ఎన్ టి రామారావు, చంద్రబాబు నాయుడు ల హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో పోషించిన పాత్ర ఎలా ఉందంటే...
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం. తెలుగు జాతి స్వాభిమానం, స్వీయ గౌరవం పునరుద్ధరణ లక్ష్యంతో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 1982లో తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను ప్రధాన సూత్రాలుగా టీడీపీ తెలుగు రాష్ట్రాలలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ విలువలు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పొత్తులు, బీజేపీతో సంబంధం, కుల, మత రహిత రాజకీయాలలో ఇద్దరు నాయకుల వైఖరులను ఎలా ఉన్నాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది.
ఎన్ టి రామారావు హయాంలో టీడీపీ విలువలు
తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు దాని పునాది లౌకికవాదం, సామాజిక సమానత్వం, ప్రజల సంక్షేమంపై ఆధారపడింది. ఆయన రాజకీయ విధానాలు తెలుగు సంస్కృతి, గౌరవం, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించాయి. టీడీపీని ఎన్టీఆర్ కుల, మత రహిత పార్టీగా నిర్మించారు. ఆయన పాలనలో అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రూ. 2 కిలో బియ్యం పథకం, గృహ నిర్మాణం, మహిళల సాధికారత వంటి పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలను ఉద్ధరించే ప్రయత్నం చేశారు. రాజకీయ సమావేశాలు, సభల ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకున్నారు. ఆయన నాయకత్వం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టింది. వ్యక్తిగత ఖ్యాతి, సినీ నటుడిగా ఆకర్షణ, స్పష్టమైన రాజకీయ దృక్పథం టీడీపీని ప్రజలకు దగ్గర చేశాయి.
జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్
జాతీయ రాజకీయాలలో ఎన్టీఆర్ చొరవ తీసుకోవడం టీడీపీని ఒక రాష్ట్రీయ పార్టీ నుంచి జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా మార్చింది. ఆయన 1989లో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షునిగా లౌకిక, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే దిశగా కృషి చేశారు. ఈ చొరవ టీడీపీ ఇమేజ్‌ను మరింత పెంచింది. నేషనల్ ఫ్రంట్ ద్వారా సీపీఐ, సీపీఎం, జనతాదళ్, డీఎంకే వంటి పార్టీలతో సమన్వయం చేశారు. ఈ కూటమి కాంగ్రెస్ ఏకపక్ష ఆధిపత్యానికి సవాలుగా నిలిచింది. టీడీపీని జాతీయ రాజకీయాలలో కీలక శక్తిగా నిలబెట్టింది. నేషనల్ ఫ్రంట్ లౌకికవాద భావజాలంపై ఆధారపడింది. ఎన్టీఆర్ ఈ కూటమిని నడిపించడం ద్వారా టీడీపీ లౌకిక, సామాజిక సమైక్యత ఇమేజ్‌ను దేశవ్యాప్తంగా బలపరిచారు. జాతీయ రాజకీయాలలో తెలుగు జాతి గుర్తింపును ప్రముఖంగా చాటారు. ఆయన వ్యక్తిగత కరిష్మా, ఉపన్యాసాలు తెలుగు సంస్కృతిని జాతీయ వేదికపై ఆవిష్కరించాయి. టీడీపీని ప్రాంతీయ గుర్తింపు ఉన్న జాతీయ పార్టీగా ఎదగడానికి దోహదపడ్డాయి.
నేషనల్ ఫ్రంట్ 1989 ఎన్నికలలో కీలక పాత్ర పోషించింది. వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ మద్దతు కీలకంగా నిలిచింది. ఈ పాత్ర టీడీపీని దేశ రాజకీయాలలో నిర్ణయాత్మక శక్తిగా నిలబెట్టింది. జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ఐక్యతను ఎన్టీఆర్ ప్రోత్సహించారు. ఇది భారత రాజకీయాలలో ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని బలపరిచింది. ఈ చొరవ టీడీపీని ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన పార్టీగా గుర్తించేలా చేసింది.
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ పొత్తులు
1995లో చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకత్వాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పార్టీ రాజకీయ వ్యూహాలు, పొత్తులలో గణనీయ మార్పులు వచ్చాయి. చంద్రబాబు ఆర్థిక సంస్కరణలు, సాంకేతికత, ఆధునికీకరణపై దృష్టి సారించారు. అయితే పొత్తుల విషయంలో ఆయన వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది.
చంద్రబాబు కాంగ్రెస్ వ్యతిరేక ధోరణిని ఎన్టీఆర్ అనంతరం కూడా కొనసాగించారు. ఆయన నాయకత్వంలో టీడీపీ కేంద్ర రాజకీయాల్లో బలమైన కింగ్‌మేకర్‌గా ఉద్భవించింది. 1996-1998లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. 1998-2004లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉంది. 1998లో టీడీపీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. 1999 ఎన్నికల్లో టీడీపీ 29 లోక్‌సభ సీట్లు గెలిచి ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ పొత్తు టీడీపీకి కేంద్రంలో రాజకీయ ప్రాముఖ్యతను, ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి నిధులను తెచ్చిపెట్టింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో రహస్యంగా చేతులు కలిపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు కాంగ్రెస్ వ్యతిరేకతను కొనసాగించడంలో టీడీపీ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఇది తెలుగుదేశం పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసింది. 2023 ఎన్నికల్లో చాలా మంది టీడీపీ వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జెండాలు పట్టుకుని ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలం క్షీణించడానికి ఇదొక కారణమని చెప్పొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు చంద్రబాబు వ్యూహం ఉందనే ప్రచారం కూడా ఉంది. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసి ఎన్నికల్లో పోటీ చేయించి సీఎంను చేసేందుకు తెలుగుదేశం పార్టీని పణంగా పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అయినా వాటిని పట్టించుకోలేదు.
బీజేపీతో కూడా సంక్లిష్ట సంబంధాలను చంద్రబాబు నిర్వహించారు. 2002లో గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, బీజేపీతో మళ్లీ కూటమి కట్టారు. ఇది రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించే విధానాన్ని చూపిస్తుంది. 1998 నుంచి బీజేపీతో పొత్తు కొనసాగింది. 2014 ఎన్నికలలో ఈ కూటమి మరింత బలపడింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ, బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. అయితే, 2018లో ప్రత్యేక హోదా అంశంపై విభేదాలతో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. 2024లో మళ్లీ బీజేపీ, జనసేనతో కలిసి ఎన్డీఏలో చేరి ఎన్నికలలో విజయం సాధించింది.
బీజేపీతో పొత్తును ప్రజలు స్వాగతించారా?
టీడీపీ, బీజేపీతో పొత్తు ప్రజలలో మిశ్రమ స్పందనను రేకెత్తించింది. లౌకిక రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్థాపించిన టీడీపీ, హిందుత్వ భావజాలంతో ముడిపడిన బీజేపీతో జతకట్టడం వివాదాస్పదంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, కేంద్ర నిధులపై ఆధారపడిన మధ్యతరగతి, పట్టణ ఓటర్లు ఈ పొత్తును స్వాగతించారు. 2014, 2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయాలు ఈ వర్గాల మద్దతును సూచిస్తాయి. లౌకిక వాదులు, మైనారిటీ సముదాయాలు (ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ సమాజాలు), ఎన్టీఆర్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఈ పొత్తును విమర్శించాయి. బీజేపీ హిందుత్వ ఎజెండా టీడీపీ లౌకిక ఇమేజ్‌కు విరుద్ధంగా అడుగులు వేసిందనే వాదన కార్యకర్తల నుంచి వచ్చింది. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు రావడం, 2019 ఎన్నికలలో ఓటమి, బీజేపీతో పొత్తు వల్ల కొంత మంది సాంప్రదాయ ఓటర్లు దూరమయ్యారని చెప్పొచ్చు. 2024లో మళ్లీ ఎన్డీఏలో చేరడం వల్ల రాష్ట్రంలో అధికారం సాధించడం, ప్రజలు కొంతమేరకు ఈ పొత్తును ఆమోదించారని చెప్పవచ్చు.
కుల, మత రహిత రాజకీయాలలో ఇద్దరికీ ఉన్న తేడా
ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ టీడీపీని కుల, మత రహితంగా నడపడానికి ప్రయత్నించినప్పటికీ, వారి విధానాలు, పరిస్థితులు ఫలితాలను భిన్నంగా నిర్ణయించాయి. ఎన్టీఆర్ విధానంలో నాయకత్వం సామాజిక సమైక్యతపై ఆధారపడింది. ఆయన కమ్మ, కాపు, రెడ్డి, ఇతర సామాజిక వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. మైనారిటీ సముదాయాలతో సన్నిహిత సంబంధాలు కలిగి, లౌకికవాదాన్ని గట్టిగా పాటించారు. ఆయన రాజకీయ సభలు, సందేశాలు తెలుగు జాతి గుర్తింపును బలోపేతం చేశాయి,.కుల, మత భేదాలను అధిగమించాయి.
చంద్రబాబు నాయుడు
చంద్రబాబు ఆధునిక రాజకీయ వ్యూహాలు, పొత్తులపై ఎక్కువ దృష్టి పెట్టారు. బీజేపీతో పొత్తు వల్ల కొంత మంది టీడీపీ లౌకిక ఇమేజ్‌ను కోల్పోయిందని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గంతో చంద్రబాబు ఎక్కువగా ముడిపడి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎన్టీఆర్ సమగ్ర సామాజిక మద్దతుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు మైనారిటీల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేశారు. పొత్తుల విషయంలో రాజకీయ లాభాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఇరువురి మధ్య తేడాలు
ఎన్టీఆర్ రాజకీయాలు భావజాల ఆధారితమై, ప్రజల ఆకాంక్షలతో ముడిపడ్డాయి. చంద్రబాబు రాజకీయాలు ఆచరణాత్మకమై, రాజకీయ అవసరాలకు అనుగుణంగా మారాయి. ఎన్టీఆర్ లౌకికవాదాన్ని స్థిరంగా కాపాడుకున్నారు. కానీ చంద్రబాబు బీజేపీతో పొత్తు వల్ల ఈ ఇమేజ్‌పై ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ సామాజిక సమైక్యత విధానం చంద్రబాబు హయాంలో కొంత బలహీనపడింది. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలం కోల్పోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పొచ్చు.
తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలలో నేషనల్ ఫ్రంట్ ద్వారా తీసుకున్న చొరవ టీడీపీని లౌకిక, ప్రజాస్వామ్య, తెలుగు జాతి గుర్తింపు ఉన్న జాతీయ పార్టీగా ఉన్నత స్థాయికి చేర్చింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ ఆధునికీకరణ, ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించింది. కానీ బీజేపీతో పొత్తు వల్ల లౌకిక ఇమేజ్‌పై విమర్శలు ఎదుర్కొంది. ఎన్టీఆర్ సామాజిక సమైక్యత విధానం చంద్రబాబు హయాంలో కొంత ఆచరణాత్మక రాజకీయాలకు తాకట్టు పెట్టబడింది. అయినప్పటికీ, రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం కోసం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు టీడీపీని ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టాయి. 2024 ఎన్నికల ఫలితాలు బీజేపీతో పొత్తు వ్యూహం రాజకీయంగా విజయవంతమైందని సూచిస్తున్నాయి.