ఆ మేనిఫెస్టో..  వైఎస్ జగన్ రాజీనామా లేఖా..?
x

ఆ మేనిఫెస్టో.. వైఎస్ జగన్ రాజీనామా లేఖా..?

కూటమి మేనిఫెస్టోతో పోలిస్తే.. సీఎం జగన్ రెడ్డి ప్రకటించిన పథకాలు ఆయన రాజీనామా లేఖ రాసుకున్నట్టు ఉంది. అని సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభివర్ణించారు.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అరాచక పాలనను తలపిస్తోందని సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా వ్యాఖ్యానించారు. "అధికార వైఎస్ఆర్సిపి ప్రకటించిన మేనిఫెస్టో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాజీనామా లేఖ రాసుకున్నట్లు ఉంది" అని ఆయన అభివర్ణించారు. గత ఎన్నికల్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్, అనేక హామీలను సీఎం జగన్ గాలికి వదిలేశారని గుర్తు చేశారు.

‘‘2024 ఎన్నికల కోసం టీడీపీ కూటమి స్పష్టమైన హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసి తీరుతాం’’ అని బాలకృష్ణ స్పష్టం చేశారు. కూటమి మేనిఫెస్టోలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా మెగా డీఎస్సీ నిర్వహించడంతోపాటు, సామాజిక పింఛన్లను నాలుగు వేలకు పెంచాలని తీసుకున్న నిర్ణయం తప్పక అమలవుతుందని చెప్పారు.

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏర్పడిన పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఇప్పటివరకు టిడిపి గెలవలేదు. దీనిని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ మురళీమోహన్, టిడిపి చిత్తూరు ఎస్సీ రిజర్వుడ్ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు కోసం బంగారుపాలెంలో " స్వర్ణాంధ్ర సాధన" పేరిట నిర్వహించిన బహిరంగ సభలో టిడిపి నేత, నందమూరి బాలకృష్ణ అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

అవినీతి మరకలతో కలుషితం

"దళితుల పక్షపాతిని" అంటూ, పార్టీ పెట్టిన సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాల ఉద్యమాన్ని గాలికి వదిలేశారని నందమూరి బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అవినీతి మరకలతో కలుషితమైందని దుయ్యబట్టారు. అసమర్థ పాలనతో ప్రజలను పీడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలపై పైశాచికత్వంతో దాడులు చేశారన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలన్నా, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని నందమూరి బాలకృష్ణ అభిప్రాయ పడ్డారు.

నేనొక పూజారిని..

"సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్ళు" అని టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మాటలను ఉటంకించిన నందమూరి బాలకృష్ణ "ఆ దేవాలయంలో నేనొక పూజారిని" అని అన్నారు. పూతలపట్టులో జరిగిన సభలో గతానికి భిన్నంగా ఆయన ఎన్టీఆర్‌ను అనుకరిస్తూ, హావభావాలతో మాట్లాడిన తీరు సభికులను ఆకట్టుకుంది. " పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం. మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత. ముస్లిం మైనారిటీల కోసం అమలు చేసిన పథకాలను ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అనివార్యంగా అమలు చేయాల్సిన పరిస్థితి"కి ఎన్టీఆర్ అమలు చేసిన కార్యక్రమాలు బాటలు వేశాయని బాలకృష్ణ గుర్తు చేశారు. రాష్ట్రంలో మొదటిసారి కడపలో " హజ్ హౌస్" ఏర్పాటు చేసిన ఘనత ఎన్‌టీఆర్‌కే చెందుతుందని అన్నారు.

టిడిపి ఏర్పాటైన తర్వాతే సంక్షేమ కార్యక్రమాలకు బీజం పడిందనే విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. "అరాచక పాలన కావాలో.. సంక్షేమ ప్రభుత్వం కావాలో.. తేల్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది’’ అని ఆయన ఓటర్లకు గుర్తు చేశారు. చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిలో నిర్వహించిన బహిరంగసభ కిక్కిరిసింది. ఈ సభలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ డి.ఉదయకుమార్ రచించిన "సంసిద్ధం" అనే పుస్తకాన్ని బాలకృష్ణ ఆవిష్కరించారు.

Read More
Next Story