ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికేతర పథకాలపై దృష్టిపెట్టారు. సూపర్ సిక్స్ ఎప్పటికి అమలవుతాయో తెలియని పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కనబెట్టి ఏవేలో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి లడ్డూ వ్యవహారం దేశమంతా ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే లడ్డూలో వాడేది కల్తీనెయ్యి అని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ ప్రక్రియ మొదలైందని, నెయ్యిలో గొడ్డు కొవ్వును కల్తీ చేస్తున్నారని సీఎం చెప్పడంతో ఒక్కసారిగా వెంకటేశ్వరుని భక్తులు ఉలిక్కి పడ్డారు. అయినా లడ్డుల కొనుగోలు ఏమాత్రం తగ్గలేదు.
నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని వదిలేది లేదని సీఎం ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు జరిపేందుకు సిట్‌ను సీఎం ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు, మరికొన్ని పార్టీలు ఈ విషయంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్న నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేయడం ఆశ్చర్యాన్ని గొలిపింది. చంద్రబాబునాయుడు కావాలని కక్షతో అడుగులు వేస్తున్నారని, సిట్ దర్యాప్తును పక్కనబెట్టి సీబిఐ దర్యాప్తు చేయాలని మాజీ టీటీడీ చైర్మన్‌తో పాటు మరికొందరు వ్యక్తలు సుప్రీం కోర్టులో పిటీషన్‌లు వేశారు. ఇవన్నీ విచారణలో ఉన్నాయి. నేడు ఈ పిటీషన్‌లపై జడ్డిమెంట్ రానుంది.
ఇటువంటి పరిణామాలన్నీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వారికి కావాల్సినవి అడగకుండా ఉండేందుకు డైవర్ట్ చేసే రాజకీయాలు నడుపుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. లడ్డు విషయంలో సీఎం మాటలపై కోర్టు స్పందించి ప్రశ్నించడంతో సిట్ దర్యాప్తును కూడా నేటి వరకు ఆపివేశారు. ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబుతో పాటు ఎన్‌డీఏ కూటమి హామీలు ఇచ్చింది.
1. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నెలకు రూ. 3000లు ఇవ్వాలి.
2. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇవ్వాలి.
3. రైతులకు ఏటా రూ. 20వేలు సాయం అందించాలి.
4. ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్‌లు ఇవ్వాలి.
5. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500లు ఉచిత సాయం అందించాలి.
6. మహిళలకు ఏపీలో ఉచిత బస్ ప్రయాణం కల్పించాలి.
ఈ ఆరు పథకాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎన్‌డీఏ కూటమి మాట్లాడుకుని ప్రకటించిన పథకాలు ఇవి. ఈ పథకాల గురించి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనుకుని డైవర్షన్ రాజకీయాలకు ఎన్‌డీఏ కూటమి పాలు పడుతోందనే చర్చ రాష్ట్రంలో మొదలైంది.
బాబు ష్యూరిటీ–భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ఈ ఆరు పథకాలు ప్రకటించారు. బాబు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఒక్కటి కూడా అమలు కాలేదు.
ఇటీవల కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీపావళి నుంచి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మ్యానిఫెస్టోలో మాత్రం ప్రతి ఇంటికీ అన్న సీఎం ఇప్పడు తెల్లకార్డు ఉన్నవారికి వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకాలు కేవలం తెల్లకార్డు ఉన్న వారికి మాత్రమే వర్తిస్థాయని అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాల్లో గ్యాస్ సిలెండర్ల పథకం దీపావళి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించినా అమలులోకి వచ్చే సరికి ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో వేచి చూడాల్సిందే. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీల్లో గత ప్రభుత్వం విధించిన చెత్తపన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ చెత్త సేకరణకు వేల సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేశారు. ఈ వాహనాలను ఎలా ఉపయోగిస్తారో ఇంతవరకు చెప్పలేదు.
ముఖ్యమంత్రి ఆర్థికేతర పథకాలపై మాత్రమే ఆలోచిస్తున్నారని, గత ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని పథకాలతో పాటు అదనంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఏ ఒక్కటీ నేటికీ అమలు చేయడం లేదని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాద్ అన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. స్కూళ్లు మూడు నెలలైనా ఇంతవరకు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఇస్తామన్న రూ. 15 వేలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, మహిళలకు నెలకు రూ. 1500లు, నిరుద్యోగ భృతి, రైతు సాయం వంటి పథకాల మాటే లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది డైవర్షన్ రాజకీయాలేనని, అసలు అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ వ్యవహారం సాగుతున్నట్లు పేర్కొన్నారు.
Next Story