
ఫారెస్ట్ సిబ్బందిపై దాడి: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై ఎస్సీ,ఎస్టీ కేసు
అటవీశాఖ సిబ్బందిని చితకబాదిన శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా, కొట్టడం సరైన పద్ధతి కాదని ఓ ఉద్యోగి చెబుతున్నా వినిపించుకోలేదు. వారిపై పిడిగుద్దులు కురిపించారు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేయించినందుకు ఆయనపై బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాజశేఖరరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
కేసు ఎందుకు పెట్టారంటే..
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మంగళవారం రాత్రి అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే కారును మంగళవారం రాత్రి పది గంటల సమయంలో శిఖరం చెక్‌పోస్ట్ దగ్గర ఆపారు. ఎమ్మెల్యే కారును తనిఖీ చేయడానికి సిబ్బంది పూనుకున్నారు. ఇది ఎమ్మెల్యే వాహనమని, పంపేయమని రాజశేఖరరెడ్డి అనుచరులు అటవీశాఖాధికారులకు చెప్పినా వినిపించుకోలేదని తెలిసింది.
దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వెంటనే అటవీశాఖ ఉద్యోగుల జీపు దగ్గరకు వెళ్లారు. అందులో ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ నెక్కటి రేంజ్‌కు చెందిన డిప్యూటీ రేంజి అధికారి డి.రామ్‌నాయక్, ఇన్‌ఛార్జి సెక్షన్ అధికారి జె.మోహన్‌కుమార్, అటవీ బీట్ అధికారి టీకే గురవయ్య, డ్రైవర్ షేక్ కరీముల్లాలను బయటకు పిలిపించారు. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ కరీముల్లా చెంపపై రెండు దెబ్బలు కొట్టారు. మోహన్‌కుమార్, గురవయ్యలనూ బండ బూతులు తిడుతూ చేయి చేసుకున్నారు.
కార్లో కూర్చోబెట్టి చితక్కొట్టిన ఎమ్మెల్యే మనుషులు..
అప్పటికీ ఆయన ఆగ్రహం చల్లారలేదు. తన అనుచరులను అధికారుల జీపులో కూర్చోవాలన్నారు. అటవీశాఖ సిబ్బందినీ అందులోకి ఎక్కించి, ఎమ్మెల్యేనే ఆ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ సున్నిపెంట, శ్రీశైలం ప్రాంతాలకు వెళ్లారు. దారిలో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఉద్యోగులను కొట్టారు.
కొట్టడం సరైన పద్ధతి కాదని ఓ ఉద్యోగి చెబుతున్నా వినిపించుకోలేదు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. వారినుంచి వాకీటాకీలు, సెల్‌ఫోన్లు, పర్సులు, జేబులోని నగదు లాక్కున్నారు. శ్రీశైలంలో వాహనాన్ని అర్ధరాత్రి రెండు గంటల వరకు తిప్పుతూ వారిని కొడుతూనే ఉన్నారు. అనంతరం వారందరినీ ఓ కాటేజీకి తీసుకెళ్లి బంధించారు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో విడిచిపెట్టారు. తమపై దాడి జరిగిందని బాధితులు అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో శ్రీశైలం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వసూళ్లకు పాల్పడుతున్నారు- బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, శ్రీశైలం
ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి వాదన వేరుగా ఉంది. ఆయన ఏమన్నారంటే..."శిఖరం, డోర్నాల చెక్‌పోస్ట్‌ల దగ్గర సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. రాత్రి 9గంటల తర్వాత వచ్చే వాహనదారుల నుంచి రూ.2వేల వరకు తీసుకుంటున్నారు. మంగళవారం రాత్రి నా వాహనాన్నీ ఆపేశారు. రాత్రి 9 తర్వాత వాహనాలపై నిషేధం ఉంటే ఘాట్‌రోడ్డులో అన్ని వాహనాలు ఎలా ఉన్నాయి? బ్రీత్ ఎనలైజర్లు పట్టుకుని భారీఎత్తున అపరాధరుసుము వసూలు చేస్తున్నారు. శ్రీశైలం పరిసరాల్లోని అటవీభూముల్లో పలు ఆక్రమణలున్నాయి. అటవీశాఖ అధికారులకు అవి కనిపించట్లేదు. దీంతోపాటు అటవీప్రాంతం పేరు చెప్పి ప్రతి అభివృద్ధి పనికీ అడ్డం తగులుతున్నారు. ఒక్క రోడ్డుకూ అనుమతులు ఇవ్వట్లేదు. అందుకే వారి వాహనంలో వారిని తీసుకెళ్లి శ్రీశైలంలో నేను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాను. వారిని గట్టిన ప్రశ్నించిన విషయం వాస్తవమే. అధికారులను ప్రశ్నించాను గానీ వారు దళితులా? గిరిజనులా? అన్న విషయం నాకెలా తెలుస్తుంది? అటవీశాఖాధికారులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను కూడా విలేకరుల సమావేశం పెట్టి వాస్తవాలు వివరిస్తాను" అన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు.
ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు ఆగ్రహం
శ్రీశైలం శిఖరం చెక్‌పోస్టు వద్ద అటవీ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేశారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తరచుగా ఆయన వివాదాల్లో చిక్కుకోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు.
నివేదిక ఇవ్వాల్సిందిగా పవన్‌కల్యాణ్ ఆదేశం..
శ్రీశైలంలో అటవీశాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. నిబంధనల ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఉద్యోగులపై దాడి చేసిన వారు ఏ స్థాయి వ్యక్తులైనా సరే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మద్యం మత్తులో కొట్టిన ఎమ్మెల్యే...?
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అటవీశాఖ ఉద్యోగులను బెదిరించడం, ఓ ఉద్యోగి చెంపపై కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ సీసీ ఫుటేజీని అటవీశాఖ అధికారులు విడుదల చేశారు.
మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులను శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కొట్టినట్టు ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్దే డ్రైవర్ పై దాడి చేసినట్టు తెలిపింది. అటవీ శాఖ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరిక చేశారని, అలా వీలుకాదన్నందుకు మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్బాషలాడినట్టు సంఘం ఆరోపించింది.
ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే, తాము ఎలా విధులు నిర్వహించాలని సిబ్బంది వాపోయారు. ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి చేసినట్టు సంఘం పేర్కొంది.
Next Story