ఆంధ్రప్రదేశ్‌లోని బీసీలకు టీడీపీతోనే రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత వచ్చిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మరి కొంత మంది టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు సాధికారత కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 23–7–1970న జీవో 1793 ద్వారా బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. అప్పటికి టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు అసలు పుట్ట లేదన్నారు. నాడు తీసుకొచ్చిన జీవో వల్ల లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని తెలిపారు.
1987లో ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించింది వాస్తవమే, కానీ 1993లో కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. దీని వల్ల లక్షలాది మంది బీసీలు స్థానిక సంస్థల్లో సర్పంచులుగాను, మండల పరిషత్ అధ్యక్షులుగాను, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లుగాను, మున్సిపల్ చైర్మను గాను, మేయర్లుగాను ఎన్నికయ్యారని వెల్లడించారు.
2008కి ముందు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే స్కాలర్ షిప్‌ల పథకం వుండేదని, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటుగా బీసీ విద్యార్థులకు కూడా ఫీజ్ రీయింబర్మెంట్, స్కాలర్షిప్ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. దీని వలన లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొందారని తెలిపారు. 1968లోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమీషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 1974లో బీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. 1975లో బీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేసింది. 2009లో ఉప్పర, వాల్మీకి, పూసల, భట్రాజుల కార్పొరేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బీసీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు, దోబీ ఘాటు,్ల స్టడీ సర్కిళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయన్నారు. బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే జయంతిని, వర్ధంతిని అధికార పూర్వకంగా నిర్వహించాలని ఉత్తర్వులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిందన్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా బీసీలకు సాధికారిత కల్పించింది కాంగ్రెస్ పార్టీయే అని తులసి రెడ్డి వెల్లడించారు.