ఆంధ్రాలో బీసీ ఓటర్లు ఎవరివైపు... మావైపే అంటున్న పార్టీలు

బీసీల ఓట్లే లక్ష్యంగా ఆంధ్రా పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీసీలకు అధికారం ఇవ్వడంలో తామంటే తాము ముందున్నామని చెబుతున్నాయి. ఎందుకంత బిసి ప్రేమ


ఆంధ్రాలో  బీసీ ఓటర్లు ఎవరివైపు... మావైపే అంటున్న పార్టీలు
x
జయహో బీసీ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తున్న నారా లోకేష్, అచ్చెన్నాయుడు

2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు అధికార పక్షమైన వైఎస్సార్‌సీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు బీసీల మీద గురిపెట్టాయి. బీసీల ఓట్లే లక్ష్యంగా ఇరు పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీసీలకు అధికారం ఇవ్వడంలో తాము ముందున్నామంటే తాము ముందున్నామని ఆయా పార్టీలు చెబుతున్నాయి.

పార్టీలో బీసీలకు టీడీపీ ప్రముఖ స్థానం
బీసీలకు రాజ్యాధికారం మాతోనే సాధ్యమవుతుందని టీడీపీ ఆవిర్భావంలో ఎన్టీఆర్‌ చెబుతూ వచ్చారు. ఆ మేరకు ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉండగా పలువురు బీసీ ఎమ్మెల్యేలు మంత్రులుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీని ఓన్‌ చేసుకున్నారు. ఆ తరువాత అధికారం చేపట్టిన నారా చంద్రబాబునాయడు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ ఓట్‌ బ్యాంక్‌ అప్పట్లో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఉండటం వల్ల టీడీపీ బీసీలపై దృష్టిపెట్టి ముందుకు సాగింది. దీనికి తోడు జనాభాలో బీసీలు సగ భాగం ఉండటం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ అనగానే ఎక్కువమంది బీసీలకు అవకాశం ఇచ్చిన పార్టీగా టీడీపీ నేతలు చెబుతుంటారు. ప్రస్తుతం టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షునిగా కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు.
బీసీల కోసం ఆదరణ
చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా బీసీలకు ప్రత్యేకించి ఆదరణ పథకం అమలు చేశారు. దీంతో చాలా మందికి లబ్ధి చేకూరింది. బీసీ కార్పొరేషన్‌ ద్వారా పలు సబ్సిడీ పథకాలు బీసీలకు అమలు జరిగాయి. చంద్రబాబు హయాంలోనే మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (ఎంబీసీ) కార్పొరేషన్‌ ఏర్పాటు జరిగింది. కొన్ని బీసీ కార్పొరేషన్‌ల ఏర్పాటుకు టీడీపీ హయాంలోనే శ్రీకారం చుట్టారు.
బీసీల్లో పట్టుకు వైఎస్సార్‌సీపీ యత్నం


టీడీపీకి బీసీల మీద ఉన్న పట్టును చీల్చి ఓట్లు రాబట్టుకునేందుకు వైఎస్సార్‌సీపీ వ్యూహం రూపొందించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అందులో భాగంగా 2019 ఎన్నికల్లో బీసీలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపీ స్థానాల్లో ప్రధాన్యత కల్పించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన గుర్తింపు ఇచ్చారు. బీసీల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించింది వైఎస్సార్‌సీపీనేనని చెప్పుకున్నారు.
ప్రస్తుతం 32 మంది బీసీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. వీరిలో 11మంది మంత్రులు ఉన్నారు. లోక్‌ సభ ఎంపీలుగా నలుగురు ఉన్నారు. రాజ్యసభ సభ్యులుగా నలుగురు ఉన్నారు. అంటే వైఎస్సార్‌సీపీ కూడా మంచి ప్రాధాన్యతే ఇచ్చిందని చెప్పవచ్చు.
56 బీసీ కార్పొరేషన్‌లు
139 బీసీ కులాలు ఉంటే వారందరికి కలిపి 56 బీసీ కార్పొరేషన్‌లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అంతవరకు బాగానే ఉన్నపప్పటికీ నిధులు కేటాయించకపోవడం, సబ్సిడీ పథకాలు లేకపోవడంతో ఇవి అలంకార ప్రాయంగా మిగిలాయని బీసీ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సామాజిక సాధికార యాత్రల పేరుతో వైఎస్సార్‌సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను రంగంలోకి దించింది. ఎక్కువగా బీసీ నాయకులతో సభల్లో మాట్లాడిస్తున్నారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో బీసీలకు ఎంతో సాయం అందించామని, అలాగే ఎస్సీ, ఎస్టీలకు కూడా ఎంతో మంచి చేశామని సభల్లో చెబుతున్నారు.
టీడీపీ జయహో బీసీ కార్యక్రమం
ప్రస్తుతం జయహో బీసీ పేరుతో బీసీలను చైతన్య పరిచేందుకు రెండు నెలల కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రకటించారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కార్యక్రమాలు ఉంటాయని ఆయన చెప్పారు. బీసీలకు ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తామని లోకేష్‌ వెల్లడించారు. ఈనెల 4నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఎప్పుడూ లేనంతగా బీసీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిందని సీఎం జగన్‌ అంటున్నారు. ఆయన తరపున మాట్లాడే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలుసార్లు లెక్కలు చెప్పి తామే బీసీ ఉద్ధరణకు పాటు పడుతున్నామని చెప్పారు.
పార్టీ ఏదైనా బీసీలకే మా మద్దతు
పార్టీ ఏదైనా కావొచ్చు. బీసీలకు సగం సీట్లు కేటాయించాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. అటువంటి పార్టీలకు మా మద్దతు ఉంటుంది. గత ఎన్నికల్లోనూ అలాగే మద్దతిచ్చాం. ఇప్పుడు కూడా అలాగే మద్దతిస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారు బీసీల అభివృద్దికి కృషి చేయాలి.
–కేశన శంకర్‌రావు, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం.
చెప్పటం మానుకుని చేసి చూపించాలి
స్వాతంత్య్రం వచ్చి 76ఏళ్లు దాటినా ఇంకా బీసీలకు అవి ఇస్తున్నాం.. ఇవి ఇస్తున్నాం.. అనే కాడనే పాలకులు ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది అది కాదు. పాలనా భాగస్వామ్యం. ఎక్కువ మంది బీసీలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల్లో టిక్కెట్లు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలి. దీనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు భాగస్వామ్యం కూడా సగభాగం ఉండాలి.
–నిమ్మరాజు చలపతిరావు, వెటరన్‌ జర్నలిస్ట్‌.
Next Story