిస్థితి మరోలా ఉండేది. అప్పట్లో నేను ఏర్పాటుచేసిన అద్భుతమైన ఎకోసిస్టమ్‌ ఇప్పటికీ పనిచేస్తోంది’’ అని అన్నారు.
ఏఐ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నా అనేక లాభాలూ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయనేది వాస్తవం. ఆరోగ్యం, అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండాలి. హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలి. నెగెటివ్ థింకింగ్ వద్దు.. పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలి. ఇండియాకు జనాభానే గొప్ప వరం. అమరావతిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వంసం చేశారు. ఒక్క తప్పూ నేను చేయకపోయినా జగన్ అరెస్ట్ చేయించారు. నన్ను అరెస్టు చేసినప్పుడు 60 దేశాల్లో ఉన్న తెలుగువాళ్లు స్వచ్ఛందగా బయటికి వచ్చారు. అందుకే దుష్టపాలన పోయింది. ఇకపై ఏపీ అభివృద్ధి వేగం పుంజుకుంటుంది" అని చంద్రబాబు చెప్పారు.
Read More
Next Story