నల్లమల అడవుల్లోకి త్వరలో బాహుబలి రానుంది. ఎవరా బాహుబలి. ఎందుకు రానుంది. ఎక్కడి నుంచి వస్తుంది.


నల్లటి రూపం.. ఆరున్నర అడుగుల ఎత్తు... 12 అడుగుల పొడవు... 1,000 నుంచి 1,500 కిలోల బరువు, పెద్ద పులి, సింహాలను సైతం భయపెట్టే రూపం. ఇంతకూ ఆ జంతువు పేరు ఏమిటి? ఎందుకు దానికంత క్రేజ్ ఉంది. నల్లమల అడవుల్లో అంతరించి పోతున్న ఆ జంతువును తిరిగి తీసుకొచ్చి వదిలేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల ఉపయోగాలు ఏమిటి? నల్లమలలో విపరీతంగా పెరుగుతున్న వెదురును నియంత్రించేందుకు ఆ జంతువు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడమే ఈ కథనం సారాంశం.

విపరీతంగా పెరుగుతున్న వెదురు

నల్లమల అభయారణ్యంలో వెదురు విపరీతంగా పెరుగుతోంది. కృష్ణానదికి ఇరువైపుల వెదురు పెరగటం వల్ల ఇతర చెట్లు పెద్దగా పెరగటం లేదు. నల్లమలలో జీవ వైవిద్యం ఎక్కువ. అన్ని రకాల మొక్కలు ఉంటాయి. ప్రధానంగా ఇండ్లలో ఉపయోగించే కలపకు పనికొచ్చే చెట్లు కాకుండా వైద్యానికి పనికొచ్చే మొక్కలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అడవి అన్నిరకాల చెట్లతో ఉంటే అన్ని రకాల జీవరాసులు జీవించేందుకు అనువుగా ఉంటుంది. అయితే వెదురు ఎక్కువగా పెరగటం వల్ల ఇతర మొక్కలు పెరగకపోవడం, చెట్లు కూడా పెరుగుదల లేకుండా పోవడం జరుగుతోంది. ఈ వెదురు పొదల వల్ల సూర్య రశ్మి కూడా నేలపై పడే అవకాశం లేకుండా పోయిందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా భూమిలో ఉండే కొన్ని జీవులు బతకడం లేదు. మొక్కలు కూడా కొన్ని పెరగటం ఆగిపోతున్నాయి. అందుకే నల్లమలలో అడవి దున్నలను పెంచాలని ఫారెస్ట్ వారు నిర్ణయించారు. వెదురు చిగుళ్లు ఎక్కువగా అడవి దున్నలు తింటాయి. దీని వల్ల వెదురు పెరుగుదల పెద్దగా ఉండదు. వెదురు పెరుగుదలను నియంత్రించేందుకు అడవి దున్నలు అవసరమని భావించిన అటవీ శాఖ అధికారులు ఈ జంతువులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

నల్లమలలో 158 ఏళ్ల క్రితం అడవి బర్రెలు

నల్లమల అడవుల్లో 158 ఏళ్ల క్రితం వరకు అడవి దున్నలు, అడవి బర్రెలు ఉండేవి. అప్పట్లో అడవి కాకులు దూరేందుకు కూడా సందు ఉండేది కాదని పెద్దలు చెబుతుంటారు. కాల క్రమేణ అడవి దున్నలు నల్లమల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. వాటి నివాసానికి అనుకూలంగా అడవి లేదని భావించిన అడవి దున్నలు అవి జీవించేందుకు అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని వెళ్లిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధికారులను నల్లమల ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు చెందిన వారు సంప్రదించారు. నల్లమలలో అడవి దున్నలు, బర్రెలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నల్లమల అడవిలో అడవి దున్నలు జీవించేందుకు అనుకూలమైన ప్రాంతం ఉందో లేదోనని తెలుసుకునేందుకు అక్కడి అధికారులు కొందరు శాస్త్రవేత్తలను నల్లమలకు పంపించారు. వారు ఇటీవల నెల రోజుల పాటు అడవిలో తిరిగి పరిశీలించారు. నల్లమల అడవి దున్నలు, బర్రెలు జీవించేందుకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అడవి దున్నలు ఎక్కువగా సంచరించే పాపి కొండల్లోని నేషనల్ పార్క్ ను శాస్త్రవేత్తలు పరిశీలించి వాటి జీవన విధానం, మనుగడ, వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసి వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సైంటిస్ట్ లు ఒక నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా మరో మూడు నెలల్లో అడవి దున్నలు, బర్రెలు నల్లమలకు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. అదే జరిగితే నల్లమల అభయారణ్యంలో అడవి దున్నలు అతి పెద్ద వన్యప్రాణులు కానున్నాయి. వీటిని ఇండియన్ గౌర్, బైసన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

బైర్లూటిలో కనిపించిన అడవి దున్న

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్నను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలో అడవి దున్న తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇటీవల ఫారెస్ట్ అధికారులు కాపు కాచి దున్న రోడ్డు దాటుతుండగా వీడియో కూడా తీశారు. పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఈ అడవి దున్నలు నల్లమలలో కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా అడవి దున్న 1870లో కనిపించిందని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కనిపించిందని ఫారెస్ట్ వారు చెబుతున్నారు.ఈ జంతువును మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్‌లో గుర్తించినట్లు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా తెలిపారు. అక్కడ నుంచి అడవి దున్న గత నెలలో బైర్లూటి రేంజ్‌లోకి ప్రవేశించినట. ఈ దున్నలు ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించాయి. కాలక్రమేణా కనుమరుగు అయ్యాయి. కర్ణాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమైన ఈ దున్నలు కిలో మీటర్లు దాటుకొని నల్లమలలోకి ప్రవేశించడం అద్భుతంగా భావిస్తున్నామని అధికారులు చెప్పారు.

వీటి కదలికలను అధికారులు నిఘా ఉంచి సమాచారం సేకరిస్తున్నారు. విస్తారమైన గడ్డి క్షేత్రాలు, రకరకాలైన వృక్షాలు ఉండటం వల్ల వివిధ రకాల జంతువులు ఉన్నాయని, ఇప్పుడు అడవి దున్నలు రావడం అద్భుతంగా ఉందని అధికారులు వ్యాఖ్యానించారు. అటవీ అధికారులు అడవి దున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే తనంతట తానే పూర్వ అవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అడవి దున్నల జన్మస్థలం దక్షిణాసియా, ఆగ్నేయాసియా అడవులు. అక్కడ ఎక్కువగా ఉండే ఈ దున్నలను అంతరించి పోతున్న జంతువుల జాబితాలో 1986లో చేర్చారు

జీవ వైవిద్యాన్ని కాపాడేందుకే...

తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అటవీ ప్రాంతం అతి పెద్ద జీవ వైవిద్యం కలిగిన సుందరమైన అడవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. నల్లమలలో మానవాళికి ఉపయోగపడే మొక్కలు ఉన్నాయి. ప్రధానంగా ఔషధ మొక్కలు, పర్యావరణ సమతుల్యతను కాపాడే అరుదైన, విశిష్టమైన ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. సుమారు 60 రకాల పక్షి జాతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పక్షులు, జంతువులు, వివిధ రకాల చెట్లు ఉండటం వల్ల అడవి మరింత అహ్లాద కరంగా మారుతుంది. అయితే ఒకేరకమైన వెదురు విపరీతంగా పెరిగి మిగిలిన మొక్కలకు విఘాతం కలిగిస్తున్నందున వెదురు పెరుగుదలను కాస్త తగ్గించేందుకు అడవి దున్నలు, బర్రెల అవసరం ఉందని అధికారులు భావించి వాటిని తెప్పిస్తున్నారు.

20 అడవి దున్నలు, గేదెలు తీసుకురానున్నారు

పది అడవి దున్నలు, పది బర్రెలు పాపికొండల్లోని నేషనల్ యానిమల్స్ పార్క్ నుంచి నల్లమలకు తీసుకొస్తున్నట్లు ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విశ్వేశ్వరావు తెలిపారు. మూడు నెలల్లలో ఈ జంతువులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జీవ వైవిద్యం అడవి దున్నలు, బర్రెల ద్వారా సాధించేందుకు వీలు కలుగుతుందని ఉన్నతాధికారులు భావించి పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయం మేరకు తీసుకొస్తున్నామన్నారు. బయోడైవర్సిటీ బాగుంటే మానవ మనుగడ బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Next Story