ప్రతీ అంశాన్నిఒక ఈవెంట్‌లా చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్లాన్డ్‌గానే రంగం సిద్ధం చేస్తారు. లేక పోతే సీఎం అయ్యుండి అలా ఎందుకు మాట్లాడుతారు?


తాను అనుకున్న దానిని పకడ్బందీగా ఇంప్లెమెంట్‌ చేయడంలోను, దానిని ఒక మెగా ఈవెంట్‌లా నెరవేర్చడంలోను సీఎం చంద్రబాబుకు మరెవ్వరూ సాటి రారు. తాను పూనుకున్న దానికి సంబంధించి ఒక సీన్‌ క్రియేట్‌ చేయడంలోను, దానిపై అవసరానికి మించి ప్రచారం తెచ్చుకోవడంలోను, అదంతా నిజమేనా అని ప్రజలను నమ్మించడంలోను చంద్రబాబు మార్కు రాజకీయం నెక్ట్స్‌ లెవల్లో ఉంటుంది. ఈ సారి అధికారం చేపట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని అనుకునే క్రమంలో జరిగిన పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అనేక ఈవెంట్ల తరహా సీన్‌లను క్రియేట్‌ చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపడం, లోపాలను ఏకరువు పెట్టడం రాజకీయాల్లో రొటీన్‌గా జరిగే తంతు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు అధికార పీఠంపై ఉండీ కూడా ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నారు. విజయవాడ వరదల నుంచి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వరకు చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే.. బ్యాటింగ్, బౌలింగ్‌ కూడా బాబేనా అనే తీరులో ఉంది. ఒక సారి ఈ పరిణామాలను గమనిస్తే.. అవును బాబు తీరే వేరు అని అనుకోవడం జనం వంతు అవుతుంది.

వరదలు సంభవించడానికి మూడు రోజులు ముందే వాతావరణ విభాగం నుంచి ప్రభుత్వానికి సమాచారం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారాన్ని అందించింది. అయితే దీనిపైన ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఎగువ నుంచి వచ్చిన వర్షపు నీటితో బుడమేరు ప్రవాహం ఉధృతంగా మారింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. గేట్లు ఎత్తేశారు. దీంతో విజయవాడ అతలాకుతలమైంది. ఈ తప్పు నుంచి బయట పడేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా వరద ప్రవాహాలను సందర్శిస్తూ ముంపు ప్రాంతాల పర్యటన చేపట్టారు. అన్నీ తానై సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు చాటి చెప్పేందుకు పూనుకున్నారు.
రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి ఎన్‌ఆర్‌డిఎఫ్‌ బృందాలను, బోట్లను, సిబ్బందిని, చివరికి మిలటరీని కూడా రంగంలోకి దింపారు. విజయవాడ కలెక్టరేట్‌లోనే మకాం పెట్టారు. కొంత సమయం వరద ముంపు ప్రాంతాలను సందర్శించడం, మరి కొంత సమయం అధికారులతో సమీక్షలు నిర్వహించడం చేయం చేశారు. అక్కడ ఒక మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేసి తాను బాధితులను ఆదుకునేందుకు నిద్రాహారం లేకుండా పని చేస్తున్నట్లు ప్రపంచానికి చెప్పుకోవడంపైనే దృష్టి సారించారు. స్వయంగా సీఎం వరదల్లో తిరుగుతుండటంతో ప్రధాన మీడియా అంతా ఆయన చుట్టూనే తిరిగింది. ఇలా ప్లాన్డ్‌గా ప్రధాన మీడియాను తన చుట్టూనే తిప్పుకుంటూ ప్రభావిత ప్రాంతాలు, బాధితుల బాధలను బయట ప్రపంచానికి తెలియనీకుండా చేయగలిగారు. ప్రచారంలో దిట్టగా పేరొందిన సీఎం చంద్రబాబు వరదల సమయంలో బాగా పని చేశారని అనిపించుకోవడంపైన ధ్యాసంతా పెట్టారు.
ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల విషయంలో కూడా ఇదే ధోరణితోనే వ్యవహరించారు. ఒక్క రోజులో బోట్లను వెలికి తీసే అవకాశం ఉన్నా ప్రచారంపైనే దృష్టి పెట్టారు. వెలికి తీయడం ఎన్నిరోజులు ఆలస్యమైతే అన్ని రోజులు ప్రచారం చేసుకోవచ్చనే ఆలోచనలు చేశారు. వైజాగ్‌ నుంచి, కాకినాడ నుంచి బృందాలను తెప్పించి బోట్లను తొలగించేందుకు విశ్వపయత్నాలు చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. దాదాపు పది రోజుల పాటు సీరీస్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేపట్టారు. ఆయన ఆరోపించినట్లు బోట్ల యజమానులను అరెస్టులు చేయడంలో మాత్రం వెనకడుగు వేశారు.
వంద రోజుల పాలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం చేస్తున్నారనే వ్యవహారానికి తెరలేపారు. తిరుపతి లడ్డూ ప్రసాదం, మతం అనేది చాలా సున్నితమైన అంశాలు. కోట్లాది మంది భక్తులు భావోద్రేకాలకు సంబంధించిన అంశం. కొస్త అటు ఇటు అయిన ఉద్రేకాలకు లోనయ్య ప్రమాదం ఉంది. ప్రజలను రెచ్చగొట్టడం, ఉద్రేక పరచే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. దీని వల్ల మత పరమైన గొడవలు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన, దేశంలోనే అత్యంత సీనియర్‌ నేత చంద్రబాబుకు తెలియవని అంటే ఎవరు నమ్ముతారు.
ఇప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. కూటమి ప్రభుత్వమైనా ఆయనే ప్రభుత్వాధినేత. ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. నిగ్గు తేల్చేందుకు చాన్స్‌ ఉంది. దాని కోసం చర్యలు చేపట్టాలి. దోషులుగా ఎవరున్నా కఠినంగా శిక్షించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాధినేత అయిన చంద్రబాబుపై ఉంది. అధికారంలో ఉన్న ఎవరైనా చేసేది, చేయాల్సింది ఇదే. కానీ అవేం చేయలేదు. ఒక సీఎంగా కాకుండా ప్రతిపక్ష నేతగా సున్నితమైన అంశాలను తెరపైకి తెస్తూ వచ్చారు. ఇది కూడా ఒక ప్లాన్‌ ప్రకారంగా సీరీస్‌ వారీగా నడిపిస్తూ వచ్చారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే మత విధ్వేషాలకు కారణంగా నిలుస్తోందనే చర్చలు సర్వత్రా సాగుతున్నాయి.
పవన్‌ కళ్యాణ్‌ అయితే తాను డిప్యూటీ సీఎం అన్న వాస్తవాన్ని మరచి పోయారు. ఇంకో అడుగు ముందుకేసి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలకు పూనుకున్నారు. కల్తీ నెయ్యి లడ్డూ ప్రసాదంపైన ప్రతి హిందువు స్పందించాలని, ప్రతి హిందువు ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రతి హిందువు బయటకు రావాలని, తప్పు జరుగుతుంటే ఇంట్లో చేతులు కట్టుకొని మాకెందుకులే అని కూర్చుని ఉంటే ఇలానే జరుగుతాయని తీవ్ర స్వరంతోనే పసంగాలు చేస్తున్నారు. ప్రభుత్వ అధిపతులై ఉండి ఇలా రెచ్చ గొట్టే ప్రసంగాలు చేయడం ఎంత వరకు సమంజసం. ప్రభుత్వ యంత్రాంగమంతా వీరి చేతిలో పెట్టుకొని చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి సాధారణ ప్రజల మధ్య విద్శేషాలను రెచ్చగొట్టేందుకు దిగడం దేనికి సంకేతమనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది.
Next Story