బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం అపాయింట్‌మెంట్ ఎందుకివ్వలేదు? వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఉన్న రాజకీయ స్పర్థలే కారణమా?
మూడు రోజులుగా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం విజయవాడలోని ఒక హోటల్‌లో ఉండి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదురు చూశారు. అయినా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు రాలేదు. పిలిచినప్పుడు రావొచ్చు, ఇక వెళ్లటం మంచిది అనుకున్నారో ఏమో... బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీని వెనుక ఏముంది? ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు? ఇప్పటికే రెండు సార్లు సీఎంను ఇటీవల కాలంలో బాలినేని కలిసారు. కలిసిన ప్రతిసారీ కొన్ని షరతులు విధించడం, అవి కొలిక్కి రాకపోవడం తెలిసిందే. సీఎం వద్దే షరతులు పెట్టే పరిస్థితి ఉంటే ఏమి మాట్లాడాలో అర్థం కాక సీఎం కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం మానేసినట్లు సమాచారం. పైగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైవీ సుబ్బారెడ్డి తరపున సీఎం జగన్‌కు బంధువు అవుతారు.
ఒంగోలులో ఈ అలజడి ఎందుకు?
ఒంగోలు నియోజకవర్గంలో వర్గరాజకీయాలు నిత్యం అలజడి సృష్టిస్తున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి తన బావమరిది అయిన వైవీ సుబ్బారెడ్డితో రాజకీయ విరోధిగా మారారు. వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇస్తే నేను ఒంగోలు నుంచి పోటీ చేయనని, నాదారి నేను చూసుకుంటానని చెబుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ వద్ద కూడా స్పష్టం చేశారు. గత ఎన్నికల్లోనూ బాలినేని వత్తిడి మేరకు వైవీ సుబ్బారెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.
బాలినేని సీఎం వద్ద గతంలో ఏమి చెప్పారు?
నేను ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే అక్కడి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అందుకు భూ సేకరణ చేయాల్సి ఉంది. దీని కోసం రూ. 170 కోట్లు కావాలి. ఆ మొత్తం ఇస్తే నేను తప్పకుండా గెలిచి చూపిస్తానని సీఎం వద్ద చెప్పారు. ఆ నిధులు ఇవ్వాలని సీఎంవో అధికారి ధనుంజయ్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. అయితే నిధుల కొరత ఉండటంతో ధనుంజయ్‌రెడ్డి నిధులు ఇవ్పటి వరకు ఇవ్వలేకపోయారు. వాయిదాలు వేస్తూ వస్తున్నారు.
ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా బాలినేని పోటీ చేయరా?
25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. లబ్ధిదారుల జాబితా కూడా రెడీ అయింది. అయితే నిధులు లేకపోవడంతో సీఎంవో నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా తాను ఒంగోలు నుంచి పోటీ చేయలేనని సన్నిహితుల వద్ధ స్పషం చేశారు.
వైవీకి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇస్తే బాలినేని జనసేనలోకి..
వైవీ సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇస్తే తాను జనసేనలో చేరి ఒంగోలు నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా టిక్కెట్ తీసుకుంటే బాలినేని మాట చెల్లుబాటు కానట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి తోడు బాలినేనితోనే అడుగులు వేస్తున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయ భవిష్యత్‌పై కూడా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో నేను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని సీఎం వద్ద బాలినేని షరతులు పెట్టారు. బాలినేని చెప్పిన ప్రకారం మార్కాపురం టిక్కెట్ జంకె వెంకటరెడ్డికి, దర్శి టికెట్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి సీఎం దాదాపు కన్‌ఫాం చేశారు. కనిగిరి మాత్రం సందిగ్ధంలో ఉంది. అయితే కొండపి, సంతనూతలపాడు నియోకవర్గాల్లోని అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని సీఎం బాలినేనికి చెప్పారు.
వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇవ్వనున్నారనే సమాచారం అందుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం నుంచి బుధవారం వరకు విజయవాడలో ఉండి సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.
సీఎంవో నుంచి పిలుపు వచ్చేవరకు వెళ్లకూడదని నిర్ణయం
తాను మూడు రోజులు ప్రయత్నించినా సీఎం అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో అలకబూనిన బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శిద్దా రాఘవరావులు సమాలోచనలు చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు నుంచి నన్ను పోటీ చేయాలని సీఎం చెప్పారు. మీ సపోర్టు లేకుండా నేను ఒంగోలులో పోటీ చేయలేను. నన్నేమి చేయమంటారో చెప్పాలని శిద్దా రాఘవరావు బాలినేని వద్ద మాట్లాడారు. దీంతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. బాలినేని ఏమి చేయాలో సీఎం ఇంతవరకు తేల్చి చెప్పలేదు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఒక వారం రోజులు అజ్ఞాతంలోకి పోవడం మంచిదనే ఆలోచనలో బాలినేని ఉన్నట్లు సమాచారం.
Next Story