అవును వాళ్లిద్దరూ ఎన్టీఆర్‌ బిడ్డలే. జనంలో కలిసి మెలిసి ఉండటంలో మాత్రం ఎవరి స్టైలు వారిదే. ఇప్పుడంతా బాలయ్య.. భువనమ్మల వ్యవహార శైలి హాట్‌ టాపిక్‌.


జి విజయ కుమార్

నటరత్న నందమూరి బాలకృష్ణ.. నారా భువనేశ్వరి వీరిద్దరు పరిచయం అక్కర్లేని ప్రముఖులే. వాళ్లిద్దరూ ప్రజలతో మమేకయ్యే తీరు తాజాగా చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణకు ఇష్టం లేకుండా ఎవరైనా టచ్‌ చేసినా..సెల్ఫీ దిగాలనుకున్నా దబిడి దిబిడే అనేది అనేక సందర్భాల్లో సామాజిక మాధ్యమాల్లోనూ వైరలైంది. ఆయన సోదరి భువనేశ్వరి మాత్రం జనంలో మమేకమవుతున్న తీరు భేష్‌ అని పించుకుంటోంది.
అధికారం దర్పమున్నా..
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కుమార్తెగా.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సతీమణిగా అధికార దర్పం అనుభవించిన ఆమె బయట ప్రపంచంతో సంబంధాలు తక్కువే. హెరిటేజ్‌ సంస్థ నిర్వాహకురాలిగా.. ఇంటిని చక్కదిద్దుకునే ఇల్లాలిగా నిన్న మొన్నటి వరకు ఆమె నాలుగు గోడలకే పరిమితం. అవినీతి, అధికారం దుర్వినియోగం కేసులో అరెస్టై చంద్రబాబు జైలు గోడల మధ్యకు వెళ్లడంతో ఆమె జనంతో మమేకం అయ్యేందుకు బయటకు అడుగేశారు. నిజం గెలవాలనే పేరుతో చంద్రబాబు కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శకు పయనమయ్యారు. చంద్రబాబు విడుదల అనంతరం కొద్ది రోజుల పాటు నిజం గెలవాలనే కార్యక్రమాలకు తాత్కాలికంగా ఫుల్‌ స్టాప్‌ పెట్టినప్పటికీ ఎన్నికలు సమీపించడంతో ఆమె మళ్లీ జనంలోకి చురుకుగా వెళ్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం, మహిళలతో ఇంటరాక్షన్‌ కావడం, ప్రజలతో మమేకమవ్వడం, టీడీపీ శ్రేణులను సమన్వయం చేసుకోవడం వంటి కార్యక్రమాలతో బిజీ అయ్యారు. ఓ వైపు చంద్రబాబు మరో వైపు లోకేష్‌ రాజకీయ ప్రచార, సమీకరణలలో బిజీ గా గడుపుతుంటే ఆమె మాత్రం ప్రజల సానుభూతి అస్త్రాన్ని పొందేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఎత్తుగడల గురించి అంతగా తెలియని భువనేశ్వరి ప్రజలకు దగ్గరగా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆకట్టుకోవడం గమనార్హం. టీడీపీ శ్రేణుల్లో ఇదే విషయమై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఎన్టీఆర్‌ వారసుడిగా..
ఎన్టీఆర్‌ వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టిన బాలకృష్ణ అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ఇటు సామాన్య ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలను మాత్రం చేయలేక పోయారు. కనీసం ఆయనతో సెల్ఫీ దిగాలని వచ్చిన వారికి సైతం చెంప దెబ్బలు తప్ప లేదు. సినిమాల్లో గుక్క తిప్పుకోకుండా ఏక దాటిగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పే బాలయ్య రాజకీయ సభల్లో ఉపన్యసించాలంటే మాత్రం గుక్క తిరగదు. మాట మాటకు తడుము కోవడం, ఏమి మాట్లాడుతున్నాడో పొంతన లేక పోవడం, చివరి అది ప్రజలకు అర్థం కాక గందరగోళంగా మారడం బాలయ్య స్టైల్‌. సినీ నడుటుగా.. ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం కలిగిన బాలయ్య ప్రజలతో మమేకం కావడంలో మాత్రం హీరో కాలేక పోయారు. భువనేశ్వరి మాత్రం తాను చెప్పాలనుకున్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పి ఆకట్టుకోవడం విశేషం.
Next Story