Karnool Kondareddy Buruju

కర్నూలు జిల్లా కుల రాజకీయాలకు వేదికగా మారుతోంది. ఒకప్పుడు కొనసాగిన రెడ్ల హవా ఇప్పుడు కుదేలైంది. బీసీలు నిర్ణేతలుగా ఎదిగారు.


కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో కులాలకు ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గం హవా సాగింది. నేడు బీసీల హవా కొనసాగుతోంది. పార్టీలు కూడా రెడ్లను పక్కనబెట్టి బీసీలకు సీటు కేటాయిస్తున్నాయి. 1952 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు 12 సార్లు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీలుగా గెలిచారు. పార్టీల పరంగా చూస్తే 12 సార్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్‌కు ఎంత బలమైన నియోకవర్గమో అర్థం చేసుకోవచ్చు. రెండు సార్లు తెలుగుదేశం పార్టీ గెలవగా అందులో ఒకరు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కాగా ఒకరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆరు సార్లు కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచారు. ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఆయన తమ్ముడు కోదండరామిరెడ్డి గెలుపొందారు. విజయభాస్కర్‌రెడ్డి కొడుకు జయసూర్య ప్రకాష్‌రెడ్డి మరో రెండు సార్లు గెలిచారు. 1971 నుంచి రెండు సార్లు మినహా 2014 వరకు కోట్ల కుటుంబమే 9సార్లు కర్నూలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్య వహించింది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి నియోజకవర్గ ప్రజలు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.

మారిన సీన్‌
2014 నుంచి సీన్‌ మారింది. రెడ్లు కాకుండా బీసీలు గెలవడం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో కోట్ల కుటుంబం వెనుకబడింది. 2014 ఎన్నికల్లో కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి మూడోస్థానానికి వెళ్లారు. వైఎస్సార్‌సీపీ తరుపున పోటీ చేసిన బుట్టా రేణుక గెలుపొందారు. అయితే ఆమె వైఎస్సార్‌సీపీని కాదని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత అక్కడ ఇమడలేక తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రేణుకను కాదని డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇచ్చి గెలిపించింది. రెండు సార్లు బీసీలు గెలిచారు. ఒక విధంగా ఓటర్లు వైఎస్సార్‌సీపీని గెలిపించారంటే పూర్వపు కాంగ్రెస్‌ పార్టీ వారినే గెలిపించారని చెప్పవచ్చు.
కర్నూలు పార్లమెంట్‌లోని పత్తికొండ నియోకవర్గం నుంచి 2014లో కెఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అంటే కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో బీసీలకు పదేళ్ల నుంచి పెరిగిన ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
కాంగ్రెస్‌ పుంజుకుంటుందా?
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 2013లో రాష్ట్ర విభజన జరిగింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఊసేలేకుండా పోయింది. కాంగ్రెస్‌ వారంతా ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో కాంగ్రెస్‌ ఘోరపరాజయంతో అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయింది. కర్నూలు పార్లమెంటుకు సంబంధించి 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బుట్టారేణుకను అభ్యర్థిగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ తరపున బీటీ నాయుడు అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేశారు. అప్పుడు ఆయనకు 1,16,603 ఓట్లు వచ్చాయి. ఇవి తక్కువేమీ కాదు. కాంగ్రెస్‌ అంతటా తుడిచిపెట్టుకుపోయినా ఇన్నిఓట్లు వచ్చాయంటే కోట్ల కుటుంబాన్ని అక్కడి ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. తిరిగి 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న జయసూర్యప్రకాష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని టీడీపీ తరపున పోటీ చేశారు. 4,53,665 ఓట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్‌ తరపున బరిలో ఉన్న అహ్మద్‌ అలీఖాన్‌కు 36,258 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం జయసూర్యప్రకాష్‌కు టీడీపీ పార్లమెంట్‌ టిక్కెట్‌ ఇస్తుందా? వేరే వారికి ఇస్తుందా వేచి చూడాల్సిందే. కాంగ్రెస్‌ పార్టీ తన పూర్వ వైభవాన్ని నిలబెట్టుకోవడానికి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకుని కర్నూలు పార్లమెంట్‌ నుంచి రంగంలోకి దించుతుందా అనే చర్చకూడా సర్వత్రా ఉత్కంఠకు దారితీస్తోంది.
2024 ఎన్నికల సంకేతాలేమిటి?
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈయన వాల్మీకి సామాజికవర్గానికి చెందివారు. మంత్రి స్థానంలో ఉండి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ముగ్గురు అభ్యర్థులను పరిశీలనలోకి తీసుకుంది. ముగ్గురూ కురవ/యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. డాక్టర్‌ రామ్‌ప్రసాద్, కుంచ లక్ష్మీనారాయణ, సినీ డైరెక్టర్‌ నాగరాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురూ కాదనుకుంటే మాజీ ఎంపీ కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డిని రంగంలోకి దించేందుకు తగిన చర్యలు టీడీపీ తీసుకున్నట్లు సమాచారం.
ఏడు అంసెంబ్లీల్లో వైఎస్సార్‌సీపీ సగానికే పరిమితమా!
కర్నూలు పార్లమెంట్‌ నియోకవర్గంలో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు, పత్తికొండ, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం అందరూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కోడుమూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేను కాదని మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తమ్ముడు డాక్టర్‌ సతీష్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ అభ్యర్థిగా ప్రకటించారు. స్థానికుడు కాకుండా ప్రకాశం జిల్లా మార్కాపురం వాసిని మేము అంగీకరించేది లేదని స్థానికులు నిర్థ్వంధంగా చెబుతున్నారు. ఆలూరు, ఎమ్మిగనూరుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఏడు నియోకవర్గాల్లో మూడు నియోజక వర్గాలు మినహా నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురు గాలి వీస్తున్నట్లు సమాచారం.
Next Story