దాడి చేసింది పెట్రోల్ బాంబుతోనా?
x

దాడి చేసింది పెట్రోల్ బాంబుతోనా?

విద్వేషం పడగ విప్పింది. టిడిపి ప్రచార వాహనం పై పెట్రోల్ తో దాడి చేసి నిప్పంటించిన సంచలనం రేకెత్తించింది.


(ఎస్. ఎస్. వి. భాస్కర్ రావ్)

తిరుపతి: రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా అంతకుముందు విపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుపై గులకరాళ్ళ దాడులు సంచలనం రేకెత్తించాయి. ఈ వివాదాలు ఇంకా సద్దుమణగక ముందే పీలేరులో టిడిపి ప్రచార వాహనాన్ని దగ్ధం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జాతీయ రహదారిపై టిడిపి ప్రచార వాహన శ్రేణి లక్ష్యంగా గుర్తుతెలియని వ్యక్తులు శనివారం ఉదయం పెట్రోల్‌తో దాడి చేశారు. వాహనానికి నిప్పండించడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహన శ్రేణికి ముందు టిడిపి అభ్యర్థి సతీమణి కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మాజీ సీఎం, బిజెపి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

" ఇది పిరికిపంద చర్య. వారికి ఓటమి కళ్ల ముందు కనిపిస్తోంది. అది భరించలేక, రాజకీయంగా ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి చర్యలు దిగుతున్నారు. నియోజకవర్గంలో అభ్యర్థులపై నిఘా పెట్టండి. ఈ సంఘటన వెనక ఉన్న వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలి" అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. పోలీసులను డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళామని ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన ఈ సంఘటన రాజకీయ వర్గాలనే కాదు సామాన్యూలను కూడా కలవరానికి గురిచేసింది. జిల్లాలో ఇద్దరు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో మొదటిసారి జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వారంతా.. రాజకీయ ప్రత్యర్థులు

దశాబ్దాల కాలంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు మధ్య విద్యార్థి దశ నుంచి వర్గపోరాటం సాగుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పీలేరుకు చెందిన మాజీ సీఎం, బిజెపి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంతో కూడా రాజకీయ వైరుధ్యం ఉంది. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి స్వపక్షంలోనే విపక్షంగా మెలిగారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో కూడా వైఎస్ఆర్సిపిని తన భుజస్కందాలపై మోస్తున్నారు. ఇప్పుడు వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా మారారు.

ప్రత్యక్ష పోరు..

రాజంపేట ఎంపీ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉండగా, హ్యాట్రిక్ కొట్టడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీలో ఉన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోనే ఉన్న పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పీలేరు నుంచి కూడా గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం కూడా రాజంపేట పార్లమెంటు స్థానంలోనే ఉంది.

మంత్రి పెద్దిరెడ్డి చలువతో సీనియర్ నాయకుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి మళ్లీ పోటీలో ఉన్నారు. పూర్వ వాల్మీకిపురం, ప్రస్తుత పీలేరు నియోజకవర్గంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి.. ఇదే నియోజకవర్గంలో నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్న చింతల రామచంద్రారెడ్డి కుటుంబానికి కూడా నాలుగు దశాబ్దాల కాలం పైనుంచి రాజకీయ ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. మొదటి నుంచి పీ లేరునియోజకవర్గంలో చింతల వర్సెస్ నల్లారి అనివార్యంగా మారింది. అయితే, పొరపాటున కూడా ఆ రెండు కుటుంబాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా భౌతిక దాడులకు పాల్పడిన సంఘటనలు లేవనే చెబుతారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో నామినేషన్లు వేయకుండా, అడ్డుకున్నారని అప్పట్లో వైఎస్ఆర్సిపి నాయకులు గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత పరిస్థితి ప్రశాంతంగా మారింది. తాజా ఘటనతో...

కలకలం రేపిన పెట్రోల్ దాడి..

2024 ఎన్నికలకు రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే ఎంపీ స్థానం పరిధిలోని పీలేరు టిడిపి అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు ఎవరి పరిధిలో వారు ప్రచారాలు, సభలతో ముమ్మరంగా ఉన్నారు. అనూహ్యంగా శనివారం ఉదయం జరిగిన సంఘటన ఈ ప్రాంత వాసులను కలవరానికి గురిచేసింది. టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనూజ రెడ్డి సారథ్యంలో ప్రచార వాహన శ్రేణి చింతపర్తికి బయలుదేరింది. జాతీయ రహదారిపై ముందు తనుజ రెడ్డి కారులో ఉన్నారు. మద్దతుదారులు అనుసరిస్తున్నారు. స్పీకర్లు అమర్చుకున్న వాహనం చివరలో వస్తుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు పెట్రోల్ నింపిన ప్లాస్టిక్ కవర్లను వాహనం పైకి విసిరి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్వల్ప గాయాలతో వాహన డ్రైవర్ బాబా చారి ప్రాణాలతో బయటపడ్డారు.

" వాహనాలు మెల్లగా ముందుకు సాగుతున్నాయి. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై ముఖానికి ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ తో నింపిన కవర్లు విసిరారు. నేను అడ్డుకునే లోపలే అగ్గిపుల్ల గీసి, వాహనంపై వేశారు’’ అని బాధిత వాహన డ్రైవర్ బాబా చారి చెబుతున్నారు. ‘‘బైక్‌పై వచ్చినవారు పరారయ్యారు. ప్రాణభయంతో నేనూ పక్కకు దూకేసానె" అని బాబా చారి వివరించారు. ఇది ముమ్మాటికీ వైఎస్ఆర్సిపి మద్దతు దారుల పనే అని వాహనాల్లోని వారు ఆరోపించారు. "దమ్మూ.. ధైర్యం.. ఉంటే చక్కగా నిజమైన రాజకీయాలు చేయాలి" అని పీలేరు టిడిపి అభ్యర్థి నల్లారి సవాల్ విసిరారు. "ప్రచార రథానికి నిప్పు పెడితే ఇక్కడ భయపడే వారెవరూ లేరు" అని హెచ్చరించారు. నియోజకవర్గంలో టిడిపికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, అల్లరి మూకలతో వైఎస్ఆర్సిపి నాయకులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారని కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

"దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించాం" అని వాల్మీకిపురం సిఐ.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. సంఘటన జరిగిన సమీప ప్రాంతాల్లో మూడు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీలో ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చోటుచేసుకున్న ఈ సంఘటనతో చిత్తూరు జిల్లా ఉలిక్కిపడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తుది అంకం ప్రారంభం అయ్యింది. ఈ సంఘటన అన్ని వర్గాలను కలవరానికి గురిచేసింది. ముందు ముందు ఎలాంటి సంఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Read More
Next Story