ఇదొక ఫ్లాప్‌ షో. సీఎం ఎందుకొచ్చారో?ఏమి తెలుసుకున్నారో?అర్థం కాని పరిస్థితి. సీఎంగా జగన్‌ డెవలప్‌ చేసిన బాపట్ల స్కూల్‌లో చంద్రబాబు మెగా మీట్‌ పేరుతో షో చేశారు.


బాపట్లలో మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ పేరుతో కూటమి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం ఖర్చు రూ. 10 కోట్లు. ఆ సమావేశానికి సీఎం చంద్రబాబు ఎందుకు వచ్చారో? ఏమి తెలుసుకున్నారో? అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇదొక పొలిటికల్‌ మెగా ఈవెంట్‌గా నిర్వహించారు. ఇదొక ప్లాప్‌ షో. సీఎం చంద్రబాబు పర్యటన వల్ల బాపట్లకు ఒరిగింది శూన్యమని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కోన రఘుపతి ధ్వజమెత్తారు. బాపట్ల వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతి అంశాన్ని రాజీయంగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అలవాటేనని, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన మెగా మీట్‌ను కూడా దాని కోసమే ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.

ఆరు నెలల్లో విద్యా రంగం కోసం కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఏమి ఆశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారో అంతా అయోమయం పరస్థితి నెలకొందన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలపై మాట్లాడతారేమో అని అంతా అనుకున్నారని కానీ నిరాశ మిగిల్చారన్నారు. కనీసం బాపట్ల మెడికల్‌ కళాశాల సమస్యలపై కూడా స్పందించ లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా తల్లికి వందనం ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. సీఎంగా జగన్‌ డెవలప్‌ చేసిన బాపట్ల స్కూల్‌లో చంద్రబాబు మెగా మీట్‌ పేరుతో షో చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.1.30 కోట్లు వెచ్చించి ఈ పాఠశాలను ఆధునీకరించామని, తరగతి గదులు, కొత్త రీడింగ్‌ టేబుల్స్, లైట్లు, ఫ్యాన్లు వంటి ఏర్పాటు చేశామని, వాటిని ఉపయోగించుకుంటూ చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని రఘుపతి ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రభుత్వంలో బాపట్లలోని 140 పాఠశాలలకు రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి వసతులు కల్పించారని అన్నారు.

Next Story