మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలందరిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.


మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన వ్యవస్థాపక దినోత్సవంలో సంచనల వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నా కుటుంబం, నా వియ్యంకుడి కుటుంబ ఆస్తులు కాజేశాడు. నాకు ఎంతో అన్యాయం చేశాడు. ఆయన గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో మంత్రిగా, ముఖ్య నాయకునిగా ఒక వెలుగు వెలిగిన బాలినేని ఆ పార్టీని ఇటీవల వీడిన తరువాత మొదటి సారిగా జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మాజీ ఎమ్మెల్యేలపై విచారణ జరపాలి

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు (నాతో సహా) అందరిపై విచారణకు ఆదేశించాలన్నారు. కోట్లు సంపాదించారు. స్కాములు చేశారు. వాళ్లను లోపల వేయాలని చెప్పడం విశేషం. అవినీతి వైఎస్సార్సీపీ హయాంలో పెచ్చు మీరిందని బాలినేని చెప్పకనే చెప్పారు. అవినీతి పరుల పార్టీగా వైఎస్సార్సీపీని వర్ణించారు. నాతో పాటు మాజీలపై విచారణ జరగాలని చెప్పారంటే ఏ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

తండ్రి సంపాదించిన వాటిలో సగం అమ్ముకున్నా..

నా తండ్రి సంపాదించిన ఆస్తుల్లో రాజకీయాల కోసం సగం ఆస్తులు అమ్ముకున్నానని అన్నారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా చెబుతున్నా ఇది నిజం అన్నారు. ఆర్థికంగా తన కుటుంబం ఎంత నష్టపోయిందో మున్ముందు చెబుతానని చెప్పారు. పలు మార్లు జగన్ అకృత్యాలను చెబుతానంటూ మైక్ పట్టుకోగానే చెప్పటం విశేషం.

రఘురామ కృష్ణ రాజును కొట్టించారు..

ఎంతో మందికి జగన్ అన్యాయం చేశారని, శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు ను అకారణంగా అరెస్ట్ చేసి చావ కొట్టించావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యను అవమానించిన వల్లభనేని శంశీ మోహన్, మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను అవమానంగా మాట్లాడిన పోసాని కృష్ణమురళిని జైళ్లలో పరామర్శించి వారి తరపున న్యాయ పోరాటం చేస్తున్న జగన్ ఒక నాయకుడేనా అని ప్రశ్నించారు. నాయకుల కుటుంబాల గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నిప్పులు చెరిగారు. జగన్ మనస్తత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు.

నన్ను మంచి వాడన్నప్పుడే జనసేనలో చేరి ఉండాల్సింది

ఒంగోలులో పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కరే మంచి వారని, ఆ పార్టీలోని నాయకులంతా చెడ్డవారేని అన్న రోజే నేను జనసేన పార్టీలో చేరి ఉండాల్సింది. అలా చేయకపోవడం నాతప్పు అని అన్నారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు మాట్లాడతారని, నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశాను. ఏనాడూ అవినీతిని దగ్గరికి రానివ్వలేదు. నా ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశానన్నారు. నా ఆస్తులతో పాటు నా వియ్యంకుడి ఆస్తులు కూడా జగన్ కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా..

నేను జనసేన పార్టీలో చేరేందుకు పూర్తిస్థాయి సహకారం అందించింది నాగబాబు, ఆయన సహకారంతోనే నేను పార్టీలో చేరాను. మా నాయకుడు పవన్ కల్యాన్ వద్ద ఒక్క మాట చెప్పాను. నాకు మీనుంచి పదవులు కావాలని కోరుకోవడం లేదు. మీతో ఒక సినిమా తీయాలని ఉందన్నాను. తప్పకుండా సినిమా చేస్తాన్నారని చెప్పారు. అది చాలు నాకు అంటూ చెప్పటం విశేషం.

రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ అంటే అభిమానం

నాకు రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నాకు ఎన్ టీ ఆర్ అన్నా అభిమానం. వైఎస్సార్ రాజకీయ బిక్ష పెట్టారనే కృతజ్ఞత తోనే కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. నాలుగు సంవత్సరాలు మంత్రి పదవిని కూడా వదిలేశానని, ఆ కృతజ్ఞత కూడా జగన్ కు లేదన్నారు.

Next Story