వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కేసుల నమోదు పర్వం కొనసాగుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ కార్యదర్శి, కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై తాజాగా కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయనపై నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న అర్జున్‌రెడ్డి, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వర్రా రవీందర్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా వర్ర రవీందర్‌రెడ్డి పోస్టులు పెడుతున్నాడని, దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో ఆరోపించారు. హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.