సీనియర్లకు చంద్రబాబు భరోసా.. మంత్రివర్గంపై అయ్యన్న ఖుష్
x

సీనియర్లకు చంద్రబాబు భరోసా.. మంత్రివర్గంపై అయ్యన్న ఖుష్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అనేక మంది పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. వారందరికీ న్యాయం చేస్తామని కూటమి పార్టీలు బహిరంగంగానే చెప్పాయి. అదే విధంగా..


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అనేక మంది పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. వారందరికీ న్యాయం చేస్తామని కూటమి పార్టీలు బహిరంగంగానే చెప్పాయి. అదే విధంగా మంత్రివర్గ కూర్పు సమయంలో కూడా మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశే ఎదురైంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన కేబినెట్‌లో పలువురు సీనియర్లకు స్థానం కల్పించలేదు. అలాగని ఇతర సీనియర్లకు అవకాశం కల్పించారా అంటే అదీ లేదు. ఈసారి రాష్ట్ర కేబినెట్‌లో కొత్త ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో కొత్తవారికి బాధ్యతలు ఇచ్చే బదులు సీనియర్లుగా తమకు ఇవ్వొచ్చుగా అన్న భావన వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. ఇదే అంశంపై అయ్యన పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూలిపాళ్ల, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, యనమల కృష్ణుడు సహా పలువురు చంద్రబాబుతో చర్చించారు.

సీనియర్లకు వివరించిన చంద్రబాబు

ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పు ఏ ప్రాతిపదికన జరిగింది. మంత్రి పదవులు ఇవ్వడానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం వంటి అంశాలను బాబు.. సీనియర్లకు వివరించారు. అంతేకాకుండా వారికి భరోసా కల్పించారు. ‘‘మంత్రి పదవి దక్కలేదని నిరాశ చెందవద్దు. మీలాంటి నేతల సేవలను ఇతర రూపాల్లో వినియోగించుకుంటాం. మీకు సముచిత స్థానం కల్పిస్తాం. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. ఎవరూ దిగులు పడొద్దు’’ అని భరోసా ఇచ్చారు. బాబు భరోసాతో సీనియర్ల మనసు కుదుట పడింది.

‘మంత్రివర్గ కూర్పు బాగుంది’

ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన టీడీపీ సీనియర్ నేత అయ్యన పాత్రుడు.. మంత్రివర్గ కూర్పు బాగుందంటూ కితాబిచ్చారు. ‘‘పాత, కొత్త కలయికతో మంత్రివర్గ కూర్పు బాగుంది. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. ఎవరైనా తమ అజెండాను అధికారంలోకి వచ్చిన ఐదు ఆరు నెలల తర్వాత కానీ నెరవేర్చే వారు కాదు. కానీ చంద్రబాబు అలా కాదు. ఇచ్చిన మాట ప్రకారం ప్రకటించిన ఐదిటిపైనా తొలి రోజే సంతకం చేశారు. చంద్రబాబు అంటే మాటపై నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మరింత ప్రోత్సహించాలి. అలాంటి వారితో కలిసి మేం నడుస్తాం. చెప్పినట్లే లాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు, అన్న క్యాంటిన్ల పునరుద్దరణకు సంతకం చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను. చాలా సంతోష పడ్డాను. అంతేకాకుండా పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉంది. వాటిని కూడా తీసేయాలని సూచన కూడా చేశాను. దానికి గురించి తప్పకుండా ఆలోచిస్తానని చెప్పారు’’ అని ఆనందం వ్యక్తం చేశారు.

‘రాజీ పడొద్దని చెప్పాను’

అదే విధంగా అవినీతి అంశంపైన కూడా మాట్లాడారు ఆయన. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, ఒత్తిడి తప్పకుండా వస్తుందని, కానీ లొంగొద్దని చెప్పాను. పోలీసులను, అవినీతి పరులను ఎట్టిపరిస్థితుల్లో వదలొద్దు. ఎవరైతే తప్పు చేశారో వారిని అవసరం అయితే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోండి. కొన్ని ఒత్తిళ్లు తప్పకుండా వస్తాయి. ఎంత దోపిడీ జరిగిందని, పోలీసులు దగ్గరుండి అకారణంగా అరెస్ట్‌లు చేశారు ఈ ఐదేళ్లలో. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేస్తారా. సీఎం పరిపాలన గురించి మాట్లాడితే అరెస్ట్ చేసే అధికారం ఎవరిచ్చారు. ఐదేళ్లలో ఎంతమందిని బాధపెట్టారు. నాపైనే అకారణంగా 16 కేసులు పెట్టారు. వారిని చంద్రబాబు వదిలినా.. నేను వదలను’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి వర్గ కూర్పు భేష్

‘‘అందరికీ మంత్రి కావాలన్న ఆశ ఉంటుంది. ఉన్నవి 26 పదవులు.. కాబట్టి ఉన్నవారిలో ఎవరు బెస్ట్ అని చూస్తాం. సీనియర్, జూనియర్ కలయిక చాలా బాగుంది. నాకు తొలిసారి ఎన్‌టీఆర్.. 1985లో మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు నా వయసు 27 ఏళ్లు. అప్పుడు నేను జూనియర్‌నే కదా. అప్పుడు జూనియర్‌ను కాబట్టే ఇప్పుడు సీనియర్‌ను అయ్యాను. ఇప్పుడు కూడా కొంతమంది జూనియర్లు రావాలి. వారికి అనుభవం రావాలి. కాబట్టి జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా’’ అని అయ్యన పాత్రుడు వివరించారు.

Read More
Next Story