అభ్యర్థుల ఎంపికలో బాబు విజయం

చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో విజయం సాధించారు. తిరుగుబాట్లులేని సర్థుబాట్లు చేశారు. పార్టీలో సుహృద్భావ వాతావరణం వుంది.


అభ్యర్థుల ఎంపికలో బాబు విజయం
x
Chandrababu

చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా అభ్యర్థుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పలు సర్వేలు చేశారు. ఒకటీ రెండు చోట్ల తప్ప అభ్యర్థులను వ్యతిరేకించిన వారు చాలా తక్కువని చెప్పొచ్చు. పొత్తు ధర్మం పోను అందరిని సముదాయించడం అంటే తమాషా కాదు. ఏదైతేనేమి అభ్యర్థుల ఎంపికలో విజయం సాధించారు. శుక్రవారం ప్రకటించిన తొమ్మితి మంది అసెంబ్లీ అభ్యర్థలతో అభ్యర్థుల ఎంపిక పూరై్తంది.

పాడేరులో మంచి అభ్యర్థినే ఎంపిక చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కె వెంకట రమేష్‌నాయుడు భగత సామాజిక వర్గానికి చెందిన వారు. ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి రావాలని ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల టీడీపీలో చేరి పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. ఈయన తల్లి కూడా రాజకీయ నాయకురాలు. ఇల్లు వెంటకరత్నం పాడేరు మేజర్‌ పంచాయతీకి సర్పంచ్‌గా, ఉప సర్పంచ్‌గా పనిచేశారు. మొదటి నుంచీ వీరిది తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ వారు కూడా భగత సామాజిక వర్గానికి చెందిన విశ్వేశ్వరరాజుకు టిక్కెట్‌ ఇచ్చింది. దీంతో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.
విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిమిడి కళావెంకట్రావును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన కిమిడి కళావెంకట్రావు ఎలాగూ గెలిచేవాడు కాదనే భావనలో టీడీపీ వుంది. ఆయన నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు చీపురుపల్లి సీటు ఇచ్చి బొత్స సత్యనారాయణపై కయ్యానికి పంపించారు చంద్రబాబు.
విశాఖపట్నం జిల్లా భీమిలీ నియోజకవర్గానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు పోరాటం సఫలమైంది. చంద్రబాబు గంటా సీటు మార్చాలని ప్రయత్నించినా పట్టుబట్టి సాధించుకున్నారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్‌ మంచి స్నేహితుడు. రాజకీయంగా వేరైనా ఇక్కడ జరిగే పోటీ స్నేహపూర్వకంగా గెలుపు ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పొచ్చు.
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ అభ్యర్థిగా నియమితుడైన సుగవాసి సుబ్రమణ్యం పాలకొండరాయుడి కుమారుడు. పాలకొండరాయుడిపై ఉన్న సానుభూతి కూడా ఈయనపై లేదని చెబుతుంటారు. రాయచోటి నుంచి వచ్చిన సుబ్రమణ్యం తెలుగుదేశం పార్టీలో నెగ్గుతారా? ఓడతారా? అనేది వేచి చూడాల్సిందే.
కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ అభ్యర్థిగా నియమితులైన వీరభద్రగౌడ్‌ టీడీపీలో బలమైన అభ్యర్థిగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నకల్లో ఓటమి చెందారు. గత ఎన్నికల్లో సీటు రాలేదు. ప్రస్తుత ఎన్నికల్లో సీటు సాధించారు. ప్రస్తుత ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌కు అనుంగు సహచరుడు. జయరాం వైఎస్సార్‌సీపీలో ఉండగా రాజకీయంగా వేరైనా స్నేహితులుగానే ఉండే వారు. ప్రస్తుతం ఇరువురూ ఒకే పార్టీలో ఉండటం, జయరాంకు నియోకవర్గంలో మంచి బలం ఉండటం కూడా వీరభద్ర గౌడ్‌కు కలిసిసొచ్చే అంశం.
గుంతకల్‌ నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాంకు సీటు కన్‌ఫామ్‌ చేశారు చంద్రబాబు. ఎలాగైనా గెలుపు సాధించాలనే పట్టుదలతో జయరామ్‌ ఉన్నారు. ఆయన భార్య నియోజకవర్గం కూడా గుంతకల కావడం, ఎక్కువ మందితో పరిచయాలు ఉండటం జయరామ్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
కదిరి నుంచి పోటీకి దిగుతున్న కందిగుంట వెంకటప్రసాద్‌ టీడీపీ మాజీ ఎమ్మెల్యే. నియోకవర్గంలో పార్టీలోని అన్ని వర్గాలతో సంబంధాలు ఉన్నాయి. చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గంలో మంచి పట్టుంది.
అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ సీటు దక్కించుకున్న దగ్గుబాటి వెంకటవర ప్రసాద్‌ చాలా కాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. గతంలో రాప్తాడు ఎంపిపీగా పనిచేశారు. అప్పట్లో మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. సర్వేల ఆధారంగా ఆయనకు సీటు ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు కుమార్తె. నర్సరావుపేటలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దర్శిలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈమెకు ఇక్కడ గెలుపు సవాల్ గా మారింది.

Next Story