వరద బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. భయపడొద్దంటూ భరోసా
భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతా అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రమాద గంటికలు కూడా మోగాయి. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతా అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రమాద గంటికలు కూడా మోగాయి. ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం రెండు డేంజర్ మార్క్‌లను దాటి మూడో డేంజర్ మార్క్‌కు అతి చేరువలో ఉంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దాంతో పాటుగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదపుటంచున ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని మంత్రులు వంగలపూడి అనిత, రామానాయుడు, అచ్చెన్నాయుడు, పార్థసారథిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారంలో పర్యటించిన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. నిర్వాసితులతో ముఖాముఖి అయ్యారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి పూర్తి సహకారం అందిస్తుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగిన తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ప్రజల ప్రభుత్వం అధికారంలో ఉందని, గతంలో మాదిరిగా మాటల ప్రభుత్వం కాదని ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిర్వాసితులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది, ఎవరు భయాందోళనలకు గురి కావాల్సి అవసరం లేదని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో నిర్వాసిత కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన.
గత ప్రభుత్వ హయాంలో అయితే అప్పటి ముఖ్యమంత్రి వరద బాధితులను పరామర్శించడం, వరద పరిస్థితులపై సమీక్షలు నిర్వహించడం అంతా గాల్లోనే చేసేవారంటూ ఎద్దేవా చేశారు. అప్పట్లో బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజలను వారి కష్టాలకు వారిని వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం అలా కాదని, ప్రజలకు ఇబ్బంది ఉంది అంటే ఎక్కడా ఉన్న వచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
వరద బాధితుల విషయంలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి కనిపించకూడదని సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. వరద ప్రమాదం ముంచుకొస్తున్న క్రమంలో రైతులకు కూడా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఎన్‌డీఏ సర్కార్ ఒకడుగు ముందే ఉందని, వరద తగ్గే వరకు అన్ని వసతులతో పునరావాసం ఏర్పాటు చేస్తామని, వరదలు తగ్గి బాధితులు తమ స్వగ్రామానికి వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.3 వేలు అందిస్తామని చెప్పారాయన. వరద బాధితులకు ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కూడా చెప్పారాయన. రైతులు భయపడొద్దని, ఏం జరిగినా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని, వారికి పూర్తి సహకారం అందిస్తుందని రైతులకు ధైర్యం చెప్పారు అచ్చెన్నాయుడు.