ఒంగోలు నుంచి పోటీకి సిద్ధంగా ఉండండి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావును వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం.


ఒంగోలు నుంచి పోటీకి సిద్ధంగా ఉండండి
x
సీఎం జగన్‌తో శిద్దా రాఘవరావు, తనయుడు సుధీర్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శిద్దా రాఘవరావుతో ఈ విషయం చెప్పారు. రాజకీయాలకు కేంద్ర బిందువైనందున ఒంగోలు నుంచి మీ వంటి వారు బరిలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని జగన్‌ వ్యక్తం చేశారు. ఈనెల 2న శిద్దా రాఘవరావును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఒంగోలు నుంచి పోటీకి సిద్దంగా ఉండాలని సూచించారు. అయితే తనకు ఒంగోలు కంటే దర్శి నియోజకవర్గం అనుకూలంగా ఉంటుందని సీఎం వద్ద శిద్దా చెప్పారు. ఆ విషయాన్ని వదిలేయన్నా అంటూ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సీఎం వద్ద ఏమి చెప్పాలో అర్థం కాక తలూపి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే శిద్దా రాఘవరావుకు గిద్దలూరు టిక్కెట్‌ ఇస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే అవేవీ కరెక్టు కాదని స్పష్టమైంది. హైడ్రామా, అలకలు, లుకలుకలు, బుజ్జగింపుల అనంతరం పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

సన్నిహితులతో సమాలోచనలు
సీఎం ఒంగోలు నుంచి పోటీకి సిద్ధంగా ఉంచాలని చెప్పిన తరువాత శిద్దా రాఘవరావు బంధువులు, కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరిపారు. ఒంగోలు నుంచి పోటీ చేస్తే వచ్చే లాభ నష్టాల గురించి చర్చించారు. సీఎం పోటీ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నందున అన్నీ ఆయనే చూసుకుంటారనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో పోటీకి సిద్ధమయ్యారని సన్నిహితుల ద్వారా తెలిసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు సుదీర్‌లు కలిసారు. ఆసమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. బాలినేని మద్దతు తీసుకోవడానికి వీరు బాలినేనిని కలిసినట్లు తెలిసింది. అయితే ఏమి చర్చించారనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు.
మాగుంట, బాలినేని ఏకాంత చర్చలు


ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు గురు, శుక్రవారాలు హైదరాబాద్‌లోని బాలినేని నివాసంలో ఏకాంత చర్చలు జరిపారు. రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి మాట్లాడుకున్నారు. ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నందున భవిష్యత్‌ కార్యాచరణపై వారు చర్చించుకున్నారని సన్నిహితులు చెప్పారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి సలహా మేరకు గత ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టిక్కెట్‌ను జగన్‌ ఇచ్చారు. మాగుంట రంగంలోకి రావడంతో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది. నిజానికి వైవీకి ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాల్సి గత ఎన్నికల్లోనే ఇవ్వాల్సి ఉంది. బాలినేని నుంచి వ్యతిరేకత రావడం, బాలినేని మాగుంటను పార్టీలోకి తీసుకురావడంతో జగన్‌ అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇరువురిని ఒంగోలు రాజకీయాలకు దూరం చేస్తాయని వారికి స్పష్టత వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డిని గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా సీఎం జగన్‌ చెప్పినట్లు సమాచారం. సీఎం ఈ విషయంలో పట్టుదలతో ఉండటంతో చేసేది లేక గిద్దలూరు నుంచి పోటీ చేయడం తప్పేట్లు లేదని సన్నిహితుల దగ్గర బాలినేని చెబుతున్నారు. ఇపుపడు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పరిస్థితే అయోమయంలో ఉంది. వైఎస్సార్‌సీపీలో టిక్కెట్‌ రాకుంటే తిరిగి టీడీపీలో చేరుతారా? అక్కడ కూడా అవకాశం లేకుంటే కాంగ్రెస్‌ను ఆశ్రయిస్తారా? వేచి చూడాల్సి ఉంది.
ఒంగోలుకు శిద్దానే ఎందుకు?
ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా శిద్దా రాఘవరావును సీఎం ఎందుకు ప్రతిపాదించారనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నది. తెలుగుదేశం పార్టీలో ఉండగా శిద్దా రాఘవరావు ఒకసారి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దర్శి నియోజకవర్గం నుంచి గెలిచి టీడీపీ హయాంలో అటవీ శాఖ, ఆర్‌అండ్‌బీ, రవాణా, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన కాలంలోనూ, ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనూ వివాద రహితునిగా ఉన్నారు. పార్టీ పరంగా కూడా ఎవరిపైనా విమర్శలు చేసిన దాఖలాలు కూడా లేవు.
ఒంగోలు నియోజకర్గంలో బలమైన వర్గంగా వైశ్య సామాక వర్గం ఉంది. ప్రధానంగా పట్టణంలో వైశ్యులు ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. శిద్దా రంగంలోకి వస్తే టీడీపీలో ఉన్న వైశ్యులు కూడా కలిసికట్టుగా శిద్దాకు సపోర్టు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా శిద్దా బలవంతుడు కావడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఓట్లను రాబట్టుకునే సత్తా రాఘవరావుకే ఉందని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. కరణం బలరాం కూడా శిద్దాకు గట్టిగా మద్దతు పలుకుతారు. పార్టీ ఆదేశాల ప్రకారం బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు కూడా ఉంటుంది. ఇవన్నీ శిద్దాకు కలిసొచ్చే అంశాలు అయినందున ఆయనను ఒంగోలు నుంచి రంగంలోకి దించాలని అధిష్టానం భావించింది.
ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైవీ సుబ్బారెడ్డి?


పార్లమెంట్‌ సభ్యునిగా ఒంగోలు నుంచి ముఖ్యమంత్రి చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మాగుంటకు సీటు ఇస్తున్నానని జగన్‌ వైవీకి చెప్పిడంతో తిరిగి ఒంగోలు టిక్కెట్‌ అడగలేకపోయారు. అయితే ముందు నుంచే ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాలని నిర్ణయించుకున్న వైవీ సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. ఆయనకు అనుకూలమైన నియోజకవర్గం ఒంగోలు మాత్రమేనని చెప్పాలి. ఎందుకంటే మొదటి సారిగా ఒంగోలు పార్లమెంట్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 80వేలకు పైబడి మెజారిటీతో గెలుపొందారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైవీకి మంచి పట్టు ఉంది. నాయకులే కాకుండా ప్రజలు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసి సాగు, తాగునీరు ప్రజలకు అందుబాటులోకి తేవాలంటూ టీడీపీ హయాంలో జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు అప్పట్లో మంచి స్పందన వచ్చింది. దీంతో పశ్చిమ ప్రాంత ప్రజల్లోనూ ఆయనకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.
వైవీ సుబ్బారెడ్డి రాజకీయాల్లో ఉండటాన్ని బావ బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో మాగుంటను బాలినేని రంగంలోకి దించారు. అయితే ఈ సారి ముఖ్యమంత్రి బాలినేనిని గిద్దలూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. పలు మార్లు ఒంగోలు నియోజకర్గంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న సీఎం ఈ ప్రతిపాదనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
Next Story