బాలినేని శ్రీనివాసరెడ్డి అక్టోబర్ 4న జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమావాస్య రోజులు అయిపోయిన తర్వాత చేరాలని చెప్పినట్లు సమాచారం.
జనసేన పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరేందుకు ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. సూచన ప్రాయంగా వచ్చేనెల 4న పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. వచ్చేనెల 3న అమావాస్య. అమావాస్య తరువాత పాడ్యమిరోజు మంచిగానే ఉంటుదని, ఆరోజు ఒంగోలులో సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసి సంచలనం స్రుస్టించారు.
ఎంతమందిని తనతో తీసుకుపోతారు
జనసేనలో చేరే సమయంలో తనతో పాటు ఎంతమంది వైఎస్సార్ సీపీ వారిని తీసుకు పోతారనేద చర్చనియాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన ఒక్కరు మాత్రమే పవన్ కళ్యాణ్ ను కలిసారు. గురువారం రాత్రి విజయవాడ నుంచి బయలుదేరి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ముఖ్యులు ఎవ్వరూ బాలినేని శ్రీనివాసరెడ్డని కలవలేదు. జనసేన నాయకుల్లో కొందరు బాలినేనిని కలిసారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడు జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు అజయ్ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. వీరు వైఎస్సార్ సీపీని వీడి జనసేనలో చేరుతారా? లేదా? అనే చర్చ కూడా మొదలైంది. మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు కొందరు ఉన్నారు. వారితో పాటు కొందరు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు బాలినేని పక్షానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమ ప్రాంతంపై బాలినేని ప్రభావం
ప్రస్తుతం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన వర్గం కూడా బాలినేని బాట నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి, ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కూడా బాలినేని వైపు మొగ్గు చూపుతున్నారని అక్కడి వారు చెబుతున్నారు. గిద్దలూరు వైఎస్సార్సీపీ నాయకుల్లో రెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది బాలినేని వెంట నడిచే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో బాలినేని ప్రభావం ఉంటున్నందున ఆ నియోజకవర్గాల్లోని నాయకులు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. ఇక కనిగిరి నియోజకవర్గంలోనూ కొందరు బాలినేని వెంట వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒంగోలుపై బాలినేని ప్రభావం ఎంత?
ఒంగోలు నియోజకవర్గంపై బాలినేని ప్రభావం ఎంత ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. కాపులు ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు ఒంగోలులో బంధువులు ఉన్నారు. టీవీఎస్ షోరూం అధినేత రవిశంకర్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. రోశయ్యకు బంధువు అవుతాడు. వీరంతా జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తతం ముస్లిమ్ సామాజిక వర్గానికి చెందిన రియాజ్ ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. మొదట బాలినేని చేరికను వ్యతిరేకించినా పవన్ కళ్యాణ్ చెప్పిన తరువాత బాలినేనితో కలిసి ఫొటో కూడా దిగారు. అంటే బాలినేని నాయకత్వాన్ని సమర్థించారని చెప్పొచ్చు.
దర్శి ఎమ్మెల్యేకు వైఎస్సార్ సీపీ పగ్గాలు ఇస్తారా?
బీసీల్లో యాదవులు ఎక్కువగానే ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నారు. వీరు మొదటి నుంచీ బాలినేని వైపు ఉన్నారు. ఇప్పుడు బాలినేనితో నడుస్తారా? లేదా? అనే చర్చ కూడా సాగుతోంది. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షునిగా పెట్టి జిల్లా రాజకీయాలు నడపాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్ భావిస్తున్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. జడ్పీటీసీల్లో ఎక్కువ మంది టీడీపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ లో సగం మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మిగిలిన వారు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అటు మునిసిపల్ కార్పొరేషన్ లో సగం మంది కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ లో సగం మంది కార్పొరేటర్లు జనసేనవైపు వచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.